గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 19 డిశెంబరు 2014 (09:07 IST)

జకీఉర్ రెహ్మాన్ లఖ్వీకి బెయిల్.. అప్పీలు చేయనున్న పాకిస్థాన్!

26/11 ముంబై దాడుల సూత్రధారి, నిషేధిత లష్కరే తోయిబా ఆపరేషన్స్ కమాండర్ జకీఉర్ రెహ్మన్ లఖ్వీకి స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేయడానికి వ్యతిరేకంగా పాకిస్థాన్ ప్రభుత్వం అప్పీల్ చేయాలని నిర్ణయించింది. అయితే, ఉగ్రవాదాన్ని ఈ ప్రాంతం నుంచే తరిమేద్దామని, పాక్‌లో ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలిద్దామని పాక్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ పిలుపునిచ్చిన మర్నాడే లఖ్వీ బెయిలు మంజూరు కావడం గమనార్హం.
 
ఇదే బెయిలుపై పాక్ ప్రభుత్వ ప్రాసిక్యూషన్ చీఫ్ చౌధ్రీ అజహర్ స్పందిస్తూ ‘ఈ నిర్ణయాన్ని మేం ఊహించలేదు. బెయిల్ మంజూరు కన్నా ముందే మరిన్ని సాక్ష్యాలను మేం కోర్టుకు హాజరుపరిస్తే బావుండేది’ అని చెప్పుకొచ్చారు. లఖ్వీపై సాక్ష్యాధారాలు బలంగా లేనందువల్ల ఆయనకు బెయిల్ మంజూరైందని లఖ్వీ తరపు న్యాయవాది రాజా రిజ్వాన్ అబ్బాసీ తెలిపారు. 
 
26/11 కేసుకు సంబంధించిన మరో ఆరుగురు నిందితులకు కూడా బెయిల్ కోరుతూ త్వరలో కోర్టులో దరఖాస్తు చేస్తామన్నారు. భద్రతాకారణాల వల్ల ఈ కేసును రావల్పిండిలోని అడియాల జైల్లో రహస్యంగా విచారిస్తున్నారు. 2008లో ముంబైపై దాడి జరగగా, 2009 నవంబర్‌లో ప్రారంభమైన ఈ కేసు విచారణ వరుస వాయిదాలు, సాంకేతిక కారణాలతో నత్తనడకన నడుస్తోంది. లఖ్వీకి బెయిల్ మంజూరవడంపై భారత్ తీవ్రంగా స్పందించింది.