శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 29 సెప్టెంబరు 2016 (15:26 IST)

మేం చేతగాని దద్దమ్మలం కాము.. ప్రతిదాడులు తప్పవు.. భారత్‌కు పాకిస్థాన్ హెచ్చరిక

పాకిస్థాన్ ఆక్రమిక కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం మెరుపుదాడి చేసి ఉగ్రవాదులను హతమార్చడంతో అంతర్జాతీయ నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత్ దాడుల నేపథ్యంలో పాకిస్థాన్

పాకిస్థాన్ ఆక్రమిక కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం మెరుపుదాడి చేసి ఉగ్రవాదులను హతమార్చడంతో అంతర్జాతీయ నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత్ దాడుల నేపథ్యంలో పాకిస్థాన్ ప్రతిదాడులకు దిగవచ్చని భావిస్తున్నారు. దీంతో ఎల్ఓసీకి 10 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాల వాసులను భారత సైన్యం తరలిస్తోంది. 
 
అదేసమయంలో భారత్ దాడులపై పాక్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ స్పందిస్తూ ‘‘పాక్‌ భూభాగంలో ఎలాంటి వైమానిక దాడినిగానీ, భూతల దాడిని గానీ సహించబోం. ఒకవేళ భారత్ సర్జికల్‌ స్ట్రయిక్‌ చేస్తే మేం వెంటనే స్పందిస్తాం’’ అని ఆయన హెచ్చరించారు. అయితే పాక్‌పై సర్జికల్‌ స్ట్రయిక్స్‌ చేశామని భారత్ తాజాగా ప్రకటించిన నేపథ్యంలో పాక్‌ మాత్రం మరోలా స్పందించింది. సర్జికల్‌ స్ట్రయిక్స్‌ జరగనే లేదని అంటోంది. దాడులు చేసినట్లు భారత్ బలమైన ఆధారాలు చూపిన పక్షంలో పాక్‌ ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాల్సిందే. 
 
ఇదిలావుండగా, భారత సైన్యం నియంత్రణ రేఖ దాటి తమ వైపున్న ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేస్తే ప్రతి దాడి చేయడానికి పాకిస్థాన్‌ ఇప్పటికే వ్యూహరచన చేసింది. భారత ఒకవేళ సర్జికల్‌ స్ట్రైక్స్‌కు దిగితే ప్రతిగా భారత్‌లో ఏయే లక్ష్యాలపై దాడి చేయాలో పాక్‌ సైన్యం ముందుగానే నిర్ణయించుకుందని పాక్‌కు చెందిన ‘ది న్యూస్‌’ పత్రిక కొద్ది రోజుల కిందట ప్రచురించిన విషయం తెల్సిందే. 'భారత్ నుంచి సైనికపరంగా ఏ సవాలు ఎదురైనా తిప్పికొట్టేందుకు పాక్‌ సర్వసన్నద్ధంగా ఉంది. ఆపరేషన్స్‌ పరంగా మా ప్రణాళిక సిద్ధమైంది. ఎదురుదాడులకు లక్ష్యాలను ఎంచుకున్నాం. అందుకోసం బలగాలను కూడా కేటాయించాం' అని ఆ పత్రిక పేర్కొంది.