గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 24 నవంబరు 2015 (10:07 IST)

ఐఎస్ స్థావరాలపై దాడికి 'చార్లెస్ డి గాలే' : మూడో ఉగ్రవాది ఫోటో రిలీజ్

పారిస్ నగరంలో నరమేధం సృష్టించిన ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) అంతు చూసేదాకా ఫ్రాన్స్ నిద్రపోయేలా కనిపించడం లేదు. ఇప్పటికే ఐఎస్‌పై ప్రత్యక్ష యుద్ధం ప్రకటించిన ఫ్రాన్స్.. ఇరాక్, సిరియాల్లో ఉన్న ఐఎస్ స్థావరాలను నిర్వీర్యం చేసే పనిలో నిమగ్నమైంది. ఇందుకోసం అత్యాధునిక విమాన వాహక నౌక చార్లెస్‌ డి
గాలేను సైతం రంగంలోకి దించింది. డిగాలేపై నుంచి ఇరాక్‌లో ఐఎస్‌ స్థావరాలపై ఫ్రాన్స్‌ దాడులను ముమ్మరం చేసింది. 
 
ఇటీవల పారిస్‌లో ఉగ్రవాదుల దాడులతో అప్రమత్తమైన ఫ్రాన్స్‌ ఈ ప్రతీకార దాడులను చేపట్టింది. మేము ఉగ్రవాదులను తీవ్రంగా నష్టపరిచే లక్ష్యాలను ఎంపిక చేసుకొని దాడులు నిర్వహిస్తామని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు హోలాండే ప్రకటించారు. చార్లెస్‌ డి గాలే ప్రత్యేకతలను పరిశీలిస్తే.. ఫ్రాన్స్‌కు ఉన్న ఏకైక విమాన వాహన నౌక ఇదే. రెండు అణురియాక్టర్ల సాయంతో ఇది పనిచేస్తుంది. 2.3 బిలియన్‌ పౌండ్ల వ్యయంతో 13 ఏళ్ల కృషితో నిర్మించారు. 38,000 టన్నుల బరువుతో 195 మీటర్ల పొడవు ఉంటుంది. ఇది రంగంలోకి దిగితే ఆ ప్రాంతం నేలమట్టం కావాల్సిందే. 
 
ఇదిలావుండగా, పారిస్‌లోని నేషనల్‌ స్టేడియం బయట ఆత్మాహుతి దాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదుల్లో... మూడో వ్యక్తి ఫొటోను ఫ్రాన్స్‌ పోలీసులు సోమవారం విడుదల చేసి, అతని వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ స్టేడియం వద్ద దాడికి పాల్పడిన ముగ్గురిలో ఇప్పటి వరకూ పోలీసులు కేవలం ఒకరిని మాత్రమే గుర్తించారు. అతడిని బెల్జియంలో నివసిస్తున్న ఫ్రాన్స్‌ దేశస్థునిగా నిర్ధారించారు. 
 
దాడి తర్వాత బెల్జియం పారిపోయినట్లుగా అనుమానిస్తున్న సలాహ్‌ అబ్దెస్లాం కోసం పోలీసులు గాలిస్తున్నారు. దాడులు జరిగిన కన్సర్ట్‌ హాల్‌ను ఫ్రాన్స్‌ అధ్యక్షుడు హోలండ్‌, బ్రిటన్‌ ప్రధాని కేమరాన్‌ సోమవారం సందర్శించి... మృతులకు నివాళులు అర్పించారు. పారిస్‌ దాడుల నేపథ్యంలో బెల్జియంలో సోదాలు ముమ్మర మయ్యాయి. 16 మందిని అరెస్టు చేశారు.