శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 18 డిశెంబరు 2014 (19:03 IST)

నా ఫ్రెండ్ నా ఒడిలో చనిపోతే ఎలా మరిచిపోమంటారు?

నా ఫ్రెండ్ నా కళ్లముందే.. నా ఒడిలోనే చనిపోతే ఎలా మరిచిపోమంటారు అని పెషావర్ మారణకాండ ప్రత్యక్ష సాక్షి ఇంటర్మీడియట్ చదువుతున్న అమీన్ ప్రశ్నిస్తున్నాడు. ఏడేళ్లుగా కలిసి చదువుకుని, ఒకే బెంచ్‌లో పక్కపక్కనే కూర్చున్న తన స్నేహితుడు మరణిస్తే ఎలా మర్చిపోవడం అంటూ తల్లడిల్లిపోతున్నాడు.  
 
తన లాగే తన స్నేహితులు కొందరు బుల్లెట్ గాయాలతో ఆసుపత్రిలో ఉన్నారని, జరిగిన దారుణాన్ని ఎన్నటికీ మర్చిపోనని చెప్పిన అమీన్, తన స్నేహితుడ్ని మర్చిపోవడం అసాధ్యమని పేర్కొన్నాడు.
 
పెషావర్ దారుణ మారణకాండకు ప్రత్యక్ష సాక్షి ఇంటర్మీడియట్ చదువుతున్న అమీన్ జరిగిన దారుణం గురించి మాట్లాడాడు. ఇంటర్వెల్ సమయంలో కళాశాల కారిడార్‌లో తన స్నేహితుడితో మాట్లాడుతుండగా ఉగ్రవాదులు స్కూల్‌లో చొరబడి కాల్పులకు తెగబడుతున్నారని తెలిసింది.
 
దీంతో తామిద్దరం కెమిస్ట్రీ ల్యాబ్ లోకి పరుగెత్తుకెళ్లి దాక్కున్నామని అన్నాడు. అయితే ఉగ్రవాదులు ల్యాబ్‌ను కూడా వదల్లేదని తెలిపాడు. ల్యాబ్ తలుపులు తీసి లోపలికొచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరిపారని తెలిపాడు. దీంతో ల్యాబ్‌లో తనతోపాటు ఉన్న ఐదుగురు విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులు మరణించగా, తన స్నేహితుడు తన ఒడిలోనే రక్తపుమడుగులో మరణించాడని తెలిపాడు. 
 
తనకు బుల్లెట్ తగిలి స్పృహ కోల్పోవడంతో మరణించానని భావించి తీవ్రవాదులు వెళ్లిపోయారని తెలిపాడు. గంట తరువాత వచ్చిన సైనికులు తనను కాపాడారని చెప్పాడు. జరిగిందంతా హారర్ సినిమాలా అనిపించినా అది వాస్తవమని తెలిపాడు.