గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 16 డిశెంబరు 2014 (21:07 IST)

తాలిబన్లది పిరికిపంద చర్య : మలాలా యూసుఫ్‌జాయ్!

పెషావర్‌లోని సైనిక పాఠశాలపై దాడి చేసి 160 మంది ప్రాణాలను బలిగొన్న పాక్ తాలిబన్లపై నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసుఫ్ జాయ్ మండిపడ్డారు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన ఆమె... తాలిబన్లది పిరికిపంద చర్యగా అభివర్ణించారు. పిల్లలపై ఇలాంటి చర్యలకు దిగడం అమానుషమని పేర్కొన్నారు. ఉగ్రవాదుల దాడికి తాము భయపడబోమని స్పష్టం చేశారు. 
 
మరోవైపు.. పాకిస్థాన్‌లోని పెషావర్‌లో సైనిక చర్యలు ముగిశాయి. దాదాపు తొమ్మిది గంటలపాటు కొనసాగిన ఆపరేషన్‌లో ఆరుగురు ఉగ్రవాదులను పాక్ సైన్యం మట్టుబెట్టింది. ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారి సంఖ్య 160కి చేరగా, వీరిలో 125 మంది విద్యార్థులున్నారని సైనికాధికారులు వెల్లడించారు. మరో 122 మంది గాయపడ్డారని... వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ప్రతి తరగతి గదిని తిరుగుతూ, పిల్లలను పిట్టల్లా కాల్చేశారని అధికారులు తెలిపారు. పిల్లలను నిలబెట్టి తలపై కాల్చినట్టు తెలుస్తోందని డాక్టర్లు చెప్పారు. 
 
ఇదిలావుండగా, పెషావర్‌లోని సైనిక పాఠశాలపై తాలిబన్లు జరిపిన దాడిలో చనిపోయిన బాధిత కుటుంబాలకు స్థానిక ఖైబర్ పక్తుంఖ్వా రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఈ దాడిలో చనిపోయిన వారి ఒక్కొక్క కుటుంబానికి రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షలు చొప్పున ఇవ్వనున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్వేజ్ ఖట్టాక్ తెలిపారు. మరోవైపు సైనిక సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.