శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 31 జులై 2015 (17:52 IST)

మెమన్‌ ఉరితో కాశ్మీర్ రాజుకుందా‌..? మొన్న పాక్, ఐసిస్.. నేడు మహ్మద్ జెండాలు!!

యాకూబ్ మెమన్‌ను నాగ్‌పూర్ జైలులో ఉరితీయడంతో జమ్మూకాశ్మీర్‌ రాజుకుంటుంది. మెమన్ ఉరి పట్ల కాశ్మీర్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. మెమన్ వంటి ఉగ్రవాదుల ఉరితీత ప్రతీకార చర్యనే ఉసిగొల్పుతుందని అనేక మంది అభిప్రాయపడిన నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్‌లో పాకిస్థాన్, ఐఎస్ఐఎస్ చర్యలు పెచ్చరిల్లిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొన్నటికి మొన్న పాకిస్థాన్ జెండాలు మాత్రమే జమ్మూకాశ్మీర్‌లో ఎగిరేవి.. ఈ మధ్య కాలంలో శ్రీనగర్లో పాక్ జెండాలతో పాటు ఐఎస్ఐఎస్ జెండాలు కూడా రెపరెపలాడుతున్నాయి. 
 
తాజాగా యాకూబ్ మెమన్ ఉరి నేపథ్యంలో నిషేధిత ఉగ్రవాద సంస్థ జైష్ ఏ మహ్మద్ జెండాలు కూడా ఎగిరాయి. భారత జాతీయ జెండా కంటే ఎక్కువ సార్లు పాక్, ఐఎస్ఐఎస్ జెండాలు ఎగరడం ఆందోళనకరమైన విషయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రార్థనలు ముగిసిన అనంతరం నిరసనకారులు మెమన్ అనుకూల, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ పేట్రేగిపోయారు. నిన్న మొన్నటి వరకు పాక్ అనుకూల నినాదాలకు పరిమితమైన ఆందోళనలు ఇప్పుడు భారత వ్యతిరేకత నినాదాలతో మరింత రాజుకుంటున్నాయి. 
 
పహారా కాస్తున్న పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో ఎప్పట్లానే ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కాగా, యాకూబ్ మెమన్‌ను అన్యాయంగా ఉరి తీశారని హురియత్ కాన్ఫరెన్స్ నేత ఉమర్ ఫరూఖ్ అభిప్రాయపడ్డారు. కాగా జమ్మూ కాశ్మీర్‌లో ఏర్పడిన పరిస్థితిని పరిష్కరించేందుకు కేంద్ర హోం శాఖ, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏవిధమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.