శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , గురువారం, 20 ఏప్రియల్ 2017 (10:26 IST)

సరస్వతీ నది ఎండిపోలేదా.. మరి మన కళ్లముందే మహానది మాయమైపోయింది కదా..

మూడు వేల సంవత్సరాల క్రితం పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తున్న సరస్వతి ఉన్నట్లుండి అదృశ్యమై భూమి అంతర్భాగంలో కలిసిపోయిందని మన పురాణాలు చెబుతుంటే కల్పిత గాధ అని వ్యతిరేకించేవారే తప్ప ఆ కథనాల్లో కొంతయినా వాస్

మూడు వేల సంవత్సరాల క్రితం పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తున్న సరస్వతి ఉన్నట్లుండి అదృశ్యమై భూమి అంతర్భాగంలో కలిసిపోయిందని మన పురాణాలు చెబుతుంటే కల్పిత గాధ అని వ్యతిరేకించేవారే తప్ప ఆ కథనాల్లో కొంతయినా వాస్తవం ఉంటుందేమో అని ఆలోచించేవారే కరువయ్యారు. జలప్రవాహాలు దిశలు మార్చుకోవడమో, ప్రకృతి వైపరీత్యాలు ప్రభావం చూపడమో అందుకు కారణం అయి ఉంటుందని ఊహించడానికి కూడా ఎవరికీ మనసొప్పలేదు. కానీ వందల ఏళ్లుగా ప్రవహిస్తున్న ఒక నది మన కళ్లముందే నాలుగు రోజుల్లో మాయమైతే..నమ్మక తప్పదు మరి.
 
కెనడాలో వందల సంవత్సరాల నుంచి ప్రవహిస్తున్న ఓ నది కేవలం నాలుగు రోజుల్లోనే మాయమైంది. జలకళతో విలసిల్లే ఆ నది ఒక్కసారిగా వట్టిదైపోయింది. వాతావరణ మార్పులే ఇందుకు కారణమనీ, భూతాపం పెరిగి, హిమనీనదం వేగంగా కరగడం వల్లే ఇలా జరిగిందని పరిశోధకులు అంటున్నారు. మామూలుగా కెనడాలోని కస్కవుల్ష్ హిమనీనదం మెల్లగా కరుగుతూ ఆ నీరంతా స్లిమ్స్‌ నదిలోకి చేరేది.
 
స్లిమ్స్‌ నది క్లుయేన్‌ అనే మరో నదిలో, అది యుకోన్‌ అనే ఇంకో నదిలో సంగమమై, చివరకు ఆ నీరంతా బేరింగ్‌ సముద్రంలో కలిసేది. కానీ 2016 మే 26 నుంచి 29 మధ్య తీవ్రాతితీవ్రమైన వడగాలుల కారణంగా హిమనీనదం వేగంగా కరిగిపోయింది. ఇంతకాలం హిమనీనదం అడ్డుగా ఉండటంతో నీరు స్లిమ్స్‌ నదిలోకి వెళ్లేది. ఇప్పుడు ఒక్కసారిగా హిమనీనదం కరిగిపోయి అటుపక్క తగ్గు ఏర్పడటంతో నీరంతా వ్యతిరేక దిశలోకి పరుగులు పెట్టింది. అనంతరం అలా 1,300 కి.మీ ప్రయాణించి పసిఫిక్‌ సముద్రంలో కలిసింది.
 
ప్రకృతిని ధ్వంసం చేయడంలో మనిషి పాత్ర ఎంత ప్రధానమైనదో మనందరికీ తెలుసు.. భూమ్మీద పర్యావరణ విధ్వంసం కారణంగా ఇలాంటి సరస్వతులు ఎన్ని అదృశ్యం కానున్నాయో తల్చుకుంటేనే భయం కలుగుతోంది.