గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 28 జులై 2015 (18:56 IST)

తుమ్మినా భారతే కారణమా? అయ్యా మోదీ.. పాకిస్థాన్‌కు ఎలా బుద్ధి చెప్తారు..?

తుమ్మినా కూడా దానికి కారణం భారత దేశమేనని పాకిస్థాన్ అంటోంది. నిన్న పంజాబ్‌లో పాక్ ఉగ్రవాదులు బీభత్సం సృష్టించి, నేడు మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త అబ్దుల్ కలాం మృతితో యావత్ భారతదేశం శోకసంద్రంలో మునిగిపోయివుంటే.. భారతదేశంపై పాక్ విమర్శలు గుప్పిస్తూ అగ్నికి ఆజ్యం పోస్తోంది. ఇటీవల నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ బలగాలు ఓ డ్రోన్‌ను నేలకూల్చాయి. 
 
అయితే, ఆ డ్రోన్‌ను భారత సైన్యమే తమ భూభాగంలోకి పంపిందని తొలుత పాకిస్థాన్ ఆరోపించగా, ఆ డ్రోన్ తయారీదారైన చైనా సంస్థ డీజేఐ తాము ఆ డ్రోన్‌ను ఏ ప్రభుత్వానికీ విక్రయించలేదని క్లారిటీ ఇచ్చింది. కానీ, పాకిస్థాన్ మాత్రం అది భారత్‌కు చెందినదేనంటూ గట్టిగా వాదిస్తోంది. దాన్ని ఆపరేట్ చేసింది భారత సైన్యమేనని ఈ విషయం ఫోరెన్సిక్ పరీక్షల ద్వారా తేలిపోయిందని పాకిస్థాన్ ఆర్మీ పేర్కొంది. 
 
ఇంకా డ్రోన్‌లో నిక్షిప్తమైన ఛాయాచిత్రాలను వెలికితీసి పరీక్షించగా, అది భారత్ నుంచి వచ్చినట్టు తెలిసిందని పాకిస్థాన్ ఆర్మీ ప్రతినిధి తెలిపారు. తమ వద్ద ఆధారాలున్నాయని స్పష్టం చేశారు. అయితే ఈ వార్తలను ఖండించే స్థితిలో కూడా భారత్ లేదు. పంజాబ్‌లోని దీనార్ పోలీస్ స్టేషన్‌పై టెర్రరిస్ట్ ముష్కరులచే దాడి జరగడంతో కోపంలో ఊగిపోతున్న భారత దేశ ప్రజలకు పాకిస్థాన్ చేసే విమర్శలు సైతం ఆగ్రహాన్ని రగులుస్తున్నాయి. 
 
మరోవైపు దాయాది దేశంతో కాశ్మీర్ అంశం, టెర్రరిస్టు అంశం కూడా పరిష్కరించే దిశగా కేంద్రం ముందడుగు వేయట్లేదు. నరేంద్ర మోడీ సర్కారు కేంద్రం గద్దెనెక్కితే ఏదో చేస్తేస్తుందని అందరూ భావించారు. అయితే నరేంద్ర మోడీ సర్కారు కాశ్మీర్ అంశంతో పాటు ఉగ్రవాద ముప్పుకు ఎలా చెక్ పెడుతుందనేది ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశమైంది. పంజాబ్ ఘటనపై మంగళవారం పార్లమెంట్‌లో ప్రకటన చేయాల్సిన కేంద్రం కలాం మృతికి సంతాపం తెలిపింది.
 
దీన్నే అవకాశంగా తీసుకున్న పాకిస్థాన్ మొన్నటికి మొన్న జరిగిన డ్రోన్ దాడిని భారత్‌కు అంటగడుతోంది. పంజాబ్‌లోకి చొరబడ్డ టెర్రర్ ముష్కరులపై పాకిస్థాన్ నోరెత్తకుండా.. ఆ దాడిని ఖండించకుండా డ్రోన్ దాడికి భారత్ కారణమంటూ.. సాక్ష్యాలున్నాయంటూ వ్యాఖ్యానించడంపై రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు. పాక్ ముష్కరుల చేసిన దాడిలో ఎస్పీతో పాటు 13 మందిని ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు. 
 
అయితే ఉగ్రవాదులకు భారత భద్రతా బలగాలు తగిన గుణపాఠం చెప్పాయి. సైనిక దుస్తుల్లో కారులో ప్రయాణించి.. అక్రమంగా పంజాబ్ రాష్ట్రంలోకి ప్రవేశించిన నలుగురు ఉగ్రవాదుల్లో ముగ్గురిని హతమార్చగా, ఒక తీవ్రవాదిని మాత్రం ప్రాణాలతో పట్టుకున్నారు. ఇదేవిధంగా పాకిస్థాన్ ఆట కట్టించి.. శాంతియుత వాతావరణం కోసం టెర్రరిస్టులకు సరైన గుణపాఠం చెప్పేందుకు ప్రధాని మోదీ కసరత్తు చేస్తారని దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారు.