గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 4 అక్టోబరు 2015 (10:53 IST)

భారత్ ఎపుడైనా ఆచరణాత్మక చర్చలకు రావాల్సిందే : నవాజ్ షరీఫ్

భారత్ ఏదో ఒక రోజున ఆచరణాత్మక చర్చలకు రావాల్సిందేనని పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ అన్నారు. ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో పాల్గొన్న అనంతరం పాక్ తిరిగి వెళుతూ, లండన్‌లో ఆగిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎప్పుడో ఒకసారి వాస్తవిక, ఆచరణయోగ్యమైన ప్రతిపాదనలతో భారత్‌ మాతో చర్చలకు రావాల్సిందే. పాకిస్థాన్‌ భూభాగంలో ఉగ్రవాద దాడులలో భారత్‌ పాత్ర ఉంది. ఇందుకు మా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఇటువంటి పరోక్ష యుద్ధం వల్ల ఇరుదేశాలకూ ప్రయోజనం లేదు. 70 ఏళ్లుగా మన మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు సమసిపోయేలా మంచి సూచనలతో భారత్‌ మా వద్దకు రావాలి అని పిలుపునిచ్చారు. 
 
తమతో భారత్ నిత్యమూ పరోక్ష యుద్ధం చేస్తున్నదని వ్యాఖ్యానించిన ఆయన ఇది ఎంతమాత్రమూ మంచిది కాదని హితవు పలికారు. తాము చర్చలకు రావాలని పిలుపునిస్తున్నా, భారత్ స్పందించడం లేదని ఆరోపించారు. ఇరు దేశాల మధ్య శాంతి కోసం నాలుగు సూత్రాలను తాము ప్రతిపాదిస్తున్నట్టు తెలిపారు. సియాచిన్‌లో మోహరించిన భారత బలగాలను వెనక్కు తీసుకోవాలని నవాజ్ షరీఫ్ డిమాండ్ చేశారు.