గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 30 అక్టోబరు 2014 (17:19 IST)

ఐదుగురు తమిళ జాలర్లకు శ్రీలంక కోర్టు మరణశిక్ష!

తమిళనాడుకు చెందిన ఐదుగురు జాలర్లకు శ్రీలంక కోర్టు మరణ శిక్ష విధిస్తూ గురువారం తీర్పునిచ్చింది. 2011లో మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో వీరిని శ్రీలంక నౌకాదళం అరెస్టు చేసింది. ఈ కేసు విచారణ శ్రీలంక కోర్టులో మూడేళ్ళ పాటు సాగగా, గురువారం తుది తీర్పును వెలువరించింది. అయితే, ఈ తీర్పుపై వారు లంక సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకునేందుకు 14 రోజుల సమయాన్ని కోర్టు కేటాయించింది. 
 
ఉరిశిక్ష పడిన వారిలో ప్రసాద్, అగస్టస్, విల్సన్, ఎమర్సన్, లాంగ్‌లెడ్‌లు ఉన్నారు. కాగా, ఈ ఐదుగురు జాలర్లను 2011లో శ్రీలంక నౌకాదళం బలవంతంగా కిడ్నాప్ చేసి, కొలంబోకు తీసుకెళ్లి మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసును బనాయించినట్టు ఆరోపణలు ఉన్నాయి. 
 
కాగా, లంక కోర్టు ఇచ్చిన తీర్పుపై భారత విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ స్పందించారు. ఈ విషయంపై దృష్టి సారించినట్టు తెలిపారు. కింది కోర్టు ద్వారా ఈ తీర్పు వెల్లడైందని, పైకోర్టులో ఈ కేసును మేము సవాలు చేస్తామన్నారు. మరోవైపు లంక కోర్టు తీర్పుపై తమిళనాడు ప్రభుత్వ, ఇతర రాజకీయ పార్టీలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.