బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : మంగళవారం, 24 మే 2016 (09:40 IST)

సిరియాలో ఉగ్రవాదుల భీభత్సం.... 148 మందికి పైగా మృతి

సిరియాలోని జాబ్లే, టార్టస్ నగరాలపై ఐసిఐస్ ఉగ్రవాదులు భీభత్సం సృష్టించారు. సిరియాలో వేర్వేరు ప్రాంతాల్లో జరిపిన వరుస బాంబు దాడుల్లో 148 మంది చనిపోయారు. జాబ్లేలో 100 మంది, టార్టస్‌లో మరో 48 మంది చనిపోయారు. వందలాది మందికి తీవ్రగాయాలు కావడంతో సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. టాకియా ప్రావిన్సులోని టార్టస్, జబ్‌లేహ్ నగరాల్లో లెవాంట్ గ్రూపుకు చెందిన జిహాదీలు ఆత్మాహుతి దాడులు, కారు బాంబు దాడులు చేసి విధ్వంసం సృష్టించారు. బస్‌స్టేషన్లను, ఇతర రద్దీ నగరాలను టార్గెట్ చేస్తూ ఈ దాడికి పాల్పడ్డారు.
 
 టార్టస్ నగరంలో సుమారు మూడు చోట్ల  భారీ బాంబు పేలుళ్లు సంభవించాయి. జబ్‌లేహ్ నగరంలో మరో నాలుగు బాంబు పేలుళ్లు సంభవించాయి. వీటిలో ఎక్కువ ఆత్మాహుతి దాడులే. అయితే ఆ పేలుళ్లకు తామే కారణమంటూ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు అమాక్ వెబ్‌సైట్ ద్వారా బహిరంగంగా ప్రకటించడం గమనార్హం. 2011 మార్చిలో సిరియా సంక్షోభం మొదలైనప్పటి నుంచీ ఇవే అతి ప్రాణాంతక దాడులని సిరియా  మానవ హక్కుల సంస్థ అధిపతి అబ్దెల్ రహ్మాన్ చెప్పారు. టార్టస్‌లో బస్ స్టేషన్‌లో బాంబు పేలుడు దృశ్యాన్ని ప్రభుత్వ టీవీ ప్రసారం చేసింది.  కాలిపోయిన మృతదేహాలు చెల్లాచెదురుగా రక్తపుమడుగులో పడివుండటం ప్రజలకు భయాందోళన కలిగించింది. జాబ్లేలో ఒక బస్‌స్టేషన్‌తో పాటు ప్రభుత్వ ఆస్పత్రి‌పైనా ఉగ్రవాదులు దాడి చేశారు.