గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 3 సెప్టెంబరు 2015 (09:39 IST)

ఉగ్రవాది మొహ్మద్ నవేద్ పాకిస్థాన్ పౌరుడే.. ఇవిగో సాక్ష్యాలు .. భారత్ నిఘా వర్గాలు

జమ్మూకాశ్మీర్ సరిహద్దుల్లోని భద్రతా బలగాలపై దాడులకు తెగబడి ప్రాణాలతో పట్టుబడిన ఉగ్రవాది మొహ్మద్ నవేద్ యూకూబ్ ముమ్మాటికీ పాకిస్థాన్ ఉగ్రవాదేనని భారత నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇందుకు సంబంధించిన పలు కీలక ఆధారాలను కూడా సేకరించాయి. అంతేకాకుండా, నవేద్ పుట్టుపూర్వోత్తరాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించాయి. 
 
ఈ ఉగ్రవాది పట్టుబడిన తర్వాత తాను పాకిస్థాన్ పౌరుడినని, లష్కరే తోయిబా తనను ఇక్కడకు పంపించినట్టు వెల్లడించాడు. అయితే, పాకిస్థాన్ మాత్రం అతను తమ దేశస్థుడు కాదంటూ నిస్సిగ్గుగా ప్రకటించింది. దీంతో నవేద్‌ పుట్టు పూర్వోత్తరాలను భారత్‌ నిఘా సంస్థలు పకడ్బందీగా సేకరించాయి. పాకిస్థాన్ జనగణన రిజిస్టర్‌లో అతడి నమోదు సంఖ్యను, 2014లో ఇచ్చిన గుర్తింపు కార్డు నంబరును సేకరించాయి. 
 
ఫైసలాబాద్‌లోని రఫీక్‌ కాలనీవాసిగా నవేద్‌ నివాసాన్ని గుర్తించే గూగుల్‌ మ్యాప్‌లను రూపొందించింది. ఇలా పాక్‌ బండారాన్ని బట్టబయలు చేసే సత్యాలతో 39 పేజీల నివేదికను రూపొందించింది. కాగా, భారత్‌లో అలజడులే లక్ష్యంగా పాకిస్థాన్‌ గూఢచార సంస్థ ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్ ‌- ఐఎస్ఐ ఉగ్రమూకలను పోషిస్తున్న విషయంతెల్సిందే.