శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 28 అక్టోబరు 2016 (16:21 IST)

పన్నుల ఎగ్గొట్టడంలో ట్రంప్ తక్కువేం తినలేదట... 'యూఎస్ఏ టుడే'లో సంచలనాత్మక కథనం

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల తరపున అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్‌‌కు సంబంధించిన మరో వివాదం వెలుగులోకి వచ్చింది. దేశ ఖజానాకు ఆదాయం సమకూర్చే పన్నులు ఎగ్గొట్టడంలో డోనాల్డ

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల తరపున అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్‌‌కు సంబంధించిన మరో వివాదం వెలుగులోకి వచ్చింది. దేశ ఖజానాకు ఆదాయం సమకూర్చే పన్నులు ఎగ్గొట్టడంలో డోనాల్డ్ ట్రంప్‌తో పాటు.. ఆయన కంపెనీలు ముందు వరుసలో ఉన్నట్టు యూఎస్ఏ టుడే ఓ సంచలనాత్మక కథనాన్ని ప్రచురించింది. ఈ పత్రిక పేర్కొన్న వివరాల మేరకు ట్రంప్ కంపెనీలపై వందకుపైగా కేసులు నమోదు కాగా, డజన్లకొద్దీ వారెంట్లు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయి. వివిధ కోర్టుల్లో తీర్పుల మేరకు దాదాపు మూడు లక్షల డాలర్ల మేరకు బకాయిలను చెల్లించగా, అనేక కేసులు విచారణ దశలో ఉన్నాయి. 
 
ఇక పన్ను చెల్లింపుల్లో ట్రంప్ కంపెనీలు పారదర్శకతను అసలు పాటించ లేదని, ఆస్తులను, ఆదాయాన్నీ తక్కువ చేసి చూపించడం ఆ కంపెనీలకు అలవాటని 'యూఎస్‌ఏ టుడే' పేర్కొంది. వెయ్యి కోట్ల డాలర్ల ఆస్తిని వందకోట్ల డాలర్లుగా చూపించి అధికారులను తప్పుదారి పట్టించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని పేర్కొంది. 
 
అధ్యక్ష ఎన్నికల సందర్భంగా దాఖలు చేసిన ఆస్తుల జాబితా అఫిడవిట్‌లో ట్రంప్‌ తన ఆస్తిని తక్కువ చేసి చూపారని ఆరోపిస్తూ, ఎన్నికల ప్రచారం కోసం నిత్యమూ ఆయన తిరుగుతున్న సొంత జెట్‌ విమానానికి సుమారు పదివేల డాలర్ల పన్ను బకాయిలు ప్రభుత్వానికి చెల్లించాల్సి వుందని వెల్లడించింది. 
 
న్యూయార్క్‌‌తో పాటు ఫ్లోరిడా, న్యూజెర్సీల్లోని వివిధ కోర్టుల్లో ట్రంప్‌ కంపెనీలపై పన్ను ఎగవేత కేసులు నడుస్తున్నాయని, గడచిన 27 సంవత్సరాల కాలంలో వివిధ కేసుల్లో వచ్చిన తీర్పుల మేరకు ఇంకా 3 లక్షల డాలర్లను చెల్లించాల్సి ఉందని తెలియజేసింది.