గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 2 సెప్టెంబరు 2015 (19:57 IST)

అమ్మాయికి వేధింపులు... పాకిస్థాన్‌లో టైగర్ మెమన్ అరెస్టు..?!!

ఓ అమ్మాయిని వేధించి, బెదిరించిన కేసులో ముంబై పేలుళ్ళ కేసులో భారత్ గాలిస్తున్న దోషుల్లో ఒకరైన టైగర్ మెమన్‌ను పాకిస్థాన్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఇదే అంశంపై బుధవారమంతా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగింది. దీంతో పాకిస్థాన్ సర్కారు ఒక్కసారి ఉలిక్కిపడింది. భారత్ మీడియా ప్రతినిధులు కూడా పాకిస్థాన్‌కు ఫోన్ చేసి ఆరా తీశారు. తీరా ఈ అరెస్టుపై ఆరా తీయగా ఉత్తుత్తిదేనని తేలింది. దీంతో ఈ అరెస్టుపై ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ) అధికారులు వివరణ ఇచ్చారు. 
 
అరెస్టు అయింది టైగర్ మెమన్ కాదని, టైగర్ మెమన్ పేరు చెప్పుకుని వసూళ్లకు పాల్పడుతూ, మహిళలను వేధిస్తున్న వ్యక్తి అని వివరించారు. కరాచీలో ఫర్గన్ అనే వ్యక్తి టైగర్ మెమన్ పేరు చెప్పుకుని నకిలీ ఫేస్‌బుక్ ఖాతాతో మహిళలను వేధిస్తున్నాడు. అతనిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. 
 
కాగా, 1993 ముంబై పేలుళ్లకు పాల్పడ్డ టైగర్ మెమన్ 257 మంది మరణానికి కారణమైన విషయం తెల్సిందే. ముంబై పేలుళ్ల అనంతరం దుబాయ్ పారిపోయిన టైగర్ మెమన్, అక్కడ భారత ఇంటెలిజెన్స్ విభాగం పట్టుకునే ప్రమాదం ఉందని భావించి పాకిస్థాన్‌లోని కరాచీలో ఆశ్రయం పొందుతున్నట్టు సమాచారం.