శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 23 జులై 2014 (11:23 IST)

ఎంహెచ్17 బ్లాక్‌‍ బాక్స్‌లను అప్పగించిన రెబెల్స్!

మలేషియా విమానం ఎంహెచ్17 దుర్ఘటన జరిగిన దాదాపు వారం రోజులకు ఎట్టకేలకు బ్లాక్ బాక్సులు అధికారుల చేతికి వచ్చాయి. ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతంలో విమానం కూలిన ప్రాంతంలో ఉన్న వీటిని మలేషియన్ అధికారులకు రష్యాన్ తిరుగుబాటుదారులు అందించారు. డోనెట్స్క్ ప్రాంతంలో వీటిని తమ అధికారులకు ఇచ్చినట్లు మలేషియా ప్రధానమంత్రి నజీబ్ రజాక్ వెల్లడించారు. వీటిని తదుపరి విశ్లేషణ కోసం నిపుణులకు పంపుతామని ఆయన చెప్పారు. 
 
విమాన దుర్ఘటన విషయంలో ఇప్పుడు మరో కొత్త వాదన మొదలైంది. ఉక్రెయిన్కు చెందిన ఓ ఫైటర్ జెట్ విమానం గాలిలోంచి గాలిలోకి ప్రయోగించి క్షిపణులతో ఎంహెచ్-17 విమానాన్ని వెంబడించినట్లు రష్యా సైన్యానికి చెందిన సీనియర్ అధికారులు తాజాగా చెబుతున్నారు. ఇందుకు సంబంధించి తమకు ఉపగ్రహ చిత్రాల సాక్ష్యాలు ఉన్నాయని, ఆ ఫైటర్ విమానం ఎక్కడినుంచి ఎక్కడు వెళ్లిందో వివరించాలని ఉక్రెయిన్ను నిలదీస్తున్నారు.
 
ఎంహెచ్17 బ్లాక్ బాక్స్‌ను మలేషియా నిపుణులకు అందజేయాలని నిర్ణయించి, అప్పగించినట్టు తనను తాను ప్రధానమంత్రిగా ప్రకటించుకున్న దొనెట్‌స్క్ పీపుల్స్ రిపబ్లిక్‌కు చెందిన ఉక్రెయిన్ తిరుగుబాటు దళం అధిపతి అలెగ్జాండర్ బొరోడాయ్ మీడియా ప్రతినిధులకు చెప్పారు. అదేవిధంగా అంతర్జాతీయ పరిశీలకులు వచ్చేవరకు శవాలను తమ దగ్గరే జాగ్రత్తగా భద్రపరుస్తామని ఉక్రెయిన్ తిరుగుబాటుదారులు తెలిపారు. శవాలు పాడవకుండా ఉండాలనే ఉద్దేశంతో వాటిని ఏసీ రైల్ వ్యాగన్లలో భద్రపరిచామని వారు తెలియజేశారు.
 
మరోవైపు మలేసియా విమానం కూలిపోయిన ప్రదేశంలో కాల్పుల విరమణ పాటించాలని ఉక్రెయిన్ దళాలకు ఆ దేశాధ్యక్షుడు పొరొషెంకో ఆదేశాలు జారీ చేశారు. విమానం కూలిన ప్రదేశం రష్యన్ అనుకూల, ఉక్రెయిన్ వ్యతిరేక తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉందని ఆయన పేర్కొన్నారు. కాల్పుల విరమణతో మృతదేహాలు, సాక్ష్యాధారాల సేకరణ సులభమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఉక్రెయిన్ దేశాధ్యక్షుడి ఆదేశాలతో విమానం కూల్చివేతకు గురైన ప్రదేశానికి 40 కిలోమీటర్ల వరకు కాల్పుల విరమణ అమల్లో ఉంటుందని ఉక్రెయిన్ వర్గాలు వెల్లడించాయి.