శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 31 జులై 2014 (16:26 IST)

గాజాలో హింస: ఐరాస అధికారి కంటతడి.. సస్పెండ్ చేస్తారా? వీడియో

గాజా పరిస్థితి ఐరాస అధికారి కంట తడిపెట్టించింది. గాజాలో హింసపై ప్రపంచమంతా ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో ఓ ఐక్యరాజ్య సమితి అధికారి కన్నీటి పర్యాంతమయ్యాడు. బుధవారం ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో పని చేస్తున్న ఒక పాఠశాల షెల్టర్ హోంపై ఇజ్రాయెల్ దాడికి పాల్పడగా 15 మంది మరణించారు. వందమందికిపైగా విద్యార్థులు గాయాలపాలయ్యారు. 
 
ఈ అంశంపై ఓ టెలివిజన్ ఛానల్‌తో మాట్లాడుతూ.. అక్కడి ఐక్యరాజ్య సమితి ప్రతినిధి క్రిస్ గన్నెల్ ఉద్వేగానికి గురై కన్నీటి పర్యాంతమయ్యారు. తీవ్ర ఉద్వేగానికి గురికావడంతో అతను మాట్లాడలేకపోయారు. ఆ తర్వాత ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. మృతుల సంఖ్యను ఒక గణాంకంలా యథాలాపంగా చూడవద్దని, ఒక్కో అంకె రక్త మాంసాలు, హృదయం, ఆశలు, ఆశయాలు ఉండే ఒక మనిషని గుర్తుంచుకోవాలన్నారు. 
 
దీనిపై ఇజ్రాయెల్ స్పందిస్తూ.. క్రిస్ గన్నెల్ ఇజ్రాయెల్ వ్యతిరేక భావనలతో ఉన్నారని, ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేసింది. కాగా, పసి పిల్లలపై దాడికి పాల్పడిన ఇజ్రాయెల్‌పై ఐక్యరాజ్య సమితి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జులై 8న ఇజ్రాయెల్, హమాస్ మధ్య పోరు ప్రారంభమైనప్పటి నుంచి గత 23 రోజుల్లో గాజాలో మొత్తం 1,283మంది చనిపోగా, 7100 మందికి పైగా గాయపడ్డారు. 
 
కాగా, గాజాలో ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తున్న పాఠశాలపై దాడి జరగడం ఇది రెండోసారి. అయితే రాకెట్ దాడులు జరపడానికి హమాస్ పాఠశాల భవనాలను తమ స్థావరాలుగా ఉపయోగించుకుంటోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. అంతేగాక ఈ దాడితో తమకు సంబంధం లేదని వాదిస్తోంది.