ఐరాస మానవ హక్కుల మండలి నుంచి రష్యా బహిష్కరణ
ఉక్రెయిన్‌పై దండయాత్ర చేస్తున్న రష్యాకు అంతర్జాతీయ సమాజంలో తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే అనేక దేశాల ఆర్థిక ఆంక్షలతో సతమతమవుతుంది. తాజాగా ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి నుంచి బహిష్కరణకు గురైంది. ఇందుకోసం జరిగిన ఓటింగ్‌లో రష్యా బహిష్కరణపై ప్రవేశపెట్టిన తీర్మానానికి అనుకూలంగా 93 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 24 ఓట్లు వచ్చాయి. భారత్‌తో సహా 58 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. దీంతో రష్యా మరిన్ని సమస్యలను ఎదుర్కోనుంది.
ఉక్రెయిన్‌లోని బుచా నగరంలో రష్యా సైనికులు నరమేథానికి పాల్పడినట్టు శాటిలైట్ చిత్రాలతో నిర్ధారణ అయింది. దీంతో రష్యాపై చర్య తీసుకునేందుకు ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం అత్యవసరంగా గురువారం జరిగింది. ఇందులో జరిగిన ఓటింగ్‌లో సభ్య దేశాల ఓటింగ్ మెజారిటీకి అనుగుణంగా రష్యాను మానవ హక్కుల మండలి నుంచి బహిష్కరించింది.
అయితే, ఈ ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉండిపోయింది. ఈ ఓటింగ్‌లో పాల్గొనకుండా భారత్ తన తటస్థ వైఖరిని అవలంభించింది. రష్యాను మానవ హక్కుల మండలి నుంచి బహిష్కరించాలన్న తీర్మానంపై ఐరాస జనరల్ అసెంబ్లీ జరిగిన ఓటింగ్‌లో అనుకూలంగా 93 దేశాలు ఓటింగ్ వేయగా 24 దేశాలు వ్యతిరేకంగా, 58 దేశాలు తటస్థంగా ఉండిపోయాయి.