మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 29 సెప్టెంబరు 2016 (15:27 IST)

పాకిస్థాన్‌పై భారత్ మెరుపుదాడి.. పీవోకేలో ఉగ్రశిబిరాలు ధ్వంసం.. 3 కి.మీ చొచ్చుకెళ్లిన భారత సైన్యం

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని యురీ దాడి తర్వాత భారత్ దళాలు భీకరదాడులు చేపట్టాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపుదాడులు నిర్వహించాయి. వైమానిక, భద్రతా బలగాలు సంయుక్తంగా నిర్వహించిన ఈ దా

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని యురీ దాడి తర్వాత భారత్ దళాలు భీకరదాడులు చేపట్టాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపుదాడులు నిర్వహించాయి. వైమానిక, భద్రతా బలగాలు సంయుక్తంగా నిర్వహించిన ఈ దాడుల్లో భారీ సంఖ్యలో తీవ్రవాదులు హతమయ్యారు. అలాగే, భారత్ సైన్యం పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో 3 కిలోమీటర్ల పరిధిలోకి చొచ్చుకుని వెళ్లింది. ఈ దాడులు బుధవారం అర్థరాత్రి నుంచి చేపట్టారు. దీంతో అంతర్జాతీయ నియంత్రణ రేఖ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత సైన్యం దాడులు జరిపిన నేపథ్యంలో ప్రతి దాడులు జరపవచ్చన్న నేపథ్యంలో సరిహద్దుల్లో భారీగా సైన్యాన్ని మొహరిస్తోంది. 
 
ఇదే అంశంపై ఆర్మీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ రణ్‌బీర్ భారత విదేశాంగ రక్షణశాఖ సంయుక్త మీడియా సమావేశంలో అధికారికంగా ప్రకటించారు. ఉరీలో ఉగ్రదాడుల తర్వాత పాకిస్థాన్ పట్ల భారత్ తన వైఖరి పూర్తిగా మార్చుకుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌పై గత రాత్రి దాడి చేశామని, దాడిలో పలువురు ఉగ్రవాదులు చనిపోయారని ఆయన చెప్పారు. ఆ దాడుల్లో పాక్‌ సైనికులు కూడా చనిపోయారని, ప్రస్తుతానికి దాడులు ఆపేశామని, ఇప్పట్లో దాడులు చేసే ఉద్దేశం లేదని రణ్‌బీర్ ప్రకటించారు. దాడి తర్వాత పాకిస్థాన్‌కు సమాచారం అందించామని, కాకపోతే అటు వైపు ఏం జరుగుతోందో తమకు సమాచారం లేదని జనరల్ తెలిపారు.
 
'పాక్‌ వైపు నుంచి 20 చొరబాట్లను అడ్డుకున్నాం. పాకిస్తాన్‌ పదే పదే కాల్పుల విరమణను ఉల్లంఘిస్తోంది. ఉగ్రవాదులు మెట్రో నగరాలపై దాడులకు కుట్రపన్నారు. యూరీ ఉగ్రవాదుల వేలిముద్రలు, సమాచారాన్ని పాక్‌కు పంపాం. మా అభ్యంతరాలను పాక్‌ జనరల్‌కు వివరించాం' అని రక్షణ శాఖ పేర్కొంది.