శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : శుక్రవారం, 6 మే 2016 (13:35 IST)

అమెరికాలో మైనర్లకు సిగరెట్ల విక్రయాలపై నిషేధం

అమెరికాలో మైనర్లకు సిగరెట్ల విక్రయంపై నిషేధం విధించారు. ఈ నిషేధం మరో మూడు నెలల్లో అమల్లోకి రానుంది. ఆ దేశ ఆహార, మాదకద్రవ్యాల శాఖ తీసుకున్న నిర్ణయంతో ఇకపై దేశ వ్యాప్తంగా ఉన్న మైనర్లు సిగరెట్ కొనడం, వారికి అమ్మడం చేయరాదు. దీంతోపాటు ఆన్‌లైన్ ద్వారా సిగరెట్, హుక్కా, పొగాకు ఉత్పత్తుల అమ్మకాలను కూడా నిషేధం విధించింది. ఇటువంటి వినూత్న నిర్ణయం తీసుకోవడం అమెరికా చరిత్రలో ఇదే ప్రథమం. 
 
గత కొంతకాలంగా పొగాకు ఉత్పత్తుల వల్ల కలిగే రోగాల బారిన పడి మృత్యువాత పడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ముఖ్యంగా సిగరెట్ వల్ల కలిగే రోగాల బారిన పడి ప్రతీ యేటా అమెరికాలో 4 లక్షల 80 వేల మంది చనిపోతున్నారు. ప్రతీ అయిదుగురు అమెరికన్లలో ఒకరికి సిగరెట్ తాగే అలవాటు ఉందని ఓ సర్వేలో తేలింది.
 
దీనిపై ఆ దేశంలోని అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆహార, మాదకద్రవ్యాల శాఖ స్పందించి.. కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మైనర్లు నేరుగాకానీ, ఆన్‌లైన్ ద్వారా గానీ సిగరెట్ వంటి పొగాకు ఉత్పత్తులను కొంటే శిక్ష తప్పదు.