శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 22 జనవరి 2015 (12:35 IST)

పాకిస్థాన్‌కు ఒబామా వార్నింగ్ : వ్యూహాత్మకంగా జమాత్ ఉద్ దవాపై నిషేధం!

ఈనెల 25వ తేదీన భారత్ పర్యటనకు రానున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పాకిస్థాన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. తాను న్యూఢిల్లీ పర్యటనలో ఉండగా భారత్‌పై ఉగ్రదాడి జరిగితే మాత్రం తాట తీస్తామంటూ హెచ్చరించారు. దీంతో నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా జమాత్ ఉద్ దవాపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించారు.
 
నిషేధం విధించడం ద్వారా పాక్ వ్యూహాత్మక ఎత్తుగడ వేసింది. భారత నిఘా సంస్థలు హెచ్చిరిస్తున్నట్టు ఉగ్రదాడి జరిగితే పాక్ తనకు సంబంధం లేనట్టు చేతులు దులుపుకునే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దవాకు చీఫ్‌గా 26/11 దాడుల ప్రధాన నిందితుడు హఫీజ్ సయీద్ ఉన్నారు.
 
అమెరికా అధ్యక్షుడి పర్యటనలో దాడి చేస్తే ఎక్కువ ప్రభావముంటుందని హఫీజ్ ఆలోచనగా ఉందని నిఘా సంస్థలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఒబామా పాకిస్థాన్‌కు చేసిన హెచ్చరిక సత్ఫలితమిచ్చినట్టే కనిపిస్తోంది. మరోవైపు... భారత్‌లోకి పాక్ కేంద్రంగా పని చేసే అనేక ఉగ్రవాద సంస్థలకు చెందిన తీవ్రవాదులు ప్రవేశించినట్టు దేశ నిఘా సంస్థలు హెచ్చరించాయి. దీంతో దేశంలోని ప్రధాన ఎయిర్‌పోర్టుల్లో హై అలెర్ట్ ప్రకటించడమే కాకుండా, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేశాయి.