బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 24 ఏప్రియల్ 2015 (13:43 IST)

కేదార్ నాథ్‌కు రాహుల్ నడక.. అందుకేనట..! రాజకీయ కోణం ఉందండోయ్?

కేదార్ నాథ్ యాత్రకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సంకల్పించారు. 16 కిలో మీటర్ల మేర గౌరీ కుండ్ నుంటి కాలినడకనే వెళ్లారు. దారి పొడవునా భక్తులను పలకరించారు. యాత్ర ఏర్పాట్లపై పర్యవేక్షించారు. ప్రత్యేక విమానంలో డెహ్రాడూన్ వచ్చిన రాహుల్ గాంధీ.. హిమ శిఖరాల్లో రాత్రంతా టెంట్ కిందే బస చేశారు. రాహుల్ వెంట కాంగ్రెస్ నేతలు అంబికా సోనీ, హరీష్ రావత్, కిషోర్ ఉపాధ్యాయ ఉన్నారు. 
 
ఈ నేపథ్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్ నాథ్‌కు 16 కిలోమీటర్ల దూరం కొండల్లో నడుస్తూ వెళ్లడానికి గల కారణాన్ని రాహుల్ గాంధీ వివరించారు. "2013లో వచ్చిన వరదల్లో ఘోర మరణం పొందిన వారికి నివాళిగా నేను నడవాలని అనుకున్నాను" అని రాహుల్ వివరించారు. "నేను నడవడం చూసిన ప్రజలు, నేతలు కూడా ఇక్కడికి రావాలని, కేదార్ నాథ్ సందర్శించాలని అనుకుంటారు కదా?" అని రాహుల్ అన్నారు. బ్లూ టీషర్ట్, జీన్స్ ధరించిన రాహుల్ ప్రభుత్వాధికారులు హెలికాప్టర్లో వెళ్లాలని సూచించినా, అంగీకరించని సంగతి తెలిసిందే. రెండేళ్ల క్రితం ఉత్తరాఖండ్‌ను ముంచెత్తిన వరదల్లో సుమారు 6 వేల మందికి పైగా మృత్యువాతపడ్డ సంగతి తెలిసిందే.
 
అయితే రాహుల్ గాంధీ కేదార్ నాథ్ నడక యాత్రపై అప్పుడే కొన్ని వార్తలు వస్తున్నాయి. 1979వ సంవత్సరంలో ఇందిరా గాంధీ 40 కిలో మీటర్ల మేర నడిచి బద్రినాథ్‌లో పూజలు చేశారని తెలిసింది. ఈ పూజల కారణంగానే ఇందిరమ్మ రాజకీయాల్లో రాణించారని... ఇదే తరహాలో రాహుల్ గాంధీ రాజకీయాల్లో ఎదగాలంటే కేదార్ నాథ్ యాత్ర.. ప్రత్యేక పూజలు ఫలిస్తాయనే ఉద్దేశంతోనే రాహుల్ కేదార్ నాథ్‌కు వచ్చారని టాక్ వస్తోంది. మరి దీనిపై రాహుల్ ఏమంటారో వేచి చూడాలి.