శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 2 మార్చి 2015 (12:14 IST)

పాక్ జైలులో జల్సాగా జీవిస్తున్న లష్కర్ చీఫ్ లఖ్వీ

ముంబై దాడుల సూత్రధారి, లష్కర్-ఈ- తోయిబా నేత, కరుడుకట్టిన ఉగ్రవాది జకీవుర్ రెహ్మాన్ లఖ్వీ ఇస్లామాబాద్‌లోని రావల్పిండి జైలులో ఉంటు తన కర్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈయన జైలు గదిలో ఉంటూనే సకల సౌకర్యాలు పొందడమే కాకుండా, ఇంటర్నెట్, శాటిలైట్ ఫోన్ వంటివి ఉపయోగిస్తున్నట్టు బీబీసీ మీడియా వెల్లడించింది. 
 
నిజానికి ఈయనకు పాకిస్థాన్ తీవ్రవాద వ్యతిరేక కోర్టు బెయిల్ మంజూరు, వెనువెంటనే రద్దు చేస్తూ ఆ దేశ కోర్టులు వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న విషయం తెల్సిందే. తాజాగా రావల్పిండి జైలు అధికారులు ఉగ్రవాదుల పట్ల చూపుతున్న ‘స్వామి’ భక్తి వెలుగు చూసింది. జైల్లో విచారణ ఖైదీగా ఉన్న లఖ్వీకి సకల సౌకర్యాలు అందుతున్నాయి. జైల్లో ఉంటూనే తాజా వార్తలు, వినోదాన్ని ఆస్వాదించేందుకు లఖ్వీకి జైలు అధికారులు ఓ టీవీని ఏర్పాటు చేశారు. అంతేకాక కుటుంబ సభ్యులు, తన ఉగ్రవాద కేడర్‌తో నిత్యం సంప్రదింపులు జరిపేందుకు అతడికి ఓ మొబైల్ ఫోన్‌ను కూడా అందించారు. 
 
ఇక ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అతడికి అందుబాటులోకి తెస్తూ ఏకంగా ఇంటర్నెట్ సౌకర్యాన్ని కూడా కల్పించారట. ఇక లఖ్వీకి ములాఖత్‌లకు సంబంధించి పరిమితే లేదు. ఎప్పుడైనా, ఎవరైనా, ఎంతమందైనా అతడిని కలవొచ్చట. నేరుగా జైల్లోకే వెళ్లి అతడితో మంతనాలు జరిపే వెసులుబాటును సదరు జైలు అధికారులు అతడి సన్నిహితులకు కల్పించినట్టు బీబీసీ పేర్కొంది.