బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Modified: గురువారం, 11 ఫిబ్రవరి 2016 (19:36 IST)

నిర్మాత బాధలు తెలియాలంటే సినిమా తీయాల్సిందే: హీరో ఆది ఇంటర్వ్యూ

హీరోగా నటించడం వేరు. ఆ కాసేపు సీన్లు చేసి వెళ్ళిపోవచ్చు. కానీ నిర్మాతగా వుండాలంటే అన్ని పనులు చూసుకోవాలి. అది లేదు ఇది లేదు అంటూ మేనేజర్లు చెప్పడం.. టైంకు అనుకూలంగా రాకపోవడం.. వంటివెన్నో టెన్షన్లు వుంటాయి. అందుకే నా దృష్టిలో ప్రతి హీరో స్వంత బేనర్‌లో సినిమా తీస్తేగాని అసలు సినిమా వారికి తెలియదు'' అని హీరో ఆది అంటున్నాడు. సాయికుమార్‌ కొడుకుగా ప్రేమకావాలితో ముందుకు వచ్చి.. లవ్‌లీ వంటి చిత్రంతో గుర్తింపు పొందిన ఆయన తాజాగా 'గరం' అనే సినిమాతో సిద్ధమైపోయారు.

దర్శక, రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మదన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను సాయికుమార్‌ తన సొంత బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఈ సందర్భంగా ఆదితో చిట్‌చాట్‌..
 
'రఫ్‌' నిరాశపర్చిందా?
అది ఊహించినట్లు ఆడలేదు. విన్నప్పుడు అంతా బాగుంటుంది. తీసే విధానంలో తేడా రావడంతో తేడా వస్తుంది. అయితే ఆ చిత్రం తర్వాత వరుసగా సినిమాలు చేయాలనుకున్నా రాలేదు. కొంత గ్యాప్‌ తీసుకోవాల్సివచ్చింది. ఓ బలమైన క్యారెక్టరైజేషన్‌ ఉన్న సినిమా చేయాలనే కొద్దికాలం కథలపైనే కూర్చున్నా. ఆ క్రమంలోనే 'గరం' సినిమా సెట్‌ అయింది.
 
స్వంత బేనర్‌లో చేయడానికి కారణం?
నాన్నగారు ఎప్పటినుంచో అనుకుంటున్నారు. అయితే.. ఈ సినిమా మొదట రామ్‌ప్రసాద్‌ అనే వ్యక్తి మొదలుపెట్టాడు. తన వ్యక్తిగత కారణాల వల్ల వెనక్కు తగ్గాడు. అప్పుడు కథ బాగుందని నాన్నగారు ఈ సినిమాను టేకప్‌ చేశారు. సొంత బ్యానర్‌ ఆలోచన చాలాకాలంగా ఉంది. దానికోసం ఏర్పాట్లు చేసుకుంటున్నప్పుడే 'గరం' కథ నచ్చి సొంతంగా నిర్మించేందుకు సిద్ధమైపోయాం.
 
నిర్మాత, హీరో.. ఈ రెండింటిలో ఏది సుఖం?
హీరోగా చేయడమే సుఖం. అంతకుముందు సినిమా గురించి తెలిసింది చాలా తక్కువ. ఈ సినిమా చేశాకే ఒక సినిమా కోసం నిర్మాత అనేవాడు ఎంత కష్టపడతాడో అర్థమైంది. నాకు మొదట్నుంచీ నిర్మాతలంటే గౌరవం. ఈ సినిమా తర్వాత ఆ గౌరవం మరింత పెరిగింది. ప్రతి హీరో స్వంత బేనర్‌లో ఒక్క సినిమా చేసినా చాలు. సినిమా గురించి అంతా తెలిసినట్లే.
 
ఈ సినిమాలో అంతలా బాగా ఆకర్షించిన అంశమేమిటి?
ఈ సినిమాలో లవ్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, కమర్షియల్‌ యాంగిల్‌.. మూడూ ఉన్నాయి. నా క్యారెక్టరైజేషన్‌ కూడా చాలా కొత్తగా ఉంటుంది. ఇలా కమర్షియల్‌గా ఒక ఫీల్‌ గుడ్‌ కథను చెప్పడం అనే అంశం బాగా నచ్చింది. ఆ అంశం నచ్చే సినిమాను స్వయంగా మేమే నిర్మించాం.
 
ఈ సినిమాలో మీ రోల్‌ ఎలా ఉండబోతోంది?
క్యారెక్టరైజేషన్‌ను హైలైట్‌ చేస్కొని నేను ఈమధ్య కాలంలో సినిమా చేయలేదు. 'గరం'లో వరాల బాబు అనే క్యారెక్టర్‌ను హైలైట్‌ చేస్తూ సినిమా నడుస్తుంది. ఈ క్యారెక్టర్‌కు ప్రతి ఒక్కరూ కనెక్ట్‌ అవుతారు.
 
మదన్‌ దర్శకునిగా సక్సెస్‌ లేదు కదా?
ఆయన అంతకుముందు తీసిన 'నలుగురు' వంటి చిత్రాలు ఎంతో పేరు తెచ్చాయి. ప్రవరాఖ్యుడు సరైన టైంలో విడుదలకాక ఆడలేదు. కానీ మంచి కథ. పెళ్లయిన కొత్తలో బాగా ఆడింది. తను మొదట రచయిత, ఆ తర్వాత దర్శకుడిగా మంచి సినిమాలు అందించారు. ఆయన దర్శకత్వంలో, ఇలాంటి ఒక మంచి కథ పడితే కచ్చితంగా దాని రేంజ్‌ బాగుంటుందని నమ్మాం. మా నమ్మకాన్ని నిజం చేస్తూ ఆయన మంచి సినిమా అందించారు. రకరకాల ఎమోషన్స్‌ సరిగ్గా చెప్పడంలో రచయితగా ఆయనకున్న అనుభవం ఈ సినిమాకు బాగా కలిసి వచ్చింది.
 
హీరోగా ఏం నేర్చుకున్నారు?
సినిమాకు ప్రధానమంటే ముందు కథ, ఆ తర్వాత దర్శకుడే అన్న వాస్తవం తెలిసింది. హీరో అనేవాడు ఆ కథలో, ఆ దర్శకుడి ఆలోచనకు తగ్గట్టు నడుచుకుంటూ పోయే ఒక పాత్ర మాత్రమే! మంచి కథ, మంచి దర్శకుడే సినిమాను నిలబెట్టగలరనేది తెలుసుకున్నా. ఇకపై ఏ సినిమా చేసినా కూడా ఈ రెండు విషయాలనే నమ్మి చేస్తా.
 
తదుపరి సినిమాలు?
ప్రస్తుతానికి 'చుట్టాలబ్బాయ్‌' ఒక్కటే చేస్తున్నా. వీరభద్రం చౌదరి తెరకెక్కిస్తోన్న ఈ సినిమా 40% పూర్తైంది. ఆద్యంతం కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఆ సినిమా ఉండబోతోంది. ఇక మా సొంత బ్యానర్‌లోనే మరో సినిమా చేసేందుకు కథలు వింటున్నా అని చెప్పారు.