గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Modified: మంగళవారం, 25 ఆగస్టు 2015 (21:10 IST)

కమల్‌తో సహజీవనం వ్యక్తిగతం... దాని గురించి మాట్లాడండి: గౌతమి ఇంటర్వ్యూ

ఏ పనిమీద వచ్చామో వాటి గురించి అడిగితే బాగుంటుందనీ, వ్యక్తిగతమైన విషయాలను ప్రస్తావించడం భావ్యం కాదని కాస్త ఘాటుగానే నటి గౌతమి స్పందించింది. మంగళవారం నాడు ఆమె హైదరాబాద్‌కు వచ్చింది. బహ్రెయిన్‌, కువైట్‌కు చెందిన హైమారెడ్డి తెలంగాణ జాగృతి పేరుతో పలు కార్యక్రమాలు చేస్తుంది. ఆమెకు కేన్సర్‌ సోకి దాని నుంచి బయట పడింది. తన కథనే 'లైఫ్‌ ఎగైన్‌' అంటూ ఓ షార్ట్‌ ఫిలింగా తీసింది. దీని ట్రైలర్‌ను హైదరాబాద్‌లో లాంఛ్‌ చేశారు. దీనికి గౌమతి హాజరైంది. ఈ సందర్భంగా ఆమెతో చిట్‌చాట్‌...
 
లఘు చిత్రానికి రావడానికి ప్రధాన కారణం?
హైమారెడ్డి నాకు తెలుసు. నాకు కేన్సర్‌ సోకి బయట పడ్డాక.. నన్ను స్పూర్తిగా తీసుకున్నానని చెప్పింది. ఇలా కొంతమంది కూడా చెప్పారు. వారి మాటలు వింటుంటే కనీసం ఒక్కరైనా ఇలా వున్నందుకు ఆనందం వేసింది. తను కువైట్‌లో పలు కార్యక్రమాలు చేసింది. అప్పుడు కలిశాను. ఒకరకంగా ఆమెకు, ఆమె పాపకు కూడా కేన్సర్‌ సోకింది. ఇప్పుడు ఇద్దరూ బయపడ్డారు. అలాంటివారికి ధైర్యం చెప్పాలనే వచ్చాను.
 
కేన్సర్‌ రోగులకు ఇంకా మీరిచ్చే సలహాలు...?
కేన్సర్‌ రోగిగా నాకు ఇబ్బందులు తెలుసు. కేన్సర్‌ను ఎదిరించడం చాలా కష్టం. అలాంటిది రెండు కేర్సర్‌లను హైమారెడ్డి ఎదిరించి నిలిచారు. ఇలాంటి వారే నిజమైన హీరోలు. కష్టాలు వున్నప్పుడు తలెత్తుకు నిలబడాలి. ఇటువంటి చిత్రాల ద్వారా కేన్సర్‌పై అవగాహన పెరుగుతుంది. ఈ చిత్రాన్ని అందరూ స్పూర్తిగా తీసుకోవాలని చెప్పారు. ఎవరైనా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి. కేన్సర్‌ వస్తే జీవితం అయిపోయిందని కాకుండా.. దాన్నుంచి ఎలా గట్టెక్కాలనే దిశగా అందరూ ఆలోచించాలి. ఇదేకాదు జీవితంలో ఏ సమస్య వచ్చినా.. అందరూ ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలనే కోరుకుంటాను.
 
మీకు అలా స్ఫూర్తి ఇచ్చింది ఎవరు?
కమల్‌హాసన్‌ గారే. ఆయనే లేకపోతే నేను మామూలు మనిషిని అయ్యేదాన్ని కాదు. నటుడిగానే కాకుండా ఆయన తత్త్వవేత్త, వైద్యుడు, సైక్రియాటిస్ట్‌.. ఇలా ఎన్నో కోణాలు ఆయనలో వున్నాయి.
 
కేన్సర్‌ను ముందుగానే కంట్రోల్‌ చేయడానికి మార్గాలు?
కొంతమందికి జెనెటిక్‌గా వస్తుంటాయి. దాన్ని కూడా మనపై మనకు నమ్మకంతో ధైర్యంతో కంట్రోల్‌ చేసుకోవచ్చు. అవికాకుండా... మన చుట్టూ ఎన్నో కలుషితాలు వున్నాయి. తినే తిండిలో, తాగే నీటిలో పీల్చే గాలికూడా కలుషితమై పోయింది. వీటిని కనిపెట్టి జాగ్రత్తగా వ్యవహరిస్తే కేర్సర్‌ రాకుండా కాపాడుకోవచ్చు.
 
కమల్‌ హాసన్‌ను పెండ్లి చేసుకోకుండా.. సహజీవనం చేస్తున్నారు. దీనికి మీరెలా స్పందిస్తారు?
అది వ్యక్తిగతం. దాని గురించి మాట్లాడడం ఇక్కడ అప్రస్తుతం అని తిరస్కరించారు.