శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By IVR
Last Modified: మంగళవారం, 1 జులై 2014 (13:00 IST)

నాకు హీరో కాదు... డైరెక్టర్ చెప్పింది నచ్చితే ఓకే... సమంత ఇంటర్వ్యూ

''నేను ఏదైనా సినిమా చేయాలనుకునే ముందు ఆ దర్శకుడి గురించి, ఆయన తీసిన సినిమాల గురించి మాత్రమే తెలుసుకుంటాను. అందులో నా పాత్ర ప్రాముఖ్యతను చూసుకొని ఆ తరువాతే సినిమా అంగీకరిస్తాను. దేవ కట్టా చిత్రం 'ప్రస్థానం' చూశాను. అది చాలా బాగా నచ్చింది. ఆ దర్శకుడి చిత్రంలో మళ్ళీ చేయాలనుందని'' సమంత తెలిపింది. నాగచైతన్య హీరోగా నటించిన 'ఆటో నగర్‌ సూర్య'లో ఆయన మరదలిగా నటించింది. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ఆమె విలేకరులతో మాట్లాడింది.
 
ఈ చిత్రం విడుదల తర్వాత మీకెలాంటి రెస్సాన్స్‌ వచ్చింది? 
ముందుగా ఈ సినిమా విడుదల కావడం చాలా గొప్ప విషయం. మూడేళ్ళనాడు ఈ చిత్రాన్ని చేశాను. ఎన్‌టిఆర్‌తో 'బృందావనం'లో చేశాక ఆటోనగర్‌ సూర్యకు సైన్‌ చేశాను. ఈ చిత్రం కోసం అందరూ చాలా కష్టపడ్డారు. పక్కింటి అమ్మాయిగా నటించాను. దేవకట్టా రాసిన డైలాగ్‌లు నాకు బాగా నచ్చాయి. ప్రస్థానంలో కూడా అలాగే రాశారు.
 
మీకు బాగా నచ్చిన డైలాగ్‌? 
(పెద్దగా నవ్వుతూ) పెళ్ళి ఎవర్ని చేసుకున్నా... పిల్లల పోలికలు అతనివే వస్తాయి....' అనే డైలాగ్‌ నా ఫేవరేట్‌.. ఆ సీన్‌ చేసేటప్పుడు చాలాసేపు నవ్వుకున్నాను.
 
మీ పాత్ర తక్కువగా ఉందనే ఫీలింగ్‌ కలిగిందా? 
చాలామంది నా పాత్ర నిడివి ఇంకా వుంటే బాగుండేది అని చెప్పారు. అలా అని 'అబ్బ ఇంకా సమంత కనబడుతుందిరా..' అనే బోర్‌ కల్గించనందుకు చాలా థ్యాంక్స్‌. దేవకట్టా దర్శకత్వంలో ఫుల్‌లెంగ్త్‌ పాత్ర చేయాలనీ, మంచి డైలాగ్‌లు చెప్పాలని నా కోరిక. నాతో మరో సినిమా చేస్తానని దేవా చెప్పారు. కానీ ఆ పాత్ర చాలా భిన్నంగా ఉంటుందని చెప్పగలను.
 
చైతన్యతో కెమిస్ట్రీ ఎలా అనిపించింది? 
నాగచైతన్యతోనే నా కెరియర్‌ ప్రారంభమైంది. 'ఏమాయ చేసావె' తర్వాత ఇది మూడవ సినిమా. చాలా మంచి మిత్రుడు, బాగా మాట్లాడతాడు. మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. మాస్‌ పాత్ర చేశాడు. మాడ్యులేషన్‌ కూడా బాగా చెప్పాడు.
 
'పెర్‌ఫార్మెన్స్‌ పాత్ర ఎప్పుడు చేస్తారు? 
నటనకు ప్రాధాన్యత గల పాత్రలు ఎప్పుడు చేస్తారని చాలామంది అడుగుతున్నారు. అలాంటి అవకాశాల కోసమే ఎదురుచూస్తున్నాను. 'మనం' సినిమాతో అది నెరవేరింది. 
 
సాయికుమార్‌తో నటించడం ఎలా ఉంది? 
నేను 'ప్రస్థానం' చూశాను. మంచి పవర్‌ఫుల్‌ పాత్ర పోషించాడు. ఇందులో ఆయన కూతురుగా నటించాను. చాలా కూల్‌గా సింపుల్‌గా ఉంటారు. గొప్ప నటుడు ఆయన.
 
క్వీన్‌ సినిమాలో చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి? 
బాలీవుడ్‌లో 'క్వీన్‌' సినిమా పెద్ద హిట్‌. దాన్ని రీమేక్‌ దక్షిణాదిలో చేస్తుంటే నా దగ్గరకు వచ్చారు. అందులో కొన్ని మార్పులు చేయాలని చెప్పాను. దానికి వారు అంగీకరించలేదు. అందుకే ఆ సినిమా చేయడంలేదు.
 
ఈ ఏడాది ఎక్కువ సినిమాలు చేస్తున్నారు...? 
దాదాపు ఏడు సినిమాలు చేస్తున్నాను. ఒక్కో చిత్రంలో ఒక్కో పాత్ర అది. అల్లుడు శ్రీను, రభస చిత్రాలతోపాటు తమిళంలో విజయ్‌, విక్రమ్‌, సూర్యలతో సినిమాలు చేస్తున్నాను. ఇలాంటి వారితో మళ్ళీ నటించే అవకాశం రాదు. ఇలా రావడం అదృష్టం కూడా. ఏడు సినిమాల్లో నటించడం వల్ల చాలా ఈవెంట్స్‌లో పాల్గొనాలి. ప్రతిదానికి వెళ్ళడం ఇష్టంలేదు. కాస్త కొత్తగా కన్పించడానికి ప్యాషన్‌ మీద దృష్టిపెట్టాను.
 
మీరు పారితోషికం కోట్లకు పెంచారని వార్తలు వచ్చాయి? 
చాలాచోట్ల అల్లుడు శ్రీనుకు రెండు కోట్లు పారితోషికం తీసుకున్నారని రూమర్లు వచ్చాయి. అది నిజంకాదు. అందరూ అనుకున్నట్లు రెండు కోట్లు ఇచ్చివుంటే నాకు చాలా బాగుంటుంది. ముందు సినిమాలకు ఎంత తీసుకున్నానో దానికీ అంతే. ఈ విషయంలో బెల్లంకొండ సురేష్‌కు థ్యాంక్స్‌ చెప్పాలి. నాకు ఆరోగ్యం సహకరించకపోయినా నాలుగు నెలలు ఆగి మరీ నాతో సినిమా చేశారు. నాకు చాలా హెల్ప్‌ చేశారు. 
 
'బెంగళూరు డేస్‌ గురించి? 
దాని గురించి నేనేమీ చెప్పను. ఇంకా పూర్తిగా మాటలు కుదరలేదు. అయ్యాకే చెబుతాను. నేను తర్వాత చేయబోయే సినిమా రెండు బాషల్లో ఉంటుంది. అది చాలా పెద్ద సినిమా.. అని ముగించారు.