శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Updated : మంగళవారం, 2 ఫిబ్రవరి 2016 (20:55 IST)

తమన్నా పాటకు రూ.2 కోట్లు ఖర్చయింది... భీమినేని ఇంటర్వ్యూ

''నేను ఎడిటర్‌ మోహన్‌ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశాను. ఆయన రీమేక్‌ చిత్రాలే చేసేవాడు. ఆ తర్వాత మరికొందరికి దగ్గరచేశారు. వారు కూడా డబ్బింగ్‌ చిత్రాలే చేసేవారు. అలా ఆదిలోనే ట్రైనింగ్‌ అలా వుండటంతో ఎక్కువగా రీమేక్‌ చిత్రాలు చేయడమనే ముద్ర నాపై పడింది. అది నా బలహీనత'' అంటూ దర్శకుడు భీమనేని శ్రీనివాస్‌ తెలియజేస్తున్నారు. అల్లరి నరేష్‌తో 'సుడిగాడు' చేశాక.. కొంతకాలం గ్యాప్‌ తీసుకుని బెల్లంకొండ సురేష్ కొడుకు శ్రీనివాస్‌తో తమిళ పాండ్యరాజన్‌ను రీమేక్‌గా 'స్పీడున్నోడు' సినిమాకు దర్శకత్వం వహించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఈ చిత్రం ఈ నెల 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆయనతో ఇంటర్వ్యూ.
 
'సుడిగాడు' తర్వాత గ్యాప్‌కు కారణం?
చాలామంది ఇదే మాట అడుగుతున్నారు. నాకూ చేయాలనే వుంటుంది. చేసేది ఏదో పర్‌ఫెక్ట్‌గా చేయాలనేది నా పాలసీ. ఎంతకాలం గ్యాప్‌ తీసుకున్నావ్‌ అని ప్రేక్షకులు అడగరు. రేపు తీసేది చూస్తాం లేదంటే లేదని అంటారు. వారు తెలివైనవారు. ఆలస్యమైనా నచ్చే సినిమా తీశామా!లేదా! అనేది ప్రేక్షకులు చూస్తారు. కథలు సరైనవి కుదరకే ఆలస్యమవుతుంది. నా దృష్టిలో అది ఆలస్యం కూడా కాదు.
 
ఎక్కువగా రీమేక్‌లు చేయడానికి కారణం?
అది నా బలహీనత. నేను పెరిగిన వాతారణం కూడా కావచ్చు. మొదట ఎడిటర్‌ మోహన్‌ దగ్గర పనిచేశాను. ఆయన రీమేక్‌లే చేశాడు. అలాగే మరికొందరి దగ్గర చేశాను. వారు కూడా అవే చేశారు. రీమేక్‌లు చేయడం వల్ల ఒక లాభం వుంది. అప్పటికే హిట్‌ అయిన సినిమా. సేఫ్‌ ప్రాజెక్ట్‌గా అనిపిస్తుంది. తమిళ నేటివిటీ అయినా.. తెలుగు నేటివిటీ కోసం కొంత మార్పులు చేయాలి. ఇందులో అదే చేశాను.
 
స్ట్రెయిట్‌ చిత్రాలు చేయరా?
చేయాలనే వుంటుంది. కానీ ప్రయోగం చేసి ప్రేక్షకుల్ని మెప్పించగలనా?లేదా? అనేది కూడా ఆలోచిస్తాను. మరోపక్క మార్కెట్‌ కూడా చూసుకోవాలి. సక్సెస్‌ అయిన చిత్రాన్ని రీమేక్‌ చేస్తే.. డిస్ట్రిబ్యూటర్‌ కూడా వస్తారు. బిజినెస్‌ అవుతుంది. స్పీడున్నోడు చిత్రం బిజినెస్‌ మూడు నెలల క్రితమే ముగిసింది. ఒకరకంగా సేఫ్‌ ప్రాజెక్ట్‌. ఒకరకంగా చెప్పాలంటే.. రీమేక్‌ చేయడం కూడా సవాల్‌ లాంటిది. అక్కడ హిట్‌ అయిన సినిమా ఇక్కడ అవుతుందన్న గ్యారంటీలేదు. ఆర్టిస్టులను మెప్పించడం సుళువు కాదు. అదొక పెద్ద ఛాలెంజ్‌. అయినా వారిని ఒప్పించి మెప్పించి సినిమా తీయడంలోనే ఆనందంగా కన్పిస్తుంది. అసలు ఏ సినిమాలో తీయాలో అని ఆలోచించడానికి 25 ఏళ్ళు పట్టింది. ఆ తర్వాత ఇలా తీయాలనేందుకు మూడేళ్ళు పట్టింది. అందుకే 'సుస్వాగతం' నుంచి సుడిగాడు వరకు నేను చేసిన రీమేక్‌లు మూడొంతులు హిట్టే. 
 
'స్పీడున్నోడు'కు రవితేజను అనుకున్నారుగదా?
అవును. చాలామందిని అడిగాం. రవితేజ, సునీల్‌తోపాటు మరో ముగ్గురు ఆర్టిస్టుల్ని సంప్రదించాం. కానీ కొన్ని కారణాల వల్ల డేట్స్‌ ప్రాబ్లెమ్‌ వల్ల సాధ్యపడలేదు.
 
శ్రీనివాస్‌ కథకు యాప్ట్‌ అని అనుకుంటున్నారా?
శ్రీనివాస్‌ నటించిన 'అల్లుడు శీను' సినిమా చూశాను. ఆయనలో స్పార్క్‌ నచ్చింది. డాన్స్‌, ఫైట్స్‌ చాలా స్పీడ్‌గా చేయగలడు. ఆయన స్పీడ్‌ను చూసే సమంతను సాంగ్‌లో పెట్టాం.
 
తమన్నాకు కోటికిపైగా రెమ్యునరేషన్‌ ఇచ్చారని తెలిసింది. అంత అవసరమా?
అవసరాన్ని బట్టి ఆమెను తీసుకోవాల్సివచ్చింది. ఇందులో ఆమె చేసింది ఐటంసాంగ్‌ కాదు. స్పెషల్‌ సాంగ్‌. చిత్రం చూస్తే మీకు తెలుస్తుంది. ఈ పాటకు రెండు కోట్లకుపైగా ఖర్చయింది. సెట్‌లు అద్భుతంగా వేసి తీశారు. ఇక పారితోషికం అనేది పాత్ర డిమాండ్‌ మేరకు ఆర్టిస్టు స్టామినాను చూసి ఇచ్చేది మాత్రమే.
 
ఆమెనే హీరోయిన్‌గా ఎందుకుపెట్టలేదు?
ముందుగా బోయపాటి శ్రీను చిత్రంలో బెల్లంకొండ బేనర్‌లో చేయాల్సివుంది. ఆ సినిమాకు తమన్నానే హీరోయిన్‌. అది కాస్త వెనక్కి వెళ్ళడంతో ఆమెతో వున్న పరిచయంతోనే ఒక పాటైనా పెట్టాలని అనుకున్నాం.
 
పెద్ద బట్జెట్‌ సినిమాకు మీరే నిర్మాతగా వున్నారా? ఇంకా ఎవరైనా సపోర్ట్‌ వుందా?
కథ నచ్చి నేను నిర్మాతగా మారాను. కొంతమంది ఫైనాన్సియర్లు సపోర్ట్‌ కూడా తీసుకున్నాను.
 
స్పీడున్నోడు అంటే ఏమిటి?
ఇది ఫ్రెండ్‌షిప్‌ స్టోరీ. ఐదుగురు ఫ్రెండ్స్‌ వుంటారు. ఫ్రెండ్స్‌కోసం ఏదైనా చేసే రకం హీరోది. దేనికైనా స్పీడెక్కువ. ఆరకంగా టైటిల్‌ అలా పెట్టాం. లోగడ ఫ్రెండ్‌షిప్‌పై పలు చిత్రాలు వచ్చినా.. ఇది మాత్రం ఇంతవరకు రాలేదు. ఇన్నాళ్ళ నా కెరీర్‌లో ఇంత మంచి సినిమా నేను తీయలేదు కూడా.
 
ట్రైలర్‌ డైలాగ్స్‌లో ఇండస్ట్రీపై సెటైర్‌లా అనిపిస్తుంది?
ఏ సందర్భంలో ఆ డైలాగ్‌ వచ్చేది అనేది తర్వాత సీన్‌ను బట్టి వుంటుంది. అయితే ఎవ్వరినీ కించపరిచే ఉద్దేశ్యం కాదు. కానీ ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం అలా పెట్టాం అని చెప్పారు.