గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Modified: శనివారం, 21 ఫిబ్రవరి 2015 (17:46 IST)

బూతు అనేది మనిషిలోని రెండో కోణం... అందుకే అది... బ్రహ్మానందం(ఇంటర్వ్యూ)

కామెడీ ఆర్టిస్టుల్లో బ్రహ్మానందం అందె వేసిన చేయి. ఎంతమంది తెలుగుచలనచిత్ర రంగంలో కొత్తవారు వస్తున్నా.. తను మాత్రం ఇంకా చెక్కుచెదరకుండా తన బ్రాండ్‌ను నిలబెట్టుకున్న వ్యక్తి ఆయనే. ఇతర భాషల్లో లిమిట్‌గా హాస్య నటులున్నా... తెలుగులో ఎంతోమంది వున్నా ఇంకా నవ్వించడానికి ప్రేక్షకులు కావాల్సి వస్తుందంటున్నారు. కొడుకును అభివృద్ధి పథంలో నడిపించాలిన ఏ తండ్రికైనా వుంటుంది. కానీ ఎవరికి వారు తన కాళ్ల మీదే నిలబడాలనేది నా పాలసీ. అందుకే వాడికి ఏ రికమండేషన్‌లు చేయనంటున్న బ్రహ్మానందంతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు.
 
ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించే మీకే నవ్వు తెప్పించిన చిత్రమేదైనా వుందా?
తెరపై ఎదురుగా నేను కన్పిస్తున్నాను కాబట్టి వారు నన్నుచూసి నవ్వుతుంటారు. అందుకు సరైన డైలాగ్‌లు, సీన్స్‌ కూడా కలిసిరావాలి. నాకునేనుగా నవ్విన సందర్భాలు చాలా వున్నాయి. సెట్లో చాలామంది నన్ను కూడా నవ్విస్తుంటారు. జంధ్యాల గారితో పనిచేసేటప్పుడు ఆయన చెప్పే సన్నివేశాలే నవ్వు తెప్పిస్తాయి. చిత్రం భళారే విచిత్రంలో.. నరేష్‌తో చేసే ఎపిసోడ్‌ చేస్తున్నప్పుడు నవ్వు తెప్పించింది. ఇలా పలు చిత్రాల్లో నవ్వువస్తుంది.
 
చాలా చిత్రాల్లో కామెడీ బూతుగా మారుతోంది. దీనిపై మీ కామెంట్‌? 
బూతు అనే మాట ఇప్పటిది కాదు. చాలా ఏళ్ళనుంచి వస్తుంది. రెండు చేతులు ముడిస్తే చాలనుకుంటారు. విప్పితే.. అంతా అదే. సిటీలో కంటే విలేజ్‌లో ప్రతి పనిచేసేవాడు పొలం పనులు చేసేవారు కూడా అటువంటి మాటలు మాట్లాడకుండా హుషారుగా చేయలేరు. కూలి పని చేసే కార్మికులు భారీ బరువులు మోయాలంటే... ఏవేవో పాటలు పాడుకుంటూ.. అందులో ద్వందార్థాలు వచ్చేలా అరుస్తూ చేస్తుంటారు. 
 
బూతు అనేది మనిషిలో వున్న రెండో కోణం. దీన్ని ఎవ్వరూ అంగీకరించరు. సీక్రెట్‌గా చూడ్డానికి ఇష్టపడతాం. కామెడీ బూతుగా మారుతుందంటే ప్రేక్షకులు చూస్తున్నారని తీస్తున్నారని చెప్పేవారున్నారు. అవి చూడకుండా వుంటే రాయరు కాని ఇది చాలా కష్టమైన పని. చెప్పినంత ఈజీ కాదు.
 
బ్రహ్మానందం దెబ్బకు హీరోలు కూడా జీరోలు అవుతున్నారనే కామెంట్‌ వుంది. ఇది ఎలా అనిపిస్తుంది? 
బ్రహ్మానందం దెబ్బకు జీరోలు అవుతున్నారనేది కరెక్ట్‌ కాదు. నేను దెబ్బ కొట్టడానికి ఎవర్ని.. వాళ్ళే నన్ను కొడితే పడిపోతాను (నవ్వుతూ).. ఇవేవీ కాదు. కథను రాసుకున్నప్పుడే పలానా కామెడీ ఆర్టిస్టు కావాలని దర్శకనిర్మాతలు అనుకుంటారు. అది నచ్చి నా దగ్గరకు వస్తారు. 
 
ఒకవేళ వచ్చాక.. వీడివల్ల ఎంత లాభం అనేది ఆలోచిస్తారు. అన్నీ కుదిరాక నన్ను తీసుకుంటారు. ఆ చిత్రాల్లో పెద్ద హీరోలు నటిస్తున్నారంతే... అదే బ్రహ్మానందం చిన్నచిత్రాల్లోనూ నటిస్తున్నాడు. మరి అక్కడ హీరోలు ఎందుకు జీరోలు కావడం లేదు చెప్పండి... ఇదంతా ఓ చట్రం. ఇవాళ నేను రేపు ఇంకొకడు. ఇక్కడ బ్రహ్మానందమే శాశ్వతం కాదు. 
 
మీ కొడుకును హీరోగా చేయడంలో మీ పాత్ర ఎంతవరకు వుంది? 
నా కొడుకును నిలబట్టాలని మా గౌతమ్‌తో సినిమాలు తీయాలని నేను రికమండేషన్‌ చేస్తే ఎవ్వరూ చేయరు. వాడిలో టాలెంట్‌ వుండాలి. అది నిలబెట్టుకోవాలి. ఇక్కడ టాలెంట్‌ వుంటేనే నిలబడతాడు. నేను పెద్ద కామెడీ ఆర్టిస్టును. నా కొడుకు కూడా అవ్వాలనుకుంటే అది కుదరదు. దేవుడు ఎలా రాసిపెట్టాడో అలా జరుగుతుంది. 
 
గిన్నీస్‌ బుక్‌ ఎక్కిన మీరు ఇంకా చేయాల్సిన పాత్రలేమైనా వున్నాయా? 
ఇంకా కొత్తగా చేయాల్సినవి ఏమీలేవు. ఎటువంటివైనా రచయితలు రాస్తే అవి నాకు సరిపోతే నేను చేస్తాను. అలాంటి ప్రయత్నమే బాబాయ్‌ హోటల్‌ అనే సినిమాలో సెంటిమెంట్‌ చేశాను. కానీ అది ఎక్కలేదు. అందుకే అప్పటి నుంచి ఆ ప్రయోగాలు చేయలేదు. జీవితాంతం నవ్విస్తూనే వుండాలనేది నా కోరిక.
 
ఇండస్ట్రీలో ఎక్కువగా కేన్సర్‌ వల్లే చనిపోతున్నారు. ఇది మీకెలా అనిపిస్తుంది? 
కేన్సర్‌ వల్లే చనిపోవడం అనేది ఎక్కువగా ప్రచారం జరిగింది. వాస్తవంగా కొద్దిమంది అలా చనిపోయారు. అయితే సెలబ్రిటీ ఫీల్డు కాబట్టి ఇక్కడ ఏది జరిగిగా వెంటనే ఆ ఎఫెక్ట్‌ ప్రజల్లో ఊరికే తెలిసిపోతుంది. కేన్సర్‌ వల్ల ఎంతోమంది ఇతర రంగాల్లో వారు చనిపోతున్నా.. వారి గురించి పెద్దగా తెలీదు. సినిమా అనేసరికి హైప్‌ వస్తుంది. అంతే తేడా.
 
మీరు ఖాళీ సమయాల్లో దేనిపై ఆసక్తి చూపుతారు? 
ఖాళీగా వున్నానంటే.. ఏదో ఒకటి పుస్తకం చదువుతుంటారు. ఆఖరికి రాత్రిపూట ఆలస్యంగా ఇంటికి వచ్చినా ఏదో ప్రముఖ రచయితల పుస్తకాలు, కవితలు కూడా చదువుతాను. అయితే మీరడిగిన దానికి సమాధానం మాత్రం.. నాకు చిత్రలేఖనం అంటే ఇష్టం. నాకు నేను ఏవో బొమ్మలు గీసుకుని తృప్తి పడుతుంటాను.