బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Updated : సోమవారం, 12 అక్టోబరు 2015 (21:06 IST)

రామ్ చరణ్ క్వాలిటీస్ చూసి షాకయ్యాను : శ్రీను వైట్ల ఇంటర్వ్యూ

యాక్షన్‌, కామెడీ, సెంటిమెంట్‌ అనే మూడు అంశాలను బాగా మిక్స్‌ చేసి ఫుల్‌ ఎంటర్టైనింగ్‌ ఉన్న సినిమాలు తీసే దర్శకుడు శ్రీను వైట్ల. కామెడీ ఆర్టిస్టును బకారా చేస్తూ ఎంటర్‌టైన్‌ చేస్తూ ఒక ఒరవడిని సృష్టించిన ఆయన 'ఆగడు' సినిమాను ప్రేక్షకులు తిరస్కరించారు. అందుకే ఈసారి సరైన కథతో కచ్చితంగా హిట్‌ కొట్టాలని రామ్‌ చరణ్‌తో చేసిన సినిమా 'బ్రూస్‌ లీ'. ఈ సినిమా ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శ్రీను వైట్ల తన కెరీర్‌ అనుభవాలను ఇలా విశ్లేషించారు.
 
'ఆగడు' తర్వాత 'బ్రూస్‌ లీ'తో ఏ మేరకు ఎంటర్‌టైన్‌ చేయబోతున్నారు?
'అపజయాల నుంచే ఎక్కువ నేర్చుకుంటాం' అనే మాటని పెద్దలు చెబుతుంటారు. అలానే నేను 'ఆగడు' ఫ్లాప్‌ నుంచి చాలా నేర్చుకున్నాను. ముఖ్యంగా నేర్చుకున్నది ఏంటి అంటే.. సినిమాని రెండు పద్ధతుల్లో చెబుతారు.. మొదటిది.. ఓ మంచి కథని తీసుకొని దాన్ని ఎంటర్‌టైనింగా చెప్పడం. రెండవది.. ఎంటర్‌టైన్‌ కోసం ఒక కథని చెప్తూ సినిమా చెయ్యడం. ఈ రెండు పద్ధతుల్లో నేను సినిమాలు చేశాను. కానీ మొదటి ఫార్మాట్‌ (వెంకీ, ఢీ, రెడీ, దూకుడు లాంటి సినిమాలు)లో నాకు సక్సెస్‌లు వచ్చాయి. సెకండ్‌ ఫార్మాట్‌లో అనుకున్న స్థాయి ఫలితాలు రాలేదు. అందుకే 'బ్రూస్‌ లీ' కోసం ఓ మంచి కథని అనుకొని దానిని సరదాగా చెప్పడానికి ట్రై చేశాను. ఖచ్చితంగా ఈసారి సక్సెస్‌ అవుతానని నమ్ముతున్నాను.
 
కామెడీ ఎంత ఉన్నా.. కుటుంబ విలువలకి పెద్ద పీట వేస్తుంటారే?
నా నుంచి ప్రేక్షకులు ఆశించేది కామెడీనే. అది కాకుండా ఫ్యామిలీ ఎమోషన్స్‌ అనేవి నాకు ఇష్టం. అందుకే నా ప్రతి సినిమాలో అలా ఉండేలా చూసుకుంటాను. నాకు తెలిసి నా సినిమాల్లో ఫ్యామిలీ యాంగిల్‌ తక్కువ ఉన్న సినిమా 'ఆగడు'. ఆ సినిమా ఫ్లాప్‌కి అదీ ఒక కారణంగా భావిస్తాను.
 
మీ కథల్లో ఒకే ముద్ర ఉంటుంది. మరి 'బ్రూస్‌ లీ'లో మార్పులేమైనా ఉన్నాయా?
'ఆనందం' సమయంలో లవ్‌, కామెడీ తరహాలో కొన్ని సినిమాలు చేశా. ఆ తర్వాత దానికి బ్రేక్‌ ఇచ్చి లవ్‌, యాక్షన్‌, కామెడీ బ్యాక్‌‌డ్రాప్‌లో వెంకీ, దుబాయ్‌ శీను, అందరివాడు లాంటి సినిమాలు చేసాను. ఆ తర్వాత 'ఢీ' నుంచి మరో ఫార్మాట్‌ స్టార్‌ చేసాను, సక్సెస్‌ అయ్యింది. అలాగే నేను అదే ఫార్మాట్‌లో ఎక్కువ సినిమాలు చేసేశాను, అదే టైంలో బయటి వారు కూడా అదే మాదిరి సినిమాలు చేయడం ఎక్కువైంది. అందుకే నేను 'ఆగడు' సినిమా ఫ్లాప్‌ తర్వాత ఇక ఈ ఫార్మాట్‌కి బ్రేక్‌ ఇచ్చేయాలని దీన్ని సరికొత్తగా ట్రై చేశాను. బ్రూస్‌ లీ కొత్తగా వున్నా, నా మార్క్‌ కామెడీ కూడా ఉంటుంది. ఇక అది ఎలా ఉందనేది ప్రేక్షకులు చూసి చెప్పాలి.
 
అసలు బ్రూస్‌ లీ... ది ఫైటర్‌ సినిమా కథ గురించి చెప్పండి?
'బ్రూస్‌ లీ... ది ఫైటర్‌' అనే టైటిల్‌ బాగా యాక్షన్‌ తరహాలో ఉన్న ఇదొక కంప్లీట్‌ ఫ్యామిలీ స్టొరీ. ఫ్యామిలీని విపరీతంగా ప్రేమించే వ్యక్తికి సొసైటీలో ఓ పలుకుబడి ఉన్న వ్యక్తికి మధ్య ఓ పెద్ద సమస్య వస్తుంది. ఆ సమస్యని ఎలా పరిష్కరించాడన్నదే కథ.
 
చిరంజీవి, రామ్‌ చరణ్‌లో ఉన్న కామన్‌ క్వాలిటీస్‌ ఏంటి?
నేను నా రెమ్యునరేషన్‌ కంటే దర్శకుడిగా ఫ్రీడం కోరుకుంటాను. సక్సెస్‌లో ఉన్నవారికి ఆ ఫ్రీడం ఉంటుంది. కానీ ఫ్లాప్‌ ఇచ్చిన నాకు చిరు, చరణ్‌లు పూర్తి ఫ్రీడంని కలిగించారు. వారు ఆ ఫ్రీడం ఇవ్వడం వల్లే ఈ సినిమాని బాగా తీయగలిగాను. ఇక చిరు, చరణ్‌ల విషయానికి వస్తే.. చిరంజీవి ఎలాంటి పరిస్థితుల్లో అయినా బ్యాలెన్స్‌గా ఉంటారు, ఎవ్వరినీ హర్ట్‌ చేయరు, అలాగే అందరినీ ప్రేమగా చూసుకుంటారు. ఆ క్వాలిటీస్‌ చరణ్‌కి అలానే వచ్చాయి. వాటికంటే మించి చరణ్‌ తన వయసు కంటే మించి అనుభవం ఉన్న వ్యక్తిలా బిహేవ్‌ చేస్తాడు. అది నన్ను షాక్‌కు గురి చేసింది. బహుశా ఆయన పెంపకం వల్లనే ఆ క్వాలిటీ చరణ్‌కి వచ్చిందనుకుంటా.
 
రామ్‌ చరణ్‌లో మీకు నచ్చిన అంశాలు ఏమిటి?
సెన్సాఫ్‌ హ్యూమర్‌ ఉంది. దానివల్లే నేను చరణ్‌కి బాగా కనెక్ట్‌ అయ్యాను. చిరంజీవి లోని కామెడీ టైమింగ్‌ చరణ్‌లోనూ ఉంది. అది ఇప్పటివరకూ ఎవరూ చూపించలేదు. అదే నేను బ్రూస్‌ లీలో చూపాను. ఇక చాలామంది బాగా డాన్సులు చేస్తారు కానీ చరణ్‌ డాన్సుల్లో ఉండే గ్రేస్‌ అంటే నాకు చాలా ఇష్టం. అలాగే నాకు చరణ్‌ వాయిస్‌, హెయిర్‌ స్టైల్‌ అంటే చాలా ఇష్టం. అందుకే నేను ఈ సినిమాలో చిరుత హెయిర్‌ స్టైల్‌ని రిపీట్‌ చేశాను.
 
చిరంజీవి ఈ సినిమాలో చెయ్యడానికి మీరే ప్రధాన కారణమని విన్నాం. నిజమేనా?
ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్ర ఉంది. ఆ పాత్ర కోసం చిరు అయితే బాగుంటుందని అనుకుని ఆయన్ని కలిశాం. కథ, ఆయన పాత్రకి ఉన్న ప్రాముఖ్యత నచ్చి చేయడానికి ఒప్పుకున్నారు. ఆయనకి నచ్చడం వల్లే ఒప్పుకున్నారు తప్ప ఫోర్స్‌గా అయితే చేయలేదు.
 
కోన వెంకట్‌ మీపై విమర్శలు గుప్పించారు. అయినా ఆయనతో కలిసి చేయడానికి కారణం?
అది గతం. ఇష్టమైన వారిదగ్గరే విమర్శలు వుంటాయి. ఇద్దరూ ఒకరికొకరు కావాలని కోరుకుని ఈ సినిమాకు పనిచేశాం. మమ్మల్ని ఎవ్వరూ కలిసి చేయమని ముందుకు నెట్టలేదు. ఇండస్ట్రీలో ఇలా అపార్థాలు చేసుకోవడం.. తర్వాత కలవడం అనేది సహజమే.
 
కేవలం నాలుగు నెలల్లో పూర్తి చేయడానికి ప్రధాన కారణమేమైనా వుందా?
టఫ్‌ అనిపించేది కథని రెడీ చేసుకోవడమే. ఎందుకంటే సినిమాకి అదే కీలకం. ఒకసారి  ఓకే అయ్యాక ఎంజాయ్‌ చేస్తూ సినిమా చేసేస్తాను. బ్రూస్‌ లీ సినిమాని నా కెరీర్లో చాలా తక్కువ టైంలోనే తీశాను. వెంకీ టైంలో ఇదే స్పీడ్‌లో సినిమాలు చేశాను. ఆ తర్వాత అనుకోకుండా టైం తీసుకోవడం పెరిగింది. ఇంత ఫాస్ట్‌గా సినిమా తీసినా ఎక్కడా ప్రెజర్‌ లేదు, బాగా ఎంజాయ్‌ చేస్తూ సినిమా చేశాను. ఇంత ఫాస్ట్‌‌గా చేయడంలో నాకు వెన్నుదన్నుగా ఉన్న సినిమాటోగ్రాఫర్‌ మనోజ్‌ పరమహంసకి ప్రత్యేక ధన్యవాదాలు. 
 
తదుపరి సినిమాలు?
ఈసారి నా నుంచి వచ్చే సినిమా పూర్తిగా కొత్తగా ఉంటుంది. ప్రస్తుతం రెండు లైన్స్‌ అనుకుంటున్నాను. త్వరలోనే ఒకటి ఫైనలైజ్‌ చేస్తాను. అలాగే ఈసారి నేను చేయబోయే సినిమా డైరెక్టర్‌గా నా స్థాయిని పెంచేది, నాకు ఉపయోగపడే సినిమా చేయాలనే ప్లాన్‌లో ఉన్నాను. అలాగే ఇప్పటివరకూ ఫలానా హీరోతో చెయ్యాలి అనే ప్లాన్‌తో కథ రాసుకునే వాళ్ళం. కానీ ఈసారి ముందు కథని రాసుకుంటా, ఆ కథే హీరోని ఫిక్స్‌ చేస్తుందని అనుకుంటున్నాను.. అని ముగించారు.