గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By ivr
Last Modified: గురువారం, 18 డిశెంబరు 2014 (19:58 IST)

మొహంపై మట్టి వేసే సీన్లో హన్సిక అద్భుతంగా చేసింది... సి.కళ్యాణ్ ఇంటర్వ్యూ

ప్రముఖ నిర్మాతగా సి.కళ్యాణ్‌ పేరు తెలిసిందే. మహేష్‌ బాబుతో 'ఖలేజా' చేశారు. ఆ చిత్రంకు ముందు మద్దెల సూరి, భాను కేసులో ఆయన నిందితుడిగా పేరు బయటకు వచ్చింది. అదేమీ లేదు. అదంతా దుష్ప్రచారం అని చెబుతున్న సి.కళ్యాణ్‌ ప్రస్తుతం సినిమాపైనే కాన్‌సన్‌ట్రేషన్‌ చేస్తున్నారు. తాజాగా ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు కార్యదర్శి స్థాయికి ఎదిగారు. 
 
ఇది కూడా సౌత్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడిగా చేయడం, జయలలిత ఆధ్వర్యంలో 100 ఏళ్ళ సినీపరిశ్రమ వేడుకలు దిగ్విజయంగా చేయడంతో వచ్చిన పదవిగా చెబుతున్నారు. ఆయన తాజాగా తమిళంలో హన్సిక ప్రధాన పాత్ర పోషించిన 'అరన్మణి' చిత్రాన్ని తెలుగులో 'చంద్రకళ'గా శ్రీశుభశ్వేత ఫిలిమ్స్‌పై అనువదించారు. 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ...
 
చంద్రకళ బిజినెస్‌ అయిందా? 
47వ సినిమా నాది. 46 సినిమాల్లో కాంపిటేషన్‌ అయి క్రేజ్‌ తో బయ్యర్ల వద్దకు వచ్చింది. రక్తచరిత్ర-1కు వుంది. దాని తర్వాత 'చంద్రకళ'కు దక్కింది. నేను వ్యాపారంలో పూర్‌. వ్యాపారం చేసేటప్పుడు కొందరు కష్టాలు చెబుతారు అవి విని.. తగ్గించుకోవడం జరిగేది. నా బయ్యర్లు చాలా హ్యాపీగా వున్నారు. రెండు రోజుల ముందే ఆన్‌లైన్‌ బుకింగ్‌ 50 శాతం పూర్తవడం శుభసూచకం.
 
'అరుంధతి'లా వుందని కామెంట్‌ వున్నాయి? 
అవును. కథ డిఫరెంట్‌ అయినా.. హారర్‌ సినిమా అనే ఫీలింగ్‌ కన్పిస్తుంది. దానిలో బ్యూటిఫుల్‌ లవ్‌ వుంది. 'చంద్రకళ' అనువాద చిత్రమైనప్పటికీ తెలుగు నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేశాం. గ్రాఫిక్స్‌లో రోడ్లపై ఉన్న పేర్లతో సహా అన్ని ఇక్కడ జరిగినట్లుగా చూపించాం. అప్పట్లో వచ్చిన 'అమ్మోరు' చిత్రం అంత స్థాయికి ఈ చిత్రం చేరుతుందనే నమ్మకం వుంది. 
 
రివెంజ్‌ డ్రామానా? 
గ్రామంలో అమ్మోరుగా వుండే ఆమె ప్రేమలో పడితే.. పరిపక్వత ఏర్పడే టైంలో హత్యకు గురవుతుంది. ఆ తర్వాత కథేమిటి? అనేది సినిమా. 'అమ్మోరు'లో సౌందర్య నటన ఎలా ఆకట్టుకుందో అంతకుమించి హన్సిక ఆహార్యం ఇందులో ఆకట్టుకుంటుంది. సన్నివేశాలు వాస్తవికంగా వుండటంకోసం నటించదనుకున్న చోట్ల కూడా అద్భుతంగా పండించింది. కోట శ్రీనివాసరావు నటన ప్రత్యేకంగా నిలుస్తుంది.
 
హన్సిక ఎలా చేసింది? 
ఆ అమ్మాయి కొన్ని సీన్లు బాగా చేసింది. బతికుండగానే సమాధి కడతారు విలన్లు. అప్పుడు మొహంపై మట్టివేయాలి. ఇలాంటి సీన్‌ సహజంగా పెద్ద హీరోయిన్లు చేయరు. కానీ ఆ అమ్మాయి అద్భుతంగా చేసింది. 
 
ఈ సినిమాకు బేస్‌ ఏమిటి? 
అమ్మోరుకు బేస్‌. ఉండమ్మా బొట్టుబెడతా అనేది. అదే కథను కొద్దిగా మార్చి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి అమ్మోరుగా తీర్చారు. కానీ చంద్రకళకు బేస్‌ ఇలాంటిది కాదు. 
 
ఎన్ని థియేటర్లలో రిలీజ్‌ చేస్తున్నారు? 
ఇక్కడో విషయం చెప్పాలి. థియేటర్ల లీజు విధానం వలన చిన్న నిర్మాతలు నష్టపోతున్నారనేది వాస్తవం. నాలాంటి పలుకుబడి వున్నవాడికే ఈ సినిమా విడుదల విషయంలో థియేటర్ల సమస్య ఎదురైంది. అలాంటిది చిన్న నిర్మాతల పరిస్థితి ఎలా వుంటుందనేది అర్థం చేసుకోవచ్చు. ఒక్క నైజాం ఏరియానే ముగ్గురు చేతుల్లో వుంది. అలాంటి విధానం అన్నిచోట్లా వుంది. ఏవో కొద్దిమంది చేతుల్లో వున్న ఈ విధానం ఇలాగే కొనసాగితే కొందరి జీవితాలు నాశనం అవుతాయి. అదెలాగంటే.. ఎవడో కడుపు మండినోడు నక్సలైట్‌ పేరుతో తెగిస్తాడేమోనని అనిపించింది. ఆవిధంగా థియేటర్లు అందుబాటులో లేకుండా చేసి నిర్మాతల్ని ఏడిపిస్తున్నారు. 

 
ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా పదవి రావడం ఎలా వుంది? 
దక్షిణాది సినీపరిశ్రమపై ఉత్తరాదిపై పూర్తి నమ్మకముంది. సాధారణంగా ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా అనేది ఉత్తరాది వారిదనే పేరుంది. వారే ఎక్కువగా నిర్వహణా బాధ్యతలు స్వీకరిస్తుంటారు. అయితే తొలిసారి నిర్మాత జి. ఆదిశేషగిరిరావు దానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఆయన తర్వాత స్థానంలో నేనే ఉన్నాను. నిధుల సమీకరణ చేసే పనుల పట్ల ఉత్తరాది వారికి మనమంటే పూర్తి నమ్మకముంది. అందుకే కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, అరుణ్‌ జైట్లీతోపాటు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సహకారంతో తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచే విధంగా ప్రయత్నాలు చేస్తాం.
 
కొత్త చిత్రాలు ఏమిటి? 
త్వరలో వరుణ్‌తేజ్‌, పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌లో ఓ చిత్రం నిర్మించబోతున్నా. ఇది పూర్తి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా పూరి శైలిలో వుంటుంది. పూరీ, మహేష్‌ బాబు కలయికలో తెరకెక్కనున్న చిత్రంతోపాటు మా చిత్రం కూడా సెట్‌పైకి వెళుతుంది. అదేవిధంగా నాగచైతన్య కథానాయకుడిగా శ్రీనివాస్‌ రెడ్డి దర్శకత్వంలో ప్రారంభమైన 'దుర్గ' చిత్ర రద్దు కాలేదు. ప్రస్తుతానికి బ్రేక్‌ పడింది. ఆ దర్శకుడికీ నాకూ గొడవలు లేవు.
 
లావు చాలా తగ్గారే కారణం? 
నేను ఇంతకుముందు 128 కేజీలు వుండేవాడిని. నాకే భయమేసేది. దాంతో ట్రీట్‌మెంట్‌ ద్వారా ఇప్పుడు 80 కేజీలకు వచ్చాను. ఇదంతా సీరియస్‌గా 'పేరియాటిక్‌ మిషన్‌ ద్వారా' తగ్గాను. డాక్టర్ల పర్యవేక్షణలో జరుగుతుంది. ఇప్పటికి తగ్గి మూడేళ్ళయింది. తిండి కూడా తగ్గించా. ఎక్కువ తినాలనిపించదు. కడుపు నిండిపోయినట్లుంది. 4,5 నెలల నుంచి రైస్‌ పూర్తిగా తగ్గించా. యూత్‌ హీరోలు కొద్దిమంది ఇలాంటి ట్రీట్‌మెంట్‌ చేసుకుంటున్నారని విన్నాను అని చెప్పారు.