శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By ivr
Last Modified: సోమవారం, 15 డిశెంబరు 2014 (22:54 IST)

నా అభిమానే నా 'అర్థాంగి'... నా ఇంటి పేరు పూజ.. ఆరోజు చక్రి, ఇంటర్వ్యూ 3

నా పేరెంట్స్‌ తర్వాత.. నేను రుణపడి ఉండేది జగన్‌ అన్నయ్యకే!
 
జగన్‌ అన్నయ్య స్థానంలో వేరే ఎవరైనా ఉండి ఉంటే.. విషయం చెప్పి తర్వాత చిన్న సారీ చెప్పి సరిపెట్టి ఉండేవారు. ఆ మాటకొస్తే.. 'సారీ' మాత్రం ఎందుకు చెప్పాలి? పైసలు పెట్టే ప్రొడ్యూసర్‌ వద్దంటే డైరెక్టర్‌ ఏం చేస్తాడు? కానీ జగన్‌ అన్నయ్య అలా చేయలేదు. నాకిచ్చిన మాట కోసం వేరే నిర్మాతను వెతుక్కున్నాడు తప్ప.. మాట తప్పలేదు. అందుకే నేనెప్పుడూ చెబుతుంటాను.. 'మా పేరెంట్స్‌ తర్వాత నేను ఆజన్మాంతం రుణపడి ఉండాల్సింది జగన్‌ అన్నయ్యకే'నని. అందుకే నేను ఎంతో ఇష్టపడి కట్టించుకున్న ఇంటికి 'పూజా కుటీర్‌' అనే పేరు పెట్టుకున్నాను. ''పూజ' ఎవరు? మీ అమ్మగారా.. లేక మీ మిసెస్‌ పేరా..?' అని తెలియనివాళ్ళు చాలామంది అడుగుతుంటారు. 'పూజ కుటీర్‌' అంటే 'పూరి జగన్నాథ్‌ కుటీర్‌' అని అర్థం. 
 
జగన్‌ అన్నయ్యకి జేజేలు కొట్టించాలన్న కసితో..
నా కోసం జగన్‌ అన్నయ్య అంత రిస్క్‌ తీసుకున్నాక.. తన కోసం నేనేం చేయగలను..? తన పట్ల నాకేర్పడిన కృతజ్ఞతను ఎలా ప్రకటించుకోగలను? సినిమా విజయంలో కీలక పాత్ర పోషించగలిగేంత శ్రావ్యమైన సంగీతాన్ని సమకూర్చడం తప్ప నాకింకేం చేతనవుతుంది..? మనసుపెట్టి కాదు.. ప్రాణం పెట్టి 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం'కు నేను చేసిన మ్యూజిక్‌ మ్యాజిక్‌ చేసింది. సినిమా సూపర్‌ హిట్టయ్యింది. ఆ సినిమా ద్వారా జగన్‌ అన్నయ్య తనకు తాను బ్రేక్‌ ఇచ్చుకోవడం మాత్రమే కాదు... హీరోగా రవితేజకు, సంగీత దర్శకుడిగా నాకు బ్రేక్‌ ఇచ్చారు. ఆ తర్వాత మా ముగ్గురి కలయికలో వచ్చిన 'ఇడియట్‌', 'అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి' చిత్రాలు రికార్డ్‌ బ్రేకింగ్‌ కలెక్షన్స్‌ సాధించాయి. ఈ సినిమాల మధ్యలోనే.. వంశీగారితో తొలిసారి నేను చేసిన 'ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు' కూడా సంచలన విజయం సాధించింది. ఇక ఆ తర్వాత నుంచి అందరికీ తెలిసిందే. 
 
మా ఇద్దరి పదకొండో సినిమా త్వరలో..
'బాచి' మొదలుకుని 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్‌, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, ఆంధ్రావాలా, శివమణి, 143, దేశముదురు, నేనింతే, గోలీమార్‌' చిత్రాలు జగన్‌  అన్నయ్యకి చేశాను. అన్నీ మ్యూజికల్‌ హిట్సే. వీటిలో రెండు మూడు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోయినా.. ఆ సినిమాల్లోని పాటలు చాలా పాపులరయ్యాయి. 'జగన్‌ అన్నయ్య డైరెక్షన్‌లో పదకొండో సినిమాకు సంగీతాన్నందించే సువర్ణావకాశం ఎప్పుడొస్తుందా' అని.. ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నాను. కొత్తగా నన్నెవరు కలిసినా.. లేక కొద్దిరోజుల విరామం తర్వాత నన్ను కలిసే ఫ్యాన్స్‌, ఫ్రెండ్స్‌, ప్రెస్‌ పీపుల్‌.. అందరూ అడిగేదొక్కటే-  'జగన్‌గారి కాంబినేషన్‌లో మళ్లీ సినిమా ఎప్పుడు?'. అయితే జగన్‌ అన్నయ్య ఈరోజు 'ఒన్‌ ఆఫ్‌ ది టాప్‌ డైరెక్టర్స్‌'. ఆయనకు చాలా ఆబ్లిగేషన్స్‌తోపాటు ప్రెజర్స్‌ కూడా ఉంటాయి. పైగా ఒకప్పుడు నన్ను ప్రోత్సహించి పైకి తీసుకొచ్చినట్టుగానే.. ఇంకా చాలామందికి ఆయన అవకాశాలివ్వాల్సి ఉంటుంది.
 
 
ఫలానా టైమ్‌కల్లా అద్భుతమైన పాట చేయమనడం సాధ్యమా?
నాకు తెలుసు.. నా పంక్చువాలిటీ గురించి చాలామంది విమర్శిస్తుంటారని. కానీ ఆ విమర్శలకు నేను చెప్పేదొక్కటే. నాక్కావల్సినంత టైమ్‌, నేను కంఫర్ట్‌గా ఉండేంత స్పేస్‌ నా దర్శకులు, నిర్మాతలు నాకు ఇచ్చిన ప్రతిసారి నేను నా మ్యూజిక్‌తో వండర్స్‌ చేశాను. మంచి ట్యూన్స్‌ వచ్చేంత వరకు నేను కాంప్రమైజ్‌ అవ్వను. నాకు నేనే జడ్జ్‌ చేసుకుంటూ ఉంటాను. దాంతో కొన్ని సందర్భాల్లో ఆలస్యమవుతుంటుంది. అల్టిమేట్‌గా అవుట్‌పుట్‌ ఎంత అద్భుతంగా వచ్చిందనే దానిపైనే నేను ఎక్కువ కాన్‌సన్‌ట్రేట్‌ చేస్తాను తప్ప... ఆదరాబాదరా ట్యూన్‌ ఇచ్చి జేబులు నింపుకోవాలని చూడను. ముఖ్యంగా కావాలని ఎప్పుడూ లేటు చెయ్యను.
 
 
ఫ్రెండ్‌షిప్‌ చేశాకే పాటలు..
నేనేదైనా కొత్తగా ఓ సినిమా కమిటైతే.. ఆ సినిమా ప్రొడ్యూసర్‌, డైరెక్టర్‌ కొత్తవాళ్ళయితే.. ముందు వాళ్ళతో మింగిల్‌ అయి ఫ్రెండ్‌షిప్‌ చేస్తాను. సబ్జెక్ట్‌లో వీలైనంత వరకు ఇన్‌వాల్వ్‌ అవుతాను. అప్పుడే పాటలు చేస్తాను. ఈరోజు ఉదయం సినిమాకు సైన్‌ చేసి- సాయంకాలానికల్లా సాంగ్స్‌ చేయడమంటే అది ఎవరికీ సాధ్యం కాదు కదా?
 
అపార్థం చేసుకున్నవాళ్ళకు అర్థమయ్యేందుకు ప్రయత్నిస్తున్నాను!
నిర్మాతలు కావచ్చు, దర్శకులు కావచ్చు.. కొంతమంది నన్ను సరిగా అర్థం చేసుకోకపోవడం కానీ, లేదా అపార్థం చేసుకోవడం కొన్ని సందర్భాల్లో జరిగి ఉండవచ్చు. కానీ ఇకపై అటువంటి అపార్ధాలకు అవకాశం లేకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను. 
 
స్నేహం కోసం మరీ ఎక్కువ సమయం వృధా చేసుకోవద్దని నిర్ణయించుకున్నాను!
ఫ్రెండ్‌షిప్‌ కోసం ఇప్పుడే కాదు.. ఎప్పుడూ నేను పడిచస్తాను. ఫ్రెండ్‌షిప్‌కు ప్రాణమిస్తాను. అయితే ఫ్రెండ్‌షిప్‌ అంటే రోజూ గంటల తరబడి కబుర్లు చెప్పుకోవడం, టైమ్‌పాస్‌ చేయడం కాదని..  నిజమైన ఫ్రెండ్‌ నెలల తరబడి దూరంగా ఉన్నా మనసులోనే ఉంటాడని ఈ మధ్యే తెలుసుకుంటున్నాను. స్నేహం శాశ్వతంగా ఉండేది. ప్రతిరోజూ దానికి కొన్ని గంటల కాలాన్ని కేటాయించి కాపాడుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ అలా చేస్తేనే నిలబడుతుందంటే అది ఫ్రెండ్‌షిప్పే కాదని నా పర్సనల్‌ ఫీలింగ్‌. కాబట్టి 2014లో నేను తీసుకున్న గట్టి నిర్ణయం ఏమిటంటే.. పనిని మరో పది రెట్లు ఎక్కువగా ప్రేమించడం. సంగీతంతోనే ఎక్కువ సమయం స్నేహం చేస్తూ 'సంగీత జీవన సౌందర్యాన్ని' ఆస్వాదించడం.
 
ఆ బాధ.. ఈ బాధను దిగమింగేసింది!
2003లో నేను 18 సినిమాలకు సంగీతం చేస్తే వాటిలో 13 సినిమాలు విడుదలయ్యాయి. ఇటీవల కాలంలో అదో పెద్ద రికార్డ్‌. అలాంటిది.. కారణాలు ఏవైనా, 2013లో నేను సంగీత దర్శకత్వం వహించిన సినిమా ఒక్కటీ విడుదల కాలేదు. అయితే ఆ విషయమై బాధపడే అవకాశం ఇవ్వకుండా.. దానికి కొన్ని వేల రెట్లు ఎక్కువైన మరో బాధను ఆ దేవుడు నాకు కలిగించాడు. తన చిటికెన వేలుతో నా చేయి పట్టుకుని నాకు నడక నేర్పించి, ఆ తర్వాత మంచి 'నడత'ను నేర్పి.. చిన్నప్పటి నుంచి అన్ని విషయాల్లో నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చి, నా ఉన్నతిని చూస్తూ.. గర్వంతో ఉప్పొంగిపోయిన మా నాన్న (వెంకట నారాయణ జిల్లా) పరమపదించడం నేనిప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నాను.
 
ఇద్దరక్కలు-ఒక చెల్లి-తమ్ముడు
నాకు ఇద్దరక్కలు (వాణిదేవి, కృష్ణప్రియ). ఒక చెల్లి (ఆదర్షిణి, సింగర్‌), ఒక తమ్ముడు (మహిత్‌ నారాయణ్‌). నాలాగే ఇంతకు ముందు పలు ప్రైవేట్‌ ఆల్బమ్స్‌ చేసిన మా తమ్ముడు మహి 'లవ్‌ యు బంగారం' చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు!
 
సంగీత సంక్రాంతి!
సంక్రాంతితో 'తెలుగు సినిమా'కున్న అవినాభావ సంబంధం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సంక్రాంతి సందర్భంగా విడుదలైన నా చిత్రాలు వరుసగా నాలుగు సంవత్సరాలు మ్యూజికల్‌ హిట్స్‌గా నిలవడం నా కెరీర్‌లో మరొక విశేషం. దేవదాస్‌ (2006), దేశముదురు (2007), కృష్ణ (2008), మస్కా (2009) చిత్రాల్లోని పాటలు సంక్రాంతి సంబరాల్లో సందడి చేయడం నాకు గర్వకారణం!
 
అభిమాని 'అర్థాంగి' అయిన వేళ..!!
నా పాటలంటే పడి చచ్చిపోయేంత అభిమానాన్ని నాపై పెంచుకుని ఒక్కసారైనా నాతో మాట్లాడాలని కాలేజీకి డుమ్మాకొట్టి మరీ నేను అటెండ్‌ అయిన ఓ ప్రోగ్రామ్‌కి వచ్చిన శ్రావణి. నాకు 'సహ ధర్మచారిణి' అవుతుందని ఆ క్షణం నేనూహించలేదు. 'అన్‌కండిషనల్‌'గా అభిమానించే వ్యక్తి 'జీవిత భాగస్వామి' అవ్వడంలో ఉన్న ఆనందానుభూతిని నేను ప్రతిరోజూ ఆస్వాదిస్తున్నాను. నా జీవితంలో నాకు జరిగిన అద్భుతాల్లో అతి ముఖ్యమైనది.. శ్రావణి నాకు లభించడం. నా విజయాల వెనకాల నా భార్య శ్రావణి సహాయసహకారాలు సదా ఉంటాయని నేను సగర్వంగా చెబుతానెప్పుడూ!