బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Modified: మంగళవారం, 9 జూన్ 2015 (19:31 IST)

పూరీ గారు కథ చెప్పగానే కిక్ కోసం అలా చేసేందుకు డిసైడ్ అయ్యా: చార్మి

చార్మి ప్రధానపాత్రలో నటించిన సినిమా 'జ్యోతిలక్ష్మి'. ఇందులో చార్మి వేశ్యగా నటించింది. అయితే వేశ్యగా ఎవ్వరి పక్కలో పడుకోని పాత్ర ఇదని అంటోంది చార్మి. వేశ్యను పెండ్లి చేసుకుంటానని ఓ వ్యక్తి వస్తాడు. తనను లవ్‌ చేసి పెండ్లి చేసుకుంటాడు. పెండ్లయ్యాక జీవితమే మారిపోతుంది. ఆ తర్వాతే అసలు సినిమా అని చెబుతోంది. పూరీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలవుతుంది. ఈ చిత్రంలో చార్మి నిర్మాత కూడా. నిర్మాతగా చాలా తెలుసుకున్నానంటున్న ఆమెతో జరిపిన ఇంటర్వ్యూ. 
 
సినిమాలో మీ పాత్ర ఎలా ఉండబోతోంది? 
నాదొక వేశ్య పాత్ర. రొమాంటిక్‌‌గా ఉండే ప్రాస్టిట్యూట్‌ పాత్రలో కనిపిస్తాను. అలాంటి అమ్మాయిని హీరో ప్రేమిస్తాడు. నిజానికి నా పాత్ర వేశ్య అయినా సినిమాలో హీరోతో తప్ప వేరే వాళ్ళతో ఉండేలా నన్ను చూపించారు. సినిమా మొదలవ్వడమే హీరో, హీరోయిన్‌ మధ్య రొమాన్స్‌‌తో స్టార్ట్‌ అవుతుంది. ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్న తరువాత ఆ వేశ్య జీవితం ఎలా మారుతుంది, తన లైఫ్‌‌లో జరిగిన ఓ ఇష్యూ కోసం ఎలా పోరాడుతుంది అనే అంశాలతో సినిమా సాగుతుంది.
 
దీనికోసం ప్రత్యేక జాగ్రత్తలు ఏం తీసుకున్నారు?
ప్రత్యేకంగా జాగ్రత్తలు ఏమీలేవుకానీ.. కానీ నా లుక్‌ కోసం పూరి గారు శరీర బరువును తగ్గించమని చెప్పారు. సుమారు 11 కేజీల బరువు తగ్గాను. సినిమా ఫస్ట్‌ హాఫ్‌‌లో ఒకలా సెకండ్‌ హాఫ్‌‌లో మరో లుక్‌‌తో కనిపిస్తాను. ఈ సినిమా చూసిన వారు ఇలాంటి అమ్మాయి కూతురు కాని మనకుంటే బావుంటుందనుకుంటారు. 
 
షడెన్‌గా నిర్మాత అవతారమెత్తారు? ఆర్టిస్టుగా చేస్తున్నారు. ఎలా బ్యాలెన్స్‌ చేశారు?
ఓ నటిగా చాలా ప్రశాంతమైన జీవితం గడిపాను. ప్రొడ్యూసర్‌‌గా అయితే మొత్తం బ్రెయిన్‌ అంతా సినిమా మీదే పెట్టాలి. ఆ స్ట్రెస్‌, టెన్షన్‌ అంటే నాకు చాలా ఇష్టం. నేను చాలా సినిమాలలో నటించాను. నిర్మాతగా వచ్చిన కిక్‌ ఏ సినిమాలో యాక్ట్‌ చేసినపుడు రాలేదు. అయినా ప్రొడ్యూసర్‌‌గా సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. పూరి గారు కథ చెప్పగానే సినిమాను నేనే ప్రొడ్యూస్‌ చేయాలని డిసైడ్‌ అయ్యాను. పేరు కోసం కాకుండా పని నేర్చుకోవాలనే తపనతో సినిమా నిర్మించాను.
 
40 ఏళ్ళనాటి 'మిసెస్‌ పరాంకుశం' కథ ఇప్పటికి ఎలా సింక్‌ అవుతుందనుకుంటున్నారు?
పూరి జగన్నాథ్‌ సినిమాలు స్టైలిష్‌‌గా, ట్రెండ్‌‌కు తగ్గట్లుగా ఉంటాయి. 40 సంవత్సరాల క్రితం రాసినా  ప్రస్తుతం ఉన్న జనరేషన్‌‌కు తగ్గట్లుగా మార్పులు చేశారు. అందరికీ నచ్చుతుందనే నమ్మకముంది.
 
జ్యోతిలక్ష్మి పేరు పెట్టడానికి కారణం?
ముందుగా ఏదో టైటిల్‌ అనుకున్నారు. కానీ షడెన్‌గా పూరీగారే జ్యోతిలక్ష్మి అని మార్చేశారు. ఇలాంటి పేరు పెట్టుకోవడానికి ఇప్పటికీ చాలామంది భయపడుతున్నారు. కానీ ఈ సినిమా చూశాక గర్వంగా ఫీలవుతారు. 
 
బైక్‌ రైడ్‌ శిక్షణ తీసుకున్నారా?
అదేంలేదు. నాకు చిన్నతనంలోనే మా అన్నయ్య బైక్‌ కీస్‌ తెలీకుండా తీసుకుని నేర్చుకున్నాను. కానీ ఏ సినిమాలోనూ అవసరం రాలేదు. ఈ సినిమాకు వచ్చింది. స్క్రిప్ట్‌ రెడీ చేసేప్పుడు పూరిగారు కాల్‌ చేసి బైక్‌ రైడ్‌ సీన్‌ పెట్టనా అని అడిగారు. ఓకే చెప్పేసా. సినిమాలో ఆ షాట్‌ వచ్చినప్పుడు చాలా ఎంజాయ్‌ చేసాను. బైక్‌ రైడింగ్‌ షాట్‌ పూర్తయినా ఇంకా చాలాసేపు తిరిగాను. బైక్‌ దిగేటప్పుడు ఎవడినైనా కొట్టగలను అనే తెలీని ధైర్యం వచ్చేసింది.
 
హిట్‌, ఫ్లాప్ ఎలా చూస్తారు?
నాకు 13 సంవత్సరాల వయస్సులో ఇండస్ట్రీకి వచ్చాను. మొదట్లో హిట్స్‌, ఫ్లాప్స్‌ అంటే ఏంటో తెలిసేవి కావు. వరుసగా ఏడు ఫ్లాప్స్‌ వచ్చాయి. డేర్‌ చేసి ఇండస్ట్రీలో అడుగుపెట్టాను కాబట్టి ఎన్ని కష్టాలొచ్చినా సినిమాలు చేసి తీరాలనే థాట్‌‌తో నటిస్తూ వచ్చాను. అలా చేసిన కొన్ని సినిమాలలో ఎందుకు నటించానా అని అనుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి. కాని మిస్టేక్‌ చేస్తేనే కథ ఎలాంటి స్క్రిప్ట్‌ సెలెక్ట్‌ చేసుకోవాలో తెలుస్తుంది. 
 
మీలో బలం, బలహీనతలు ఏమిటి?
నాకు చీకటి అంటే చాలా భయం. కాని అది లేకుండా ఉండలేను. అలానే నిర్ణయాలు చాలా ఫాస్ట్‌‌గా తీసుకుంటాను. ఎవరి పర్మిషన్స్‌ తీసుకోను. నాకు ఫుడ్‌ అంటే చాలా ఇష్టం. సినిమా కోసం డైట్‌ చేసి బాడీ ఫిట్‌‌గా ఉంచుకుంటాను. మధ్యలో గ్యాప్‌ వచ్చినప్పుడు బాగా తింటాను. ఆ సమయంలో ఎవరికీ కనిపించను. మళ్ళి డైట్‌ చేసి సినిమాలు చేస్తాను.
 
పెళ్ళెప్పుడు..?
పెళ్లి అనే కాన్సెప్ట్‌ బోర్‌.. అప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. నా ఆలోచనలకు తగినవాడు దొరకడం కష్టం.
 
'జ్యోతిలక్ష్మీ-2' ఎప్పుడు మొదలవుతుంది?
ఈ సినిమా షూటింగ్‌లో వుండగానే పూరీగారు స్టేట్‌మెంట్‌ ఇచ్చేశారు. ఆయనకు అంతగా బాగా నచ్చింది. ఈ సినిమా సక్సెస్‌ అయితే వెంటనే 2 చేయడానికి రెడీ. 
 
ఐటంసాంగ్స్‌ ఆఫర్లు వస్తున్నాయా?
అవంటే బోర్‌ కొట్టేసింది. చేసిన డాన్స్‌ మళ్ళీ చేయాలంటే బోరే. ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదు.
 
చిరంజీవి సినిమాలో నటిస్తున్నారని తెలిసింది?
ఆ సినిమా గురించి నేనేమీ మాట్లాడను.
 
ఆర్తీ అగర్వాల్‌ చనిపోయిన వార్త విన్నప్పుడు ఎలా అనిపించింది?
నేను ఓ ఇంటర్వ్యూకు వెళ్ళి వస్తుండగా వార్త విన్నాను. షాక్‌కు గురయ్యాను. అంతకుముందు రోజే నా స్నేహితురాలు యాక్సిడెంట్‌లో చనిపోయింది. ఇది వినేసారికి షాక్‌ అయ్యాను. ఆమె మరణం గురించి నిజమేమిటో తెలీదు. ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలింది. సురేష్‌ గెస్ట్‌హౌస్‌లో ఆమెకు ఓ రూమ్‌ వుండేది. ఆ తర్వాత అదే రూమ్‌లో నేనూ వున్నాను. చాలా సినిమాలు నాకు వచ్చాయి. 
 
నటికి సెక్యూరిటీ లేదా?
ఒక్క నటే కాదు. పెళ్ళాం, భర్తకూ వుండదు. ఏ పని చేసినా అందులో సెక్యూరిటీ వుండదు. అలా వుంటేనే ఎక్కువగా పనిచేస్తాం. నాకు నెక్ట్స్‌ సినిమా ఏది వస్తుందో, అసలు రాదేమోనని అదేపనిగా ఆలోచిస్తే ఏ పనీ చేయలేం. ఎక్కువగా ఆలోచిస్తే డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతాం. డిప్రెషన్‌ అనేది మన చుట్టూ వాతావరణాన్ని బట్టి వస్తుంది. దాన్ని జయించాలి. మనిషిగా ఇంతకంటే కష్టాలు ఏముంటాయి చెప్పండి.