మంగళవారం, 19 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Modified: సోమవారం, 9 జనవరి 2017 (20:44 IST)

రాజకీయంగా ఇప్పుడు నేను చేయగలిగింది ఏమీలేదు... అందుకే సినిమాలు చేస్తున్నా... చిరంజీవి ఇంటర్వ్యూ రెండో భాగం

కొడుకు నిర్మాత మీరు హీరో ఎలా అనిపిస్తుంది? చాలా గర్వంగా వుంది. తను 'ధృవ' షూటింగ్‌లో బిజీగా వున్నా ఈ సినిమాపై పూర్తి శ్రద్ధ పెట్టేవాడు. నటుడిగా సినిమాపరమైన హద్దులు తెలుసు. కమర్షియల్‌గా పద్దులు తెలీవు. అవన్నీ తను చూసుకునేవాడు.

కొడుకు నిర్మాత మీరు హీరో ఎలా అనిపిస్తుంది?
చాలా గర్వంగా వుంది. తను 'ధృవ' షూటింగ్‌లో బిజీగా వున్నా ఈ సినిమాపై పూర్తి శ్రద్ధ పెట్టేవాడు. నటుడిగా సినిమాపరమైన హద్దులు తెలుసు. కమర్షియల్‌గా పద్దులు తెలీవు. అవన్నీ తను చూసుకునేవాడు. 
 
అశ్వనీదత్‌, శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, దేవీశ్రీప్రసాద్‌, త్రివిక్రమ్‌ వంటి అగ్ర నిర్మాతలతో పనిచేశారు? చరణ్‌తో చేసినప్పుడు ఎలా అనిపించింది?
నిర్మాతగా వుండాల్సిన లక్షణాలన్నీ తనలో వున్నాయి. ఏదైనా సూచన చేస్తే ప్లస్‌లు, మైనస్‌లు నాకంటే చక్కగా క్లారిటీగా వుండేవాడు. నిర్మాతకు అది వుండాలి. అలాగే ఎక్కడ టాలెంట్‌ వుందో వెతికి పట్టుకుని ఆయా శాఖల్లో తను పెట్టాడు. నిర్మాతగా నటుడిగా తను సక్సెస్‌ అయ్యాడు.
 
మరి మీకు వారసునిగా ఎప్పుడు సక్సెస్‌ అవుతాడు?
(పెద్దగా నవ్వుతూ) నిర్మాతగా ప్రొడక్షన్‌పరంగా సమయం వచ్చింది చేశాడు. పిల్లలపరంగా మేము కావాలని కోరుకుంటాం. వ్యక్తం చేశాం. దానికి సమయం రావాలి. 
 
ఈ సినిమాలో మేనరిజం వుందా?
ఈ సినిమాకు పెట్టలేదు. రెండు పాత్రలు కాబట్టి బాడీ లాంగ్వేజ్‌ సెపరేట్‌గా తీసుకురాగలిగాం.
 
'ఠాగూర్‌'లో కార్పొరేట్‌ ఆసుపత్రులను చూపించారు. ఇందులో కార్పొరేట్‌ కంపెనీలు, రైతులు కాన్సెప్ట్‌ చూపిస్తున్నారు. ఇది పబ్లిక్‌కు ఎలా చేరువుతుందనుకుంటున్నారు?
రైతులకు వత్తాసు పలికేవారికి.. నిజమైన అర్బన్‌ వారికి.. అవును.. నిజమేకదా.. చెప్పేది అనిపిస్తుంది. వారిని ఆలోచించేలా చేస్తుంది. ఇదో పవర్‌ఫుల్‌ సినిమా అవుతుంది.
 
పొలిటికల్‌గా మీ సినిమా ఎంతవరకు వుపయోగం?
ఇది జరుగుతున్న వాస్తవాలకు తెరరూపమే. దేశం మొత్తంలో రైతుల సాధకబాధలు తెలియజెప్పే సినిమా అవుతుంది. కొన్ని సంస్థలు వేల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టి ఫారిన్‌ వెళ్ళి స్కాచ్‌ తాగుతుంటే.. రైతులు తీసుకున్న అప్పు కట్టలేకపోతే.. ఇక్కడ పురుగుమందులు తాగుతున్నారు. వారందరికీ భరోసా లాంటి సినిమా. చైతన్యవంతుల్ని చేసే సినిమా.
 
రాజకీయ నాయకుడిగా మీరేం న్యాయం చేయగలరు?
ఒక్కడివల్ల ఎలా అవుతుంది. అందరూ కలిసి రావాలి. అందరికంటే ముందుగా ప్రభుత్వం రియాక్ట్‌ కావాలి.
 
10 ఏళ్ళలో సినిమా మార్కెట్‌లో మార్పులు వచ్చాయి? ఎలా అనిపిస్తుంది?
అవును.. పదేళ్ళలో మొత్తంగా సినిమా కల్చర్‌, మేకింగ్‌తోపాటు సినిమా అర్థమే మారిపోయింది. అప్పుడు నేను చేస్తున్నప్పుడు ఫిలిం వుండేది. ఇప్పుడు డిజిటలైజేషన్‌గా మారింది. ఇక మార్కెట్‌పరంగా అన్ని విషయాలు చరణ్‌ చూసుకుంటాడు. నేను పెద్దగా పట్టించుకోను.
 
ఫంక్షన్‌లో వర్మ మాటలకు నాగబాబుగారు బాగా రియాక్ట్‌ అయ్యారు? అక్కడ కరెక్ట్‌ అంటారా?
తను బాధపడ్డాడు. దానికి రియాక్ట్‌ అయ్యాడు. అలాంటి మాటలు వింటే మేమూ హర్ట్‌ అవుతాం. నేను పెద్దగా పట్టించుకోను. కానీ  తనలాంటివాడుకాదు. రియాక్ట్‌ అయ్యాడు. ఒక్కోడు ఒకలా రియాక్ట్‌అవుతారు. అతని నేచర్‌ అంతే. తను మాట్లాడే సందర్భం.. తక్కువగా వస్తుంది కాబట్టి దాన్ని వేదికగా తీసుకున్నాడు. దానిమీద తర్జనభర్జనలు చేయలేను.
 
ఇలాంటి విషయంలో మీరే గట్టిగా చెబితే ఇలాంటి విమర్శలను ఆపవచ్చుగదా?
నేను ఎప్పుడూ పాజిటివ్‌గా వుండాలనుకుంటాను. విమర్శలు వస్తే పట్టించుకోను. పట్టించుకుంటే దాని విలువ పెరుగుతుంది. సాఫ్ట్‌గా వుంటాడని.. చిరంజీవిపై విమర్శలు చేస్తారా! అంటూ ఫ్యాన్స్‌ కూడా చాలా ఫీలయ్యారు. దానికి నాగబాబులాంటివారు చెప్పారు అది అంతే. ఏదైనా అనాలోచితంగా మాట్లాడటం కరెక్ట్‌కాదు. అది వారి విజ్ఞతకే  వదిలేస్తున్నా.
 
వర్మతో గొడవేమింటి?
ఆయన చాలా గొప్పవ్యక్తి.. మంచి స్నేహితుడిగా వుంటాం.. గొడవలు లేవు. ఆయనేకాదు. ఎవ్వరితోటి ఏ గొడవలు వుండవు.
 
సంక్రాంతికి బాలకృష్ణ, మీరు పోటీగా వస్తున్నారు. దీనిపై మీరెలా స్పందిస్తారు?
మా సినిమాపై నమ్మకంగా వున్నాం. షడ్రశోపేతమైన భోజనంలా ఆకట్టుకుంటుంది. వారిది వ్యత్యాసమైన కథ. ప్రయత్నం కూడా భిన్నంగా వుంది. నేనూ బాలకృష్ణ మంచి స్నేహితులం. ముహూర్తపు టైమ్‌లో స్విచ్చాన్‌కు వెళ్ళాను. ఇలాంటి కథ తీసుకోవడమే మొదటి సక్సెస్‌ అని చెప్పాను. మొన్న ఫంక్షన్‌లో కూడా అదే చెప్పాను. అందరి సినిమాలు ఆడాలి.
 
మీరూ చారిత్రాత్మక కథతో రాబోతున్నారా?
'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' కథ అలాంటిదే. దాని గురించి ప్లాన్‌ జరుగుతుంది. సురేందర్‌ రెడ్డి కూడా భిన్నమైన కథతో సిద్ధంగా వున్నారు. బోయపాటితో 152 సినిమాగా ప్లాన్‌ చేసుకుంటాం. అది గీతా ఆర్ట్స్‌లో చేస్తానేమో.. రాబోయే రోజుల్లో రెండు సినిమాలు చేయగలను. అవన్నీ మంచి కథలే.
 
రాజకీయంగా తప్పుకున్నట్లేనా?
రాజకీయంగా ఇప్పుడు చేయగలిగింది ఏమీలేదు. అందుకే ఈ ఖాళీలో సినిమాలపై ఫోకస్‌ చేయాలి.. ఈ గ్యాప్‌లో 'మీలో ఎవరు కోటీవ్వరుడు' కూడా చేస్తున్నాం. ఈ రెండింటితోనూ బిజీగా వుంటాను.
 
బ్లడ్‌ బ్యాంక్‌.. ఇతర చోట్ల పెట్టే ఆలోచన లేదా?
బ్లడ్‌ బ్యాంక్‌ అనేది యజ్ఞం లాంటిది. దాన్ని దగ్గరుండి చూసుకోకపోతే.. కొన్ని తప్పులు జరిగే అవకాశం వుంటుంది. అందుకే ఇతర చోట్ల పెట్టలేకపోతున్నాం.