శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Modified: సోమవారం, 9 జనవరి 2017 (21:10 IST)

'ఎగ్రిసివ్'గా వెళ్లడం పవన్ స్టయిల్... చిరంజీవి ఇంటర్వ్యూ ఆఖరి భాగం

మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెం.150 చిత్రం విడుదల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూ... మల్టీస్టారర్‌ చిత్రం చేస్తారా? ఫంక్షన్‌లో సుబ్బిరామిరెడ్డి అన్నారు. ఎంతవరకు కుదురుతుందో తెలీదు.

మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెం.150 చిత్రం విడుదల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూ...
 
మల్టీస్టారర్‌ చిత్రం చేస్తారా?
ఫంక్షన్‌లో సుబ్బిరామిరెడ్డి అన్నారు. ఎంతవరకు కుదురుతుందో తెలీదు. 
 
మీ నుంచి 'పీకె' లాంటి సినిమా ఆశించవచ్చా?
ఫస్ట్‌ సీన్‌ తప్ప.. అంతా చేస్తాను. అలాంటిది అమీర్‌ఖాన్‌ మాత్రమే చేయగలడు.. ఏదైనా ఒప్పించగలడు. అంత టాలెంట్‌ నాకుందని అనుకోవడంలేదు. 
 
సినిమాలో డాన్స్‌ బాగా చేశారని తెలిసింది. ఇంతకుముందు ప్రాక్టీస్‌ చేశారా?
లేదు. శ్రీజ సంగీత్‌కు కొన్ని సెకన్లు చేశాను.. ఆ తర్వాత చేయలేదు. మ్యూజిక్‌ వింటే డాన్స్‌ ఆటోమేటిక్‌గా చేయాలనిపిస్తుంది. కానీ చేయలేను. 'రేసుగుఱ్రం'లో శ్రుతిహాసన్‌లా లోలోపల చేస్తుంటాను.
 
ఇందులోనూ వీణ స్టెప్‌ వుందా?
సినిమా చూస్తే మీకే తెలుస్తుంది. వీణ స్టెప్‌ను లారెన్స్‌ రిపీట్‌ చేయించాడు.. చాలామంది చాలా చోట్ల చేసేశారు. బాగోదు అంటే.. మరోరకంగా చేస్తే బాగుంటుందని చేయించాడు.
 
బాలీవుడ్‌ తరహాలో స్టార్స్‌ సినిమాలు రావెందుకు?
'దంగల్‌' అక్కడ వచ్చింది. తెలుగులో వెంకటేష్‌తో 'గురు' రాబోతుంది. ఏదైనా రచయితలు కథ రాస్తే చేయడానికి ఎవరైనా సిద్ధమే.
 
శివునిపై మరలా చిత్రం వుంటుందా?
శ్రీమంజునాథ చేశాను. మరలా అలాంటి పాత్రలు వస్తే తప్పకుండా.. ఖైదీనెం. 150 చూశాక.. రచయితలకు దర్శకులకు ఏదైనా ఆలోచన వస్తే తప్పకుండా..
 
పవన్‌ కళ్యాణ్‌ పార్టీ పరంగా ఎగ్రెసివ్‌గా వెళుతున్నారు?
ఎగ్రెసివ్‌గా వెళ్ళడం ఆయన శైలి. 
 
రాజకీయ గేట్లు మూసేశారా?
ఏది ఏ సమయంలో పెర్‌ఫార్మ్‌ చేయాలో అలా చేస్తా. డోర్‌ క్లోజ్‌ కాలేదు.
 
తమిళ వెర్షన్‌లో ప్రభుత్వ కుంభకోణం ప్రస్తావించారు? తెలుగులో కూడా అలా చేశారా?
ఆ సినిమాలో తమిళనాడు రాజకీయాలు ప్రస్తావించారు. అలాంటివి లేకుండా.. కేవలం కార్పొరేట్‌ శక్తులికి, రైతులకు మధ్య కథే ఇది. ఎటువంటి రాజకీయ ప్రస్తావన లేదు. 
 
రాజకీయాలకు దూరంగా వున్నారా?
పరిస్థితులను బట్టి అందరం స్తబ్దతగానే వున్నాం. కాంగ్రెస్‌ పరిస్థితి స్తబ్దతగానే వుంది.
 
మీరు పార్టీ మారే అవకాశముందనే వార్తలు?
నేను సినిమా పార్టీ మారాను తప్ప.. రాజకీయ పార్టీ మారలేదు. రెండూ ప్రజలకు దగ్గరకు వెళ్లేవేగదా.
 
ఫంక్షన్‌లో మాట్లాడుతుండగా.. ఎవరో టైమ్‌ అవుతుందని చెవిలో చెప్పడంతో ఆపేశారు?
ఫ్యాన్స్‌ ఉధృతి ఎక్కువవుతుంది. జనాలు ఇంకా ముందుకు తోసుకువస్తున్నారు. వారిని కంట్రోల్‌ చేయడం మా వల్లకాదని పోలీసు వర్గాలు మూడుసార్లు వార్నింగ్‌లా ఇచ్చారు. అది పాజిటివ్‌గా.
 
విజయవాడలో ప్లేస్‌ ఇవ్వకపోవడంలో రాజకీయమేమైనా వుందా?
కోర్టు నిర్ణయం ప్రకారం క్రీడా ప్రాంగణాలు ఇటువంటి ఫంక్షన్లకు ఇవ్వకూడదని అధికారులు చెప్పారు. సి.ఎం.లాంటివారు అఫీషియల్‌ ఫంక్షన్‌ మినహా ఇవ్వకూడదన్నారు. ఇందులో ఎటువంటి రాజకీయ కోణం లేదు.
 
దాంతో సి.ఎం. అవ్వాలని ఆలోచన వచ్చిందా? గతంలో ఎన్‌టిఆర్‌కు ఇలానే జరిగింది?
నాకేం రాలేదు. 
 
అప్పటికీ ఇప్పటికీ సోషల్‌మీడియా పెరిగిపోయింది. ఫ్యాన్స్‌ ఒకరిపై ఒకరు అవమానించుకోవడం వంటి కొన్ని సంఘటనలు జరుగుతున్నారయి. వీటి నియంత్రణ లేదా?
సాంకేతికత పెరిగాక దాని అభివృద్ధికి ఆటంకం కల్గించలేం. మీడియా కూడా చిలువలు పలువలు అయ్యాయి. ఏదైనా హద్దులు దాటనంతవరకే బాగుంటుంది. ప్రతివారూ విచక్షణతో మెలగాలి. విషం కక్కేలా వుంటే సమర్థించలేం. ఒక్కోసారి కొన్ని హెడ్డింగ్‌ ఆశ్చర్యం కల్గిస్తాయి. లోపల మేటర్‌ ఏమీ వుండదు. ఇదంతా రేటింగ్‌ కోసం చేస్తుందే. ఇది ఆరోగ్యకరమైన వాతావరణం కాదు. ఎవరికివారు ఆలోచించుకోవాలి.
 
ఇండస్ట్రీలో ఆరోగ్యకర వాతావరణ వుందా?
నా వరకు వుంది. ఇటీవలే రామ్‌చరణ్‌, మహేష్‌ బాబు, గల్లా జయదేవ్‌ ఫ్యామిలీలతో కలిసి జ్యూరిక్‌ వెళ్ళి వచ్చారు. అఖిల్‌, ఎన్‌టిఆర్‌.. వచ్చి చరణ్‌ను కలుస్తుంటారు. నాతోటి హీరోలతో నేను ఎలా వున్నానో.. చరణ్‌ కూడా దాన్ని ఫాలో చేస్తున్నాడు. మంచి వాతావరణంలోనే మనం వున్నాం.
 
చరణ్‌ కెరీర్‌ ఎలా ఉందని భావిస్తున్నారు?
ది బెస్ట్‌.. చాలా ప్లాన్‌గా వెళుతున్నాడు. యథాలాపంగా లేడు. ఎంతవరకు బాగా ఆడిందనే కంటే.. మంచి ఫ్యామిలీ సినిమా చేయాలని ఏరికోరి 'గోవిందుడు అందరివాడే' చేశాడు. 'ధృవ'లో చిన్నపాటి ఎక్స్‌ప్రెషెన్స్‌ అద్భుతంగా పండించాడు.
 
ఇంట్లోనే హీరోల పోటీ వుందికదా?
ఇంట్లోవారందరూ సరదగా వస్తారు. మాట్లాడుకుంటారు. సినిమా పెద్ద ఇండస్ట్రీ.. ఎవరు ఎవరికి పోటీకాదు. ఒకరినొకరు కలుస్తుంటారు. నా కథ తను కొట్టేశాడని.. పోటీ లేదు. ఏదైనా అందమైన పోటీనే.. హెల్తీ పోటీనే.. 
 
వారందరినీ చూస్తే ఏమనిపిస్తుంది?
మనం ఏం సంపాదించామని వెనక్కు చూసుకుంటే ఇదే అని.. పిల్లల్ని చూస్తే అనిపిస్తుంది. వారంతా అన్యాపదేశంగా వచ్చేసారనుకోను.  ఏదైనా చేస్తే గట్టిగా చెప్పేస్తాను. ప్రతి ఒక్కరినీ నేను వాచ్‌డాగ్‌లా వారిని గమనిస్తున్నాననే భయం వుంటుంది.
 
ఇంకా సినిమాల్లో ఏదైనా చేయాలనే తపన వుందా?
ప్రజలు ఇంకా నన్ను కోరుకుంటున్నారనుకుంటే చేస్తాను. మరణించేవరకు నటుడిగా చేస్తానని అక్కినేని అన్నారు. నటుడుకి అలానే వుంటుంది.
 
ఈ ఏడాది మీ తరం హీరోలైన బాలకృష్ణ, వెంకటేష్‌, నాగార్జున చిత్రాలు రావడం ఎలా అనిపిస్తుంది?
ఇలా రావడం చాలా బాగుంది. గతం తరంతో హెల్దీ కాంపిటేషన్‌ కనబడుతుంది.
 
మీ ఫంక్షన్‌ అంటేనే పవన్‌పై చర్చ జరుగుతుంది? ఇంత ఫోకస్‌ ఎందుకు జరుగుతుంది? సురేఖ గారు పవన్‌ను ఒప్పించనున్నారని వార్తలు వచ్చాయి?
ఏమీ లేనిదాన్ని రాసేస్తున్నారు. మనం సమాధానం చెప్పాల్సిన పనిలేదు. మేం ఏం చేయాలనేది వారు డిసైడ్‌ చేసేస్తున్నారు. నేను వాటికి సమాధానం చెప్పను.. చరణ్‌ రమ్మని ఆహ్వానించాడు. వీలు చూసుకుని వస్తానన్నాడు.
 
మరి సప్తగిరి ఆడియోకు వచ్చారే?
లోకల్‌ కాబట్టి కుదిరింది వచ్చాడు. అన్ని ఫంక్షన్లకు రావాలనే రూలు లేదు. 
 
అమీర్‌ ఖాన్ మీతో చేస్తానన్నాడు?
అంతటి గొప్ప నటుడు అలా అనడం చాలా ఉత్సాహం కల్గించింది.
 
ఉమన్‌ ఓరియెంటెడ్‌ చిత్రాలు చేస్తారా?
కథ నచ్చితే తప్పకుండా చేస్తాను.