శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By ivr
Last Updated : శనివారం, 22 ఆగస్టు 2015 (14:12 IST)

150 చిత్రం తర్వాత... 151 ఇంకా, నేనూ పవన్ ఎక్కడ కలుసుకుంటామో చెప్పాల్సిన పనిలేదు... చిరంజీవి

సినిమాల్లో మాస్... నిజ జీవితంలో క్లాస్. ఇదే చిరంజీవి. చిరంజీవి వెండితెరపై కనిపించినంత రఫ్ కాదని రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తెలిసిందని చాలామంది జనం అనుకుంటుంటారు. నిజమే.. ఆయన సినిమాల్లో నటించినట్లు బయట నటించలేరు. ఆ విషయం ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. ప్రజలకు ఏదో చేయాలని రాజకీయాల్లోకి వచ్చానని చెప్పే చిరంజీవి ఆగస్టు 22... అంటే ఇవాళ తన పుట్టినరోజు వేడుకను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ ప్రైవేట్ టెలివిజన్ ఛానల్‌కు వెల్లడించిన కొన్ని సంగతులు...
 
150 చిత్రం తర్వాత ఇంకా సినిమాలు చేస్తారా...?
ఏమో... 150 చిత్రం తర్వాత ఇంకా 151, 152 అంటూ కొనసాగుతానేమో... కాలమే నిర్ణయిస్తుంది.

రామ్ చరణ్ చిత్రంలో కనబడుతున్నారు... హైప్ కోసమా...?
అలా అని అనుకోను. చరణ్ చిత్రంలో నేను కనిపిస్తే అభిమానులకు మరింత కిక్ ఇచ్చినట్లు ఉంటుందని శ్రీను వైట్ల కోరారు. అందువల్ల కనిపించుదామని అనుకుంటున్నా.
 
రాజకీయాల్లోకి వచ్చి తప్పు చేశానని ఎపుడైనా అనకున్నారా...?
అలా ఏమీ ఫీల్ కావడం లేదు. ఎందుకంటే సినిమాల్లో కేవలం తెర వెనుక ఉంటాను. కానీ రాజకీయాల్లోకి రావడం ద్వారా ప్రజలతో నేరుగా కలిసే అవకాశం, వారి కష్టనష్టాలను తీర్చేందుకు ఓ అవకాశం కలిగింది.

రాజకీయాల్లో మీకు ఇబ్బంది కల్గించే సంఘటన ఏదైనా...
సినిమాల్లో నాకు తెలిసినంత వరకూ విమర్శలు పెద్దగా ఎదురు కాలేదు. పైగా ఎంతో ఆనందంగానే ఉంటుంటాను. ఐతే రాజకీయాల్లో మనం చేయని పని చేసినట్లు చెపుతూ విమర్శలు చేస్తుంటారు. అలాంటప్పుడు కాస్త బాధగా ఉంటుంది. ఐతే ఆ తర్వాత అవన్నీ రాజకీయ విమర్శలే కనుక వాటిని పట్టించుకోకపోవడం అలవాటు చేసుకున్నాను.
 
పవన్ కళ్యాణ్ కు మీకు డిస్టెన్స్ ఉందనే కామెంట్ పైన...
మా ఇద్దరికీ ఎలాంటి డిస్టెన్స్ లేనే లేదు. కాకపోతే మీడియాలో అలాంటి వార్తలు వచ్చినప్పుడు నవ్వుకుంటూ ఉంటాము. రాజకీయంగా మా దారులు వేరు కావచ్చు కానీ కుటుంబంగా మేమంతా ఒక్కటే. పవన్, నేనూ, చరణ్, నాగబాబు... అలా అంతా కలిసే సందర్భాలు చాలా ఉంటాయి. ఐతే ఎలా కలుసుకుంటాము.... ఎప్పుడు కలుసుకుంటాము అనేది బయటకు చెప్పాల్సిన అవసరం లేదు కదా.

మీ జీవితంలో ఎన్నో విజయాలు సాధించినా సైలెంటుగా ఉంటారు...
అది నిజమే. నాకు పబ్లిసిటీ చేసుకోవడం అంతగా అలవాటు లేదు. ఏదైనా అలా చేసుకుంటూ పోతాను. ప్రజల్లోకి ఎప్పుడైనా వచ్చినప్పుడు దానంతట అదే బయటకు వస్తుంది.
 
60 ఏళ్లు అయినా ఇంకా యంగ్ లుక్ ఎలా సాధ్యం...?
నేను మానసికంగా సంతోషంగా ఉంటాను. బహుశా.. అదే నన్ను ఇలా కనిపించేట్లు చేస్తుందేమో.. అని చెప్పారు.