గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Modified: మంగళవారం, 27 సెప్టెంబరు 2016 (18:36 IST)

చిరంజీవి అడిగితే చేస్తా... నా జీవితం హ్యాపీగా ఏమీలేదు: ప్రభుదేవా ఇంటర్వ్యూ

దక్షిణాది నుంచి బాలీవుడ్‌కు వెళ్ళి.. దర్శకుడిగా సక్సెస్‌లు చూసిన ప్రముఖ కొరియోగ్రాఫర్‌.. ప్రభుదేవా జీవితంలో ఎంతో సాధించారు. ఇంకా సాధించాలనే తపన వుంది. అయితే వ్యక్తిగతంగా జీవితం పూర్తి హ్యాపీగా లేదనీ.. ప్రతి మనిషి వున్నట్లే సమస్యలూ తనకూ వున్నాయనీ... జ

దక్షిణాది నుంచి బాలీవుడ్‌కు వెళ్ళి.. దర్శకుడిగా సక్సెస్‌లు చూసిన ప్రముఖ కొరియోగ్రాఫర్‌.. ప్రభుదేవా జీవితంలో ఎంతో సాధించారు. ఇంకా సాధించాలనే తపన వుంది. అయితే వ్యక్తిగతంగా జీవితం పూర్తి హ్యాపీగా లేదనీ.. ప్రతి మనిషి వున్నట్లే సమస్యలూ తనకూ వున్నాయనీ... జీవితంలో పూర్తి హ్యాపీగా వున్నానని ఎవరైనా అంటే వారి దగ్గర శిష్యుడిగా చేరతానని అంటున్నాడు. వైవాహిక జీవితంలో ఒడిదుడుగులున్న ప్రభుదేవా భార్యకు విడాకులిచ్చి మరో వ్యక్తిని పెండ్లాడారు. 
 
అయితే.. పర్సనల్‌గా ఇంతకన్నా ఎక్కువ చెప్పలేనని అంటున్న ఆయన... మూడు భాషల్లో వస్తున్న 'అభినేత్రి'లో హీరోగా చేశారు. ఈ చిత్రానికి నిర్మాతగా కూడా ఆయనే.. మిల్కీ బ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో విజయ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం 'అభినేత్రి'. కోన ఫిలిం కార్పొరేషన్‌ సమర్పణలో ఎం.వి.వి. సినిమా పతాకంపై ఎం.వి.వి.సత్యనారాయణ బ్లూ సర్కిల్‌ కార్పొరేషన్‌, బి.ఎల్‌.ఎన్‌. సినిమాతో కలిసి ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్‌ 7న విడుదలవుతుంది. ఈ సందర్భంగా ఆయనతో చిట్‌చాట్‌.
 
చాలాకాలం తర్వాత తెలుగులోకి వచ్చారే?
తెలుగువారికి ఎప్పుడూ దగ్గరగా వున్నాను. నన్నే ఎవ్వరూ చేయమని పిలవడంలేదు. అందుకే బాలీవుడ్‌ వెళ్ళి సినిమాలు చేస్తున్నాను. 
 
నిర్మాతగా మారడానికి కారణం? 
ఈ సినిమాను వేరే హీరోతో చేద్దామనుకున్నాం. నా ప్రొడక్షన్‌ హౌస్‌లో చేయాలని దర్శకుడు విజయ్‌ నన్ను కలిసి వేరే హీరోను అనుకుని కథ చెప్పారు. అయితే ఆ హీరోతో సినిమా ఎందుకనో పట్టాలెక్కలేదు. అప్పుడు డైరెక్టర్‌ విజయ్‌ మీరే హీరోగా చేయండి సార్‌...అన్నాడు. అలాగే తమిళ నిర్మాత గణేష్‌గారు కూడా నన్నే హీరోగా చేయమని అన్నారు. కథ నాకు నచ్చడం, టైం కూడా ఉండటంతో నేను హీరోగా యాక్ట్‌ చేయడానికి అంగీకరించాను.
 
మూడు భాషల్లో నేటివిటీ మిస్‌కాదా? 
హీరో, హీరోయిన్‌ దక్షిణాది నుండి ముంబైకి వెళ్ళే ఓ కథను సినిమాగా తీశాం. దర్శకుడు, కెమెరామెన్‌ సహా అందరూ ఎక్స్‌పర్ట్స్‌ కావడంతో నేటివిటీ సమస్య లేకుండానే జాగ్రత్తలు తీసుకున్నారు. కాగా, ఈ జోనర్‌ తెలుగు ఆడియెన్స్‌కు కొత్త కాదు, కానీ నాకు మాత్రం కొత్తే అని చెప్పాలి. అంతేకాకుండా స్ట్రాంగ్‌ లేడీ ఓరియెంటెడ్‌ సబ్జెక్ట్‌. ఇలాంటి జోనర్‌ సినిమాను డైరెక్ట్‌ చేయాలనే కోరిక మనసులో ఉండేది. ఫుల్‌ కామెడితో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. అయితే చిన్న మెసేజ్‌ కూడా ఉంటుంది.
 
మీరు దర్శకుడు కదా.. సలహాలు ఇస్తుంటారా?
విజయ్‌, తమన్నా, మనీష్‌ సహా చాలామంది కొత్తవాళ్ళతో కలిసి చేశాను. సీన్‌ బాగా రాకపోతే మరోసారి చేయమని అడుగుతారంతే కదా... యంగ్‌స్టర్స్‌ దగ్గర మంచి పేరు సంపాదించుకుంటే చాలు అనే ఉద్దేశంతో చేశాను. కథ తెలిసినా ఆ పర్టిక్యులర్‌ రోజు ఏ సీన్‌ తీస్తారో కూడా నాకు తెలిసేది కాదు. యూనిట్‌ ఏం చెబితే అది చేసేసి వచ్చేసేవాడిని. ఎటువంటి సలహాలు ఇవ్వను.
 
తమన్నానే తీసుకోవడానికి కారణం?
తను మంచి డాన్సర్‌.. తనకు అసలైన సినిమా పడలేదు. ప్రతిదీ కమర్షియల్‌గా వచ్చే సినిమాలే. హీరో పక్కన నటించి.. కాసేపు ఎంటర్‌టైన్‌ చేయడమే.. అయితే.. ఇలాంటి కథకు డాన్సర్‌ కావాలి. ఆ స్టఫ్‌ వున్న నటి తమన్నా. తను క్లాసిక్‌ డాన్స్‌ బాగా చేయగలదు. ఈ చిత్రంతో ఆమె పేరు మరింత మారుమోగిపోతుంది.
 
తనకు డాన్స్‌ మెళకువుల నేర్పారా?
ఈ సినిమాకు నటుడినే.. డాన్స్‌ వైపు వెళ్ళలేదు. నేను చేసే సినిమాలకు వేరే డాన్స్‌ డైరెక్టర్‌లు వున్నా వారి జోలికి వెళ్లను. వారు చెప్పినట్లు చేయడమే.. తను అడిగినప్పుడు ఒకటి, రెండు స్టెప్‌లు చెప్పానంతే..
 
ఒక్కసారి మిమ్మలి విశ్లేషించుకుంటే ఎలా అనిపిస్తుంది?
నేను పెద్దగా చదువుకోలేదు. పధ్నాలుగేళ్ళకే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేశాను. 17 ఏళ్ళకే డాన్స్‌ డైరెక్టర్‌ అయ్యాను. పాతికేళ్ళకు పైగా సినిమా రంగంలోనే ఉన్నాను. నా వయసు నలబై రెండేళ్ళు. అయినా జీవితంలో ఏదో సాధించామనే సంతోషం, తృప్తిలేదు. అలా వుందని ఎవరైనా అంటే.. నేను వారిదగ్గర అసిస్టెంట్‌గా చేరతాను. వారికి శిష్యుడిగా మారిపోతాను. ప్రతి వ్యక్తికి సమస్యలున్నట్లే నాకూ వున్నాయి. పర్సనల్‌ లైఫ్‌ గురించి ఎక్కువగా చెప్పదలచుకోలేదు. 
 
మీరు పలు బాధ్యతలు చేపట్టారు.. ఏదంటే ఇష్టం?
జీవితంలో ఏదీ ప్లాన్‌ చేసుకోలేదు. అలా జరిగిపోతుంటాయి. ముందు కొరియోగ్రాఫర్‌గా ఉన్నప్పుడు, అప్పుడప్పుడు స్పెషల్‌ సాంగ్స్‌ చేస్తుండేవాడిని. ఒకరోజు పవిత్రన్‌ వచ్చి, నువ్వు బాగా చేస్తున్నావ్‌.. నిన్ను హీరోగా పెట్టి సినిమా చేస్తానన్నారు. నేను సరేనన్నాను. అలాగే 'వర్షం' సినిమాలో ఎన్నాళ్ళకు గుర్తొచ్చానో వాన.. సాంగ్‌ చేస్తున్నప్పుడు ఎం.ఎస్‌.రాజుగారు వచ్చి ప్రభు నువ్వు నా బ్యానర్‌లో నెక్ట్స్‌ మూవీని డైరెక్ట్‌ చేస్తావా అన్నారు. నేను సరేనన్నాను. అలాగే ఈ సినిమాకు కూడా గణేషన్‌ గారు వచ్చి సార్‌..మీ పేరుపై ఓ బ్యానర్‌ పెట్టి సినిమా చేస్తానని అన్నాడు. నేన సరేనన్నాను. అన్నీ అలా జరిగిపోయాయంతే.. నాకయితే.. డాన్సర్‌ అంటేనే ఇష్టం.
 
మీ పిల్లల్ని డాన్సర్లను చేస్తారా?
చేయను. ఎందుకంటే నా డాన్స్‌ అంటే వారికి నచ్చదు. నా తండ్రి డాన్సర్‌ కాబట్టి నేను అయ్యాను. కానీ నా పిల్లలు అలా అవ్వాలని లేదు. వారి ఆలోచనలు మారిపోతుంటాయి.
 
జీవితంలో అన్నీ సాధించారు. ఇంకా ఏమైనా గోల్స్‌ వున్నాయా?
నేను పెద్ద మేథావిగా ఉండాలి, అది సాధించాలి, ఇది సాధించాలి, గొప్ప ధనవంతుడిని అయిపోవాలి అనుకోవద్దు. అది ఒక స్టేజీ వచ్చే వరకే. కానీ రానురాను ఆలోచనలు మారిపోతుంటాయి. అందరి దగ్గర మంచి వ్యక్తి అనిపించుకుంటే చాలు అనే విషయాన్ని నేను తెలుసుకున్నాను. అదే విషయాన్ని నా పిల్లలకు చెబుతుంటాను. సాధారణ పిల్లలులానే నా పిల్లలు కూడా ఉంటారు. 
 
బాగా ఆనందపడిన రోజు?
నా తండ్రిగారితో అనుకోకుండా ఓ టీవీ షోలో పాల్గొన్నాను. షడెన్‌గా.. అక్కడ అమ్మ, నాన్నగారిని చూశాను. వారు నాన్నగారితో కలిసి డాన్స్‌ చేయమన్నారు. ఆ అవకాశం రావడం అదృష్టం, ఆనదంగా వుంటుంది.
 
ఇప్పటి డాన్స్‌ను చూస్తారా.? ఎవరంటే ఇష్టం?
నేను ఏదైనా సాంగ్‌లో డ్యాన్స్‌ బావుంటే సదరు కొరియోగ్రాఫర్‌కు ఫోన్‌ చేసి అభినందిస్తాను. ఒకప్పుడు డ్యాన్స్‌ మాస్టర్లంటే చెన్నై నుండే వచ్చేవారు. కానీ ఇప్పుడు ఇక్కడ కూడా మంచి కొరియోగ్రాఫర్స్‌ ఉన్నారు. అందరూ డ్యాన్స్‌ బాగా కంపోజ్‌ చేస్తున్నారు. ఒక్క పేరని చెప్పలేను.
 
చిరంజీవి నుంచి పిలుపు రాలేదా?
చిరంజీవిగారు నాకు ఎప్పుడూ ఫేవరేట్‌.  ఆయన 150వ సినిమాకు డాన్స్‌ చేయమని పిలవలేదు. వస్తే కనుక తప్పకుండా చేస్తా.
 
తదుపరి సినిమా
నా దర్శకత్వంలో తదుపరి చిత్రం బాలీవుడ్‌లో ఉంటుంది. ఆ సినిమా డిసెంబర్‌ నుండి ప్రారంభం అవుతుంది అని చెప్పారు.