మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Modified: సోమవారం, 11 మే 2015 (17:54 IST)

ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా ప్రొడ్యూస్ చేయాలనుంది - కమేడియన్ రఘు ఇంటర్వ్యూ

2002లో రిలీజ్ అయిన 'ఆది' సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి 2015 నాటికి 150 కి పైగా సినిమాలలో నటించిన కమెడియన్ కారుమంచి రఘు. మే 12న ఆయన పుట్టినరోజు సందర్భంగా తన సినీ ప్రయాణం గురించి విలేకర్లతో ముచ్చటించారు.
 
 
మీ బ్యాక్ గ్రౌండ్ గురించి..?
నేను పుట్టింది, పెరిగింది హైదరాబాద్‌లోనే. నాన్నగారు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. అమ్మ హౌస్ వైఫ్. నాకొక బ్రదర్ ఉన్నాడు. తను ఫాబ్రికేషన్ ఇండస్ట్రీ రన్ చేస్తున్నాడు. నేను ఎమ్.బి.ఎ కంప్లీట్ చేసి సాఫ్ట్వేర్ రంగంలో మంచి ఉద్యోగం చేసేవాడిని. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక ఉద్యోగం మానేయాల్సి వచ్చింది.
 
సినిమాలపై ప్యాషన్‌తో వచ్చారా..?
1995 నుండి దర్శకులు వి.వి.వినాయక్, సురేందర్ రెడ్డి నాకు మంచి స్నేహితులు. మాకు సినిమా డైరెక్ట్ చేసే ఛాన్స్ వస్తే నీకు అవకాశం ఇస్తాం రఘు అని చెప్పేవారు. కాని నాకు సినిమాలపై ఆసక్తి ఏమి ఉండేది కాదు. ఏ రోజు సినిమా షూటింగ్‌కు వెళ్ళలేదు. సినిమాలలోకి రావాలని అనుకోలేదు. వి.వి.వినాయక్‌కు ఆ సమయంలోనే 'ఆది' సినిమా చేసే చాన్స్ వచ్చింది. బేసిక్‌గా నాకు సీనియర్ ఎన్టీఆర్ అంటే చాలా అభిమానం. వారి మనవడు నటించే సినిమాలో అవకాశం రాగానే ఓకే చేసేసాను. అప్పటి నుండి నా సినీ ప్రయాణం మొదలయ్యింది. 
 
కమెడియన్‌గా చేయడానికి కారణం..?
అందరితో సరదాగా మాట్లాడతాను. విభిన్నమైన 'యాస'లలో మాట్లాడగలను. తెలంగాణా, శ్రీకాకుళం, రాయలసీమ ఇలా అన్ని యాసలలో కొంచెం పట్టు ఉంది. సో.. ఏ సినిమా చూసినా తను ఇలా మాట్లాడాడు అని కామెంట్ చేసేవాడిని. అందమైన అమ్మాయిలని చూసి అక్క అనేవాడిని. ఒక్కొక్కసారి వారికి కోపం వచ్చేసేది. ఇలా అందరిని టీజ్ చేసేవాడిని. నాలో ఓ కామెడీ యాంగిల్ ఉందని వి.వి.వినాయక్ గుర్తించి మొదటి సినిమాలో కమెడియన్‌గా చాన్స్ ఇచ్చారు. 
 
మీ లైఫ్‌లో టర్నింగ్ పాయింట్ ఏంటి..?
2002లో స్టార్ట్ అయిన నా జర్నీ 2010 వరకు 38 సినిమాలు చేసాను. 2010లో రిలీజ్ 'అదుర్స్' మూవీతో నాకు మంచి పేరు వచ్చింది. అదుర్స్ తరువాత సుమారుగా 120 సినిమాలలో నటించాను. ఒక్క 2014 లోనే పెద్ద హీరోలతో 25 సినిమాలు చేసాను. నా జీవితంలో బిగ్గెస్ట్ అచ్చీవ్మెంట్ అది. కానీ ఇప్పటివరకు పవన్ కళ్యాణ్, బాలకృష్ణలతో నటించే అవకాశం రాలేదు.
 
టివి షోలు కూడా బాగానే చేసినట్లున్నారు..?
2003లో చాలా టివి షోలు చేసాను. సుమారుగా 1800 ఎపిసోడ్స్ చేసాను. షార్ట్ ఫిల్మ్స్, మినీ మూవీస్, డైలీ సీరియల్స్ ఇలా అన్ని ప్రోగ్రామ్స్ చేసాను. టివి నాకొక స్కూల్ లాంటిది. చాలా నేర్చుకున్నాను. 'జబర్దస్త్' షోతో హోం ఆడియన్స్‌కు దగ్గరయ్యాను. ఆ షో లోనే 27 ఎపిసోడ్స్ చేసాను. 27 గెటప్స్ వేసాను. జబర్దస్త్‌తో సినిమాలలో మంచి చాన్స్‌లు వస్తాయనుకున్నాను. కాని నేను అనుకున్నట్లు జరుగలేదు. అందుకే ఆ షోలో కంటిన్యూ చేయలేకపోయాను. 
 
కమెడియన్‌గా చేయడం ఎలా అనిపిస్తుంది..?
తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్స్‌కి కాంపిటిషన్ ఎక్కువ. దాదాపు 120 మంది కమెడియన్స్ ఉన్నారు. ప్రేక్షకులను నవ్వించడం అనేది చాలా కష్టమైన జాబ్. ప్రతి సినిమా కోసం మేము ఫైట్ చేస్తూనే ఉంటాం. కాని కాంపిటిషన్ ఉంటేనే మనలో స్పీడ్ ఉంటుంది.
 
ఈ హీరోలతోనే చేయాలని ఏమైనా ఉందా..?
చిన్న, పెద్ద, కొత్త, పాత హీరోలు అనే ఏమీ ఉండదు. అందరు హీరోలతో చేయాలనుంది. ఎవరికివారికి వారివారి రేంజ్‌లో అభిమానులు ఉంటారు. అందరు హీరోలతో చేస్తేనే ఆడియన్స్‌కి రీచ్ అవుతాం. కానీ ఇప్పటివరకు పవన్ కళ్యాణ్, బాలకృష్ణ లతో నటించే అవకాశం రాలేదు. ఈ సంవత్సరం వాళ్ళతో ఖచ్చితంగా నటించే చాన్స్ వస్తుందని భావిస్తున్నాను. త్రివిక్రమ్, బోయపాటి శీను దర్శకులతో సినిమా చేయాలనుంది.
 
'కిక్2' సినిమాలో ఎలాంటి రోల్ చేస్తున్నారు..?
'కిక్2'లో ఓ ఎమోషనల్ పాత్రలో నటిస్తున్నాను. సురేందర్ రెడ్డి ఈ యాంగిల్‌లో నిన్నెప్పుడు చూడలేదు. అధ్బుతంగా నటించావు అని అప్రిసియేట్ ఇచ్చారు. ఈ సంవత్సరం పూరి జగన్నాథ్ చేసే ఓ సినిమాలో నెగటివ్ షేడ్‌లో కనిపించనున్నాను. దాని కోసం నా బరువు కూడా తగ్గించుకున్నాను.
 
నెక్స్ట్ ప్రాజెక్ట్స్..?
రిలీజ్ అవ్వడానికి 10 సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. అవి కాకుండా రామ్ చరణ్, గోపీచంద్, ఎన్టీఆర్, మహేష్ బాబు సినిమాలలో నటిస్తున్నాను. ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమాను ప్రొడ్యూస్ చేయాలనుంది. ఎప్పటికైనా ఆయనతో సినిమా చేస్తాననే నమ్మకం ఉంది అని ముగించారు.