మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Modified: శనివారం, 6 జూన్ 2015 (21:16 IST)

సాయిధరమ్ తేజ్‌తో మూడు తరాల కథతో ముందుకు: దిల్‌రాజు

దిల్‌రాజు చిత్రమంటే కుటుంబమంతా కలిసి చూసే చిత్రంగా వుంటుంది. బొమ్మరిల్లు, కొత్తబంగారు లోకం ఏదైనా కావచ్చు. అలాంటిది ఇప్పటి జనరేష్‌కు తగినట్లుగా కథ వస్తే చిత్రాన్ని తీసి ఖంగుతిన్నారు. ఆడ, మగ కలిసి ఫ్రెండ్స్‌గా వుండవచ్చని 'ఓ మైగాడ్‌' చిత్రాన్ని తీసి అది నిరాశపర్చిందని చెబుతున్నారు. ఇప్పుడు తాజాగా కేరింత అనే సినిమా తీశారు. ఈ నెల 12న విడుదలవుతుంది. ఈ సందర్బంగా దిల్‌ రాజుతో ఇంటర్వ్యూ...
 
కేరింతకు మూడేళ్ళు పట్టిందే?
మూడేళ్ళనాడు సాయికిరణ్‌ నాకు కథ చెప్పాడు. రెండు కోట్లలో సినిమా పూర్తి చేద్దామనుకున్నాం. కానీ మధ్యలో అనుకోకుండా 'ఓ మైగాడ్‌' తీయాల్సి వచ్చింది. ఆడ, మగ కలిసి వుండటం ఒక వర్గంకే నచ్చడంతో ప్రజలు అంగీకరించలేదు. ఇక 2014లో నిజామాబాద్‌లోని మా ఊరిలో ఓ గుడి కట్టించాం. నా కూతురి పెళ్లి కూడా జరుగడంతో సినిమా గ్యాప్‌ ఇచ్చాను. అప్పుడు అనుకున్న కేరింతను మాత్రం లైన్‌లో పెట్టాను. అందుకే మూడేళ్ళు పట్టింది.
 
కథలో మార్పు చేశారా?
అవును. కొద్దిగా మార్పులు చేశాం. ఓమైగాడ్‌ రిజల్ట్‌ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం. కాలేజీ బ్యాక్‌డ్రాప్‌ అంటే అందరికీ హ్యాపీడేస్‌ గుర్తుకువస్తాయి. మళ్లీ ఆడియన్స్‌ అలా ఫీల్‌ కాకుండా వుండేలా జాగ్రత్తలు తీసుకున్నాం. ప్రతి మనిషికి ఓ బ్యాచ్‌ వుంటుంది. అందులో సరైన వ్యక్తులు వుంటే ఎలా వుంటారనేది కథ.
 
సినిమా ప్రమోషన్‌ను కొత్తగా చేస్తున్నారని తెలిసింది?
అవును. సినిమాకు ప్రమోషనే ముఖ్యం. ఇక్కడ కంటే బాలీవుడ్‌లో బాగా చేస్తారు. ఒకరంగా ఆలోచిస్తే  వారికంటే మనం ఐదు ఏళ్ళు వెనకబడి వున్నాం. వారు ప్రమోషన్‌ చేసే విధానం చాలా కొత్తగా ఉంటుంది. ఈ సినిమాతో మేము కూడా ఆవిధంగా చేయాలని ప్లాన్‌ చేస్తున్నాం. ముందుగా అన్ని ప్రాంతాల కళాశాలలో ఓ ఈవెంట్‌ నిర్వహిస్తున్నాం. మా సినిమాలో ఉన్న  హీరోలు, హీరోయిన్లు డాన్సులు చేస్తారు. వారిలాగా ఎవరు చేస్తారో వారందరినీ సెలెక్ట్‌ చేసి జూన్‌ 12న స్పెషల్‌ ప్రీమియర్‌ షో వేయనున్నాం. ఆదివారం హైదరాబాద్‌‌లో, సోమవారం వైజాగ్‌‌లో, మంగళవారం విజయవాడ, గుంటూరు జిల్లాలలో, బుధవారం నెల్లూరు, తిరుపతిలలో ఈ కార్యక్రమం నిర్వహించడానికి ప్లాన్‌ చేశాం.
 
చిరంజీవి వారసునితో రెండో సినిమా చేస్తున్నారా?
సాయిధరమ్‌ తేజతో 'సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌ చేస్తున్నాం. ఆగస్టులో రిలీజ్‌. సెప్టెంబరులో సునీల్‌ సినిమా విడుదల కానున్నాయి. ఆ తరువాత కొత్తవాళ్ళతో 'శతమానంభవతి' అనే చిత్రాన్ని చేస్తున్నాను. అందులో హీరోగా సాయి ధరమ్‌ తేజ్‌ వుంటాడు. అయితే ఆ చిత్రం మూడు జనరేషన్స్‌కు సంబంధించి ఉంటుంది. అలాగే 'కేరింత'కు రచన సహకారం అందించిన వెంకీను డైరెక్టర్‌‌గా పరిచయం చేస్తూ మరో చిత్రాన్ని నిర్మించాలనుకుంటున్నాను.
 
అంటే మూడు తరాల్లో చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌ కూడా నటిస్తారా?
ప్రస్తుతం ఏం చెప్పలేను. త్వరలో వివరిస్తాను.