గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By IVR
Last Modified: సోమవారం, 21 జులై 2014 (22:38 IST)

కొత్త హీరోయిన్లు పొరిగింటి పుల్లకూర లాంటివారు... శ్రీప్రియ ఇంటర్వ్యూ

మురళీమోహన్‌, మోహన్‌బాబు, కృష్ణలతో హీరోయిన్‌గా నటించి ఒక వెలుగు వెలిగిన శ్రీప్రియ.. ప్రస్తుతం దర్శకురాలిగా మారారు. తన భర్త రాజ్‌కుమార్‌ పేరుతో ప్రొడక్షన్‌ హౌస్‌ను స్థాపించిన తమిళంలో సీరియల్స్‌ను నిర్మిస్తున్న ఆమె తొలిసారిగా సురేష్ ప్రొడక్షన్స్‌తో కలిసి 'దృశ్యం' చిత్రాన్ని నిర్మించారు. దానికి ఆమే దర్శకత్వం వహించారు. ఈ చిత్రం తెలుగులో ప్రజాదరణ పొందుతుంది. సోమవారంనాడు హైదరాబాద్‌ వచ్చారు. ఈ సందర్భంగా ఆమెతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు...
 
లేడీ దర్శకురాలిగా మీ అనుభవం ఎలా వుంది? 
నేను దర్శకురాలిగా 'మాలిని' అనే సినిమాను రెండు భాషల్లో దర్శకత్వం వహిస్తున్నాను. కానీ ముందుగా 'దృశ్యం విడుదలైంది. నా 42 సంవత్సరాల సినీ పరిశ్రమలో సురేష్‌ ప్రొడక్షన్‌ వంటి పద్ధతిగల నిర్మాణ సంస్థను చూడలేదు. ఇక్కడ ప్రతిభావంతులైన వారు ఎంతోమంది ఉన్నారు. నాకు అసిస్టెంట్‌ దర్శకులుగా ఆరుగురుని ఇచ్చారు. షూటింగ్‌కు సంబంధించిన అన్ని విషయాలను వారు చూసుకోవాలి. అసిస్టెంట్లు సరియైనవారు లేకపోతే దర్శకుడు కూడా ఏమీచేయలేడు.
 
తక్కువ సమయంలో తీయడానికి గల కారణం? 
ఆర్టిస్టుల సహకారమే. వెంకటేష్‌, మీనా, నదియా, నరేష్ వంటి ఆర్టిస్టులు ఇచ్చిన పూర్తి సహకారంతో చేయగలిగాను. కృతిక అనే అమ్మాయి రామానాయుడు ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌ నుంచి వచ్చింది. చిన్న అమ్మాయి మలయాళంలో పలు చిత్రాలు చేసింది. రవికాలే బాష రాకపోయినా అర్థం చేసుకుని అద్భుతంగా పండించారు.
 
వెంకటేష్‌‌ను తీసుకోవాలని ఎలా అనిపించింది? 
మలయాళంలో సినిమా చూశాక.. తెలుగు 'దృశ్యం' కథకు సరైన హీరో ఎవరా అని అనుకుంటుండగా నా స్నేహితులైన జయసుధ, జయప్రదలను అడిగాను. ఫ్యామిలీ రోల్స్‌ చేసే వెంకటేష్ సరిపోతాడని చెప్పారు. నిజంగా సినిమాలో ఆయన తండ్రిగా అమరాడు. సినిమా చూశాక నాకే కళ్ళ వెంట నీళ్ళు వచ్చాయి. ఒక ఆర్టిస్టుగా నేను చాలా ఫీలయ్యాను.  
 
రీమేక్‌ చేయడంలో మీ పాత్ర ఎంతమేరకు వుంది? 
దర్శకత్వంలో స్ట్రెయిట్‌ చిత్రానికి పనిచేయడం చాలా సులువు. కానీ ఒక భాషలో తీసిన చిత్రాన్ని రీమేక్‌ చేయడం చాలా కష్టం. ప్రతిదీ దానితో పోలుస్తారు. నేటివిటీ కానీ మరేదైనా కానీ బాగోకపోతే విమర్శిస్తారు. మోహన్‌లాల్‌ చేసినట్లే చేస్తే.. కాపీ అనేస్తారు. అందుకే చాలా జాగ్రత్తగా సినిమా తీయాలి. దాదాపు తమిళం, తెలుగు సంస్కృతి చాలా దగ్గరగా ఉంటుంది. మలయాళం కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లల్తో ఎలా ప్రవర్తించాలి. ఏదైనా సమస్య వస్తే పిల్లలు తల్లిదండ్రులతో ఎలా పంచుకోవాలనేది ఇందులో ప్రధాన అంశం.
 
తెలుగులో స్నేహితులు ఎంతమంది వున్నారు?
ఇక్కడ జయసుధ, జయప్రద, మురళీమోహన్‌, మోహన్‌బాబు, కృష్ణ వంటివారు ఎంతోమంది ఉన్నారు. కృష్ణగారితో కలిసి బెజవాడ బొబ్బిలి, దొంగల దోపిడీ, పట్నవాసం చిత్రాల్లో నటించాను. దర్శత్వంలో నా రోల్‌మోడల్‌ విజయనిర్మల. గిన్నిస్‌బుక్‌లో ఎక్కిన ఆమె నాకు స్పూర్తి. 
 
వారు ఈ సినిమాను చూశారా? 
ఈరోజే.. అంటే సోమవారం రాత్రి జయసుధ, జయప్రద చూస్తారు. మంగళశారంనాడు విజయ నిర్మల చూస్తానన్నారు.
 
హీరోయిన్లను కొత్తవారిని పెట్టడంలో మీరేమంటారు? 
ఈ సమస్య ఇప్పటిదికాదు. హీరోయిన్ల కొరత ఒక్క తెలుగులోనేకాదు. తమిళంలోనూ ఉంది. స్వంత భాషకు చెందిన నటీమణులు అక్కడా లేరు. తమిళంలో అంతా మలయాళ నటీమణులే ఉన్నారు. పొరిగింటి పుల్లకూర సామెతగా హీరోయిన్ల ట్రెండ్‌ నడుస్తోంది.
 
అప్పటికీ ఇప్పటికీ హీరోయిన్లలో మీరు చూసిన వ్యత్యాసం? 
పెద్దగా కనిపించలేదు. అప్పట్లో షూటింగ్‌ అంతా కలిసిమెలిసి కబుర్లు చెప్పుకుంటూ చేసే వాతావరణం ఉండేది. ఇప్పుడు తగ్గింది అనుకుంటున్నాను. హీరోయిన్‌ ఎక్కడి నుంచో వస్తుంది. ఆమెకు సెపరేట్‌ రూమ్‌ ఇస్తారు. కొన్ని మర్యాదలు కూడా ఎక్కువగానే చేస్తుంటారనిపిస్తుంది. డ్రెస్‌ల్లోనూ తేడా కన్పిస్తుంది.
 
నటిగా చేయాలనుకుంటున్నారా? 
ఒక్కసారిగా నవ్వుతూ.... నేను నటిగా చేస్తే.. ఇప్పుడు అల్లు అర్జున్‌ పక్కన చేయలేనుగా... ఒకప్పుడు చేసేశాను. మళ్ళీ చేయాలనిలేదు. ఏది ఎప్పుడు ఎలా జరగాలో అప్పుడు అలా జరుగుతుంది. ఇప్పుడు దర్శకత్వం చేయాలనే ఆలోచనే... 
 
మాలిని ఎంతవరకు వచ్చింది? 
నేను దర్శకత్వం వహించిన తొలి సినిమా 'మాలిని'. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. ఆర్టిస్టుల డేట్స్‌ వల్ల ఆలస్యమైంది. ఇంకా టాకీ, రెండు పాటలు తీయాలి. ఆగస్టు, సెప్టెంబర్‌లో సినిమా బయటపడుతుంది.
 
'దృశ్యం' కథపై కేసు నడుస్తోంది. దీనిపై మీ స్పందన? 
ఈ కథ ఒరిజినల్‌ మలయాళంలో జీతూసోసెప్‌ రచయితది. ఆయన రాసిన కథ. తను ఎక్కడ నుంచి తీసుకున్నాడో తెలీదు. జర్మనీ నవల ఆధారంగా అని అంటున్నారు. ఏది ఏమైనా కోర్టులో కేసు ఉంటే ఆ రచయితకు సంబంధించింది. వారు చూసుకుంటారు. నేను అనువాద హక్కులు మాత్రమే పొందాను. నాకూ దానికి ఎటువంటి సంబంధంలేదు అని ముగించారు.