శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By ivr
Last Modified: బుధవారం, 1 అక్టోబరు 2014 (20:54 IST)

ప్రత్యేక గీతాల్లో చూసి సిగ్గు పడకూడదు... హంసానందిని ఇంటర్వ్యూ

కథానాయికగా పెద్ద వంశీ చిత్రం 'అనుమానాస్పదం'తో హీరోయిన్‌గా చేసిన హంసానందిని... ఆ చిత్రం ఫెయిల్‌ కావడంతో పలు చిత్రాల్లో క్యారెక్టర్లు చేసింది. అయితే బాలీవుడ్‌లోనూ, తమిళంలోనూ సెకండ్‌ హీరోయిన్‌గా నటించిన ఆమె... మళ్ళీ తెలుగులో తన టాలెంట్‌ నిరూపించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. అధినాయకుడు సినిమాలో పోలీసు ఆఫీసర్‌గా చేసినా ఫలితం దక్కలేదు. కొంతకాలం గ్యాప్‌ తీసుకుని రాజమౌళి సినిమా 'ఈగ'లో నటించింది. ఆ చిత్రం తర్వాత ఆమెకు కవ్వించే పాత్రలే వచ్చాయి. లెజెండ్‌లో ఐటెంసాంగ్‌లో నటించింది. తాజాగా 'లౌక్యం'లోనూ ప్రత్యేక గీతంలో చేసింది. ఈ సందర్భంగా ఆమెతో చిట్‌చాట్‌.
 
మీరు నటించిన సినిమా హిట్‌ అనే టాక్‌ విన్నారా? 
అలా వింటున్నప్పుడల్లా చాలా హ్యాపీగా ఫీలవుతున్నాను. ఒకప్పుడు ఐరన్‌లెగ్‌గా అనిపించేది. వచ్చిన సినిమాలు ఆడేవి కావు. లౌక్యం సినిమాకు ముందు లెజెండ్‌లో చేశాను. అది గొప్ప హిట్‌ సినిమా.
 
'ఈగ' సినిమా తర్వాత అన్నీ అటువంటి పాత్రలే చేస్తున్నారు? 
ఈగ సినిమా చేసేటప్పుడు రాజమౌళిగారు.. మంచి పాత్ర ఇది. కన్పించిన 10 నిముషాలైనా.. కథంతా నీపైనే మలుపు తిరుగుతుంది అన్నారు. అటువంటి కథకు నేను ఎటువంటి పాత్ర వేసినా పర్వాలేదు అనిపించింది. అనుకున్నట్లే ఆ సినిమా పెద్ద హిట్టయి పేరువచ్చింది. 
 
'లౌక్యం' సినిమా థియేటర్లలో చూశారా? 
మా హోమ్‌ టౌన్‌ పూనెలో థియేటర్‌లో చూశాను. ఆ తర్వాత హైదరాబాద్‌లో చూశాను. ఈగ, లెజెండ్‌ కూడా అలాగే చూశాను. నేను వెళ్ళిన చోటల్లా అందరూ నన్ను గుర్తుపట్టి పలుకరిస్తున్నారు.
 
ఇక ఐటంసాంగ్‌లే చేస్తారా? 
ఇది ఐటంసాంగ్‌ కాదు. ప్రత్యేక గీతం. మొదట చెప్పినట్లే.. కథలో మలుపు తిరిగే పాత్రలే ఎంచుకుంటున్నాను. పాట చేయడానికి చాలా కష్టపడాలి. పగలు, రాత్రికూడా రిహార్సల్స్‌చేస్తూ.. మూవ్‌మెంట్స్‌ పలికించాలి. భాష ఏదైనా అర్థం చేసుకోవాలి. ఇందులో వల్గారిటీ ఎక్కువ చూపించకుండా జాగ్రత్తపడాలి.
 
కథానాయికగా నటించే పాత్రలు చేయరా? 
ప్రస్తుతం రుద్రమదేవి చిత్రంలో మంచి పాత్ర పోషిస్తున్నాను. మాదాని అనే రాణి పాత్ర చేశాను. ఇంతకంటే ఎక్కువ చెప్పకూడదు. ఈ చిత్రం విడుదల తర్వాత మంచి పేరు వస్తుందనే నమ్మకముంది.
 
ఎలాంటి పాత్రలు చేయాలనుంది? 
తెలుగు సినిమా అనేది హీరో బేస్డ్‌ పరిశ్రమ. ఇక్కడ సరైన స్థాయిలో పాత్రలో రావాలంటే కష్టమే. లేడీ ఓరియెంటెడ్‌ పాత్రలు చేయాలంటే చాలా ఇష్టం.
 
'రుద్రమదేవి'లో కత్తియుద్ధాలు చేసినట్లున్నారు? 
నేను కరాటేలో బ్లాక్‌బెల్ట్‌.. ఫైట్స్‌ చేయడం ఈజీగా అనిపించేది. అయితే.. కత్తి, గుర్రపుస్వారీ అనేవి కొత్తగా నేర్చుకున్నాను. దర్శకుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈ సినిమా అందరికీ మంచి పేరు తెస్తుంది.
 
బ్రహ్మానందంతో నటించడం ఎలా అనిపించింది? 
చాలా ఫన్నీగా వుంటారు. చాలా స్పాంటేనియస్‌గా స్పందిస్తారు. ఆయన్నుంచి నేను చాలా నేర్చుకున్నాను.
 
పెండ్లి చేసుకుంటున్నారనే వార్తలు విన్పిస్తున్నాయి? 
ఇంకా ఏమీ అనుకోలేదు. నాకు నచ్చిన వ్యక్తి ఇంకా దొరకలేదు. సినిమాల్లోలా అంత ఈజీగా లైఫ్‌లో చూసి చేసుకోలేం. నన్ను అర్థం చేసుకున్నవాడితోనే పెద్దల ఒప్పందంతోనే చేసుకుంటాను.
 
మీ హాబీస్‌? 
రోజూ వ్యాయామం చేస్తూనే వుంటాను. స్విమ్మింగ్‌ తప్పనిసరి. సంగీతమంటే చాలా ఇష్టం అని ముగించింది హంసానందిని.