శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Modified: మంగళవారం, 22 సెప్టెంబరు 2015 (18:33 IST)

పవన్ కళ్యాణ్ నన్ను అవి అడగలేదు... వేరే అడిగారు... హరీష్‌ శంకర్‌ ఇంటర్వ్యూ

హరీష్‌ శంకర్‌... నటుడిగా కెరీర్‌ను ప్రారంభించి... వర్మ స్కూల్‌లో జాయినయి... తర్వాత దర్శకుడయిన ఆయన పలు చిత్రాలకు దర్శకత్వం వహించాడు. రవితేజతో తీసిన 'షాక్‌' తన కెరీర్‌కు నిజంగానే షాక్‌ ఇచ్చిందనీ, చాలాకాలం ఖాళీగా కూర్చునేలా చేసిందని చెబుతున్న ఆయన తర్వాత రవితేజతో 'మిరపకాయ్‌' చిత్రాన్ని చేశాడు. పవన్‌తో గబ్బర్‌సింగ్‌ చేసి సక్సెస్‌ సాధించాడు. అయితే ఆ చిత్రం విజయంతో 'హరీష్‌కు తలపొగరు ఎక్కిందని' కామెంట్లు ఇండస్ట్రీలో విన్పించాయి. 
 
ఆ తర్వాత ఎన్‌టిఆర్‌తో చేసిన 'రామయ్య వస్తావయ్య'తో బ్యాలెన్స్‌ చేసింది. ఆ చిత్రం ప్లాప్‌ కావడంతో తన కెరీర్‌ చాలా ఇబ్బందుల్లో పడిందని అంటున్న ఆయన పవన్‌ మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌తో 'సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌'కు దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం ఈ నెల 24న విడుదలవుతుంది. ఈ సందర్భంగా ఆయనతో జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ..
 
దిల్‌ రాజుకు ప్లాప్‌ ఇచ్చాక.. ఆయన మీతో సినిమా చేయడానికి కారణమేమిటి?
ఎన్‌టిఆర్‌తో చేసిన 'రామయ్య వస్తావయ్య' దర్శకుడిగా ఫెయిల్యూర్‌ ఇచ్చింది. అయితే నిర్మాతగా దిల్‌రాజుకు మంచి లాభాలు ఇచ్చింది. కానీ డిస్ట్రిబ్యూటర్లకే నష్టాలను మిగిల్చించింది. ఎన్‌టిఆర్‌ను సరిగ్గా ఉపయోగించుకోలేకపోయామనే అనిపించింది. ఆ చిత్రం ప్లాప్‌ తర్వాత నాకు మళ్ళీ దిల్‌రాజు నాపై నమ్మకంతో ఈ సినిమా ఇచ్చారు. అనుకున్నట్లు బాగా వచ్చింది.
 
'గబ్బర్‌ సింగ్‌' సినిమాతో మీకు పొగరు అనే కామెంట్లు విన్పించాయి?
నేనూ విన్నాను. పవన్‌ కళ్యాణ్‌ అంతటి హీరోతో చేయడమే పొగరని ఆ తర్వాత కొంతమందికి సమాధానం ఇచ్చాను. నేను హైపర్‌గా వుంటాను. దానివల్ల కూడా అలా కామెంట్‌ చేసి వుండవచ్చు.
 
ఆ సక్సెస్‌ను మీరు సరిగ్గా వుపయోగించుకోలేకపోయారని అనుకోవచ్చా?
ఆ సక్సెస్‌ పవన్‌ వల్లే వచ్చింది. పవన్‌తో సినిమా చేయాలని.. 'మిరపకాయ్‌' కథను చెప్పాను. కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. రవితేజతో చేయాల్సివచ్చింది. వేరే కథను అనుకుంటుండగా... దబాంగ్‌ సినిమా త్రెడ్‌ నచ్చి ఓకే అన్నారు. అయితే అందులో అంత్యాక్షరి వంటి కొన్ని సీన్స్‌ లేవు. కొత్తగా క్రియేట్‌ చేసినవే.. దానికి మంచి అప్లాజ్‌ వచ్చింది. ఆ చిత్రం ఇచ్చిన సక్సెస్‌తో హ్యాంగోవర్‌ అయ్యానని అందరూ అనుకున్నారు. కానీ ఎందుకనో దాన్ని సరిగ్గా వుపయోగించుకోలేకపోయాను.
 
ఇప్పుడు సాయిధరమ్‌ తేజ్‌తో చేయడానికి కారణం?
'సుబ్రమణ్యం ఫర్‌సేల్‌' కథను ముందుగా ప్రముఖ హీరోలకు చెప్పాను. కానీ నాకు ముందున్న ప్లాప్‌ల వల్ల ఎవ్వరూ సరిగ్గా రెస్పాన్డ్‌ కాలేదు. అప్పటికే 'రేయ్‌' సినిమాలో సాయిని చూశాక తనతో ఒక సినిమా చేయాలనుకున్నాను. అప్పుడు ఈ కథ చెబితే వెంటనే ఓకే అన్నారు. 
 
ఎలాంటి కథ ఇది?
ఇదొక మంచి ఎంటర్టైనింగ్‌ మూవీ. హీరో క్యారెక్టరైజేషన్‌ కొత్తగా ఉంటుంది. సినిమాలో ఊహించని ట్విస్టులు ఉంటాయి. క్లైమాక్స్‌ సీన్స్‌‌లో హీరో ఫైట్‌ చేయడు. ఎమోషనల్‌ సన్నివేశంతో సినిమా ఎండ్‌ అవుతుంది. నేను ఏ సినిమాకు ఇప్పటివరకు గ్లిజరిన్‌ వాడలేదు. ఈ సినిమా కోసం చాలా ఎక్కువగా ఉపయోగించాను. అన్ని ఎమోషనల్‌ సీన్స్‌ ఉంటాయి. కథ పాతదే అయిన స్క్రీన్‌ ప్లే మాత్రం కొత్తగా ఉంటుంది.  
 
అమెరికాలోనే షూట్‌ చేయడానికి కారణం?
కథరీత్యా అక్కడే చేయాలి. బాలీవుడ్‌లో ఎన్‌ఆర్‌ఐ బేస్డ్‌ కథలు చాలా వస్తుంటాయి. మన దగ్గర తక్కువ. అయితే ఇందులో పాయింట్‌ చాలా థ్రిల్‌గా వుంటుంది. కొత్తదనం కోసం అక్కడ చేశాం. ఈ సినిమాకు ప్రొడ్యూసర్‌ దిల్‌ రాజు గారు కాకపోతే షూటింగ్‌ అమెరికాలో చేసేవాళ్ళం కాదు. 
 
టీజర్‌లో 'సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌' అంటూ హీరో అంటాడు. అసలు కథేంటి?
చిన్నప్పటినుంచి ఆషాడం సేల్‌, అక్షయతృతీయ సేల్‌ అని వుండేవి కావు. కానీ రానురాను అలాంటి ఆఫర్లు పెరిగిపోయాయి. రకరకాల సేల్స్‌ పెడుతున్నారు. ఆ బేస్‌తో కథను రాసుకున్నాను. సినిమాలో మా హీరో అమెరికాలో ఒక్కడే ఉంటాడు. మా సినిమాను మేమే మార్కెటింగ్‌ చేసుకోవాలి కదా అందుకే ఆ టైటిల్‌ పెట్టాను. మిరపకాయ్‌ సినిమా టైంలోనే ఆ టైటిల్‌ అనుకున్నాను.
 
రెజీనా ఎంపిక హీరోదా? మీదా?
మొదట ఈ సినిమాకు హీరోయిన్‌‌గా రెజీనా అనుకోలేదు. అప్పటికే రెజీనా, తేజ్‌ కలిసి పిల్లా నువ్వులేని జీవితం సినిమా చేసారు. అందుకే కొత్త అమ్మాయిని పెట్టాలనుకున్నాను. పవర్‌ సినిమాలో రేజీనా పెర్ఫార్మన్స్‌ నాకు చాలా నచ్చింది. సాధారణంగా నా సినిమా హీరో మీద ఓపెన్‌ అయ్యి హీరో మీదే కట్‌ అవుతుంది. కాని ఈ సినిమా అంతా హీరోయిన్‌ మీద నడుస్తుంటుంది. తన లైఫ్‌‌లోకి హీరో వస్తాడు. సీత పాత్రలో రెజీనా సెట్‌ అవుతుందనిపించింది. పిల్లా నువ్వులేని జీవితం తరువాత రేయ్‌ సినిమా రిలీజ్‌ అయింది. ఓ సినిమా గ్యాప్‌ ఉందని రెజీనానే సెలెక్ట్‌ చేసుకున్నాను. తను డైలాగ్స్‌ మాత్రమే కాకుండా సెట్స్‌‌లో కూడా తెలుగు మాట్లాడుతుంది. ఈ సినిమాలో హీరోతో పాటు సమానంగా నటించింది. 
 
ప్రయోగాత్మక చిత్రాలు చేసే ఆలోచన వుందా?
నేను 'షాక్‌' తర్వాత కోలుకోలేని దెబ్బ తిన్నాను. దాంతో ప్రయోగాత్మక చిత్రాలు చేయకూడదనే అనుకున్నాను. ప్రేక్షకులకు అర్థమయ్యే కథ చెప్పాలనుకుంటాను. ఇప్పటివరకు ప్రయోగాత్మక చిత్రాలు చేయలేదు. షాక్‌ సినిమానే నాకు పెద్ద షాక్‌ ఇచ్చింది. నాలుగు సంవత్సరాలు నన్ను ఇంట్లో కూర్చోబెట్టింది. 
 
గబ్బర్‌ సింగ్‌ సీక్వెల్‌ చేయలేకపోతున్నాననే బాధ వుందా?
గబ్బర్‌ సింగ్‌ సినిమా రిలీజ్‌ అయిన మూడు రోజులకు పవన్‌ గారిని కలిసాను. ఆయన సినిమా టాక్‌ ఏంటి..? కలెక్షన్స్‌ ఎలా ఉన్నాయని అడగకుండా ఏం పుస్తకాలు చదివావు. నెక్స్ట్‌ ఏం చేయబోతున్నావనే అడిగారు. ఆయనతో జర్నీ చాలా ఎంజాయ్‌ చేసాను. గబ్బర్‌ సింగ్‌ సినిమాతో నాకు చాలా ఎక్స్పోజర్‌ వచ్చింది. కానీ.. సీక్వెల్‌ చేయమని అడగలేదు. నేను చెప్పలేదు. అయినా.. ఆయనతో మరో సినిమా చేయడానికి కథను రెడీ చేసుకుంటున్నాను. ఆయన నాకు అవకాశాన్ని ఇచ్చారు. ఇక సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ దర్శకుడు బాబీ నాకు మంచి మిత్రుడు. మంచి విజయాన్ని ఇస్తాడనే నమ్మకముంది.
 
'సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌'కు ఇన్‌స్పిరేషన్‌ ఏమిటి?
నన్ను చాలా సినిమాలు, ఇన్సిడెంట్స్‌, క్యారెక్టర్స్‌ ఇన్స్పైర్‌ చేస్తాయి. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కటి ఇన్స్పిరేషన్‌‌గా తీసుకుంటాను. ఈ సినిమా కూడా అలానే చేసాను. మంచి పాటలు, మంచి సంభాషణలు, ఎమోషనల్‌ క్లైమాక్స్‌ ఉంటాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌‌లో వచ్చే డైలాగ్స్‌ ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి.
 
కొత్త చిత్రాలు?
పవన్‌ కళ్యాన్‌ గారికి స్క్రిప్ట్‌ రాస్తున్నాను. రవితేజతో మరో సినిమా.. అలాగే ఎన్‌టిఆర్‌కు మంచి కథ చెప్పాలనుకుంటున్నాను అని తెలిపారు.