గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By dv
Last Updated : మంగళవారం, 30 ఆగస్టు 2016 (17:47 IST)

రేపు నేను నిద్రలేస్తాను అనే నమ్మకం వుండాలి.. జనతా గ్యారేజ్ హీరో ఎన్టీఆర్ ఇంటర్వ్యూ

ఈ కథ ఇప్పటిదికాదు. రెండేళ్ళనాడే కొరటాల శివ చెప్పారు. అప్పుడు 'రభస' షూటింగ్‌లో ఉన్నాను. తర్వాత 'నాన్నకు ప్రేమతో' చేశాను. ఎందుకనో కొన్ని కథలు, మాటలు, సందర్భాలు, సన్నివేశాలు విన్నప్పుడు.. అవి మనకు తెలీకు

* గెడ్డం పెంచడంలో కథేమైనా ఉందా? 
అదేంలేదు. బాగుందని పెంచుతున్నా. 
 
* విడుదలముందుండే టెన్షన్‌ ఉందా? 
అదేమిటో అర్థంకావడంలేదు. టెన్షనో, భయమో, బాధ్యతో తెలియదుకానీ.. కొంచెం ఉంటుంది. 
 
* ప్రతి సినిమాకు ఇంతేనా? 
ఉంటుంది. ఎందుకు వుండకూడదు. ఆరేడునెలలపాటు సినిమాకు పనిచేసిన తర్వాత సహజంగా వుంటుంది. ఫలితాలను పక్కన బెడితే.. బాగుంటుందా? లేదా? అనేది చిన్న టెన్షన్‌. హిట్‌ అయితే ఆనందం.. పోతే బాధపడటం అని చెప్పను కానీ. ఇదివరకు ఏదైనా ఎక్కువ రోజులు వుండేది. ఇప్పుడు తగ్గింది. 
 
* ఈ సినిమాతో మీ గమ్యానికి చేరారనుకోవచ్చా? 
ఈ కథ ఇప్పటిదికాదు. రెండేళ్ళనాడే కొరటాల శివ చెప్పారు. అప్పుడు 'రభస' షూటింగ్‌లో ఉన్నాను. తర్వాత 'నాన్నకు ప్రేమతో' చేశాను. ఎందుకనో కొన్ని కథలు, మాటలు, సందర్భాలు, సన్నివేశాలు విన్నప్పుడు.. అవి మనకు తెలీకుండానే వెంటాడుతుంటాయి. తరచూ గుర్తుకువస్తుంటాయి. బహుశా ఆ కథలోని బలం వల్లనేమో.. నాకు తెలీకుండానే దానివైపు ప్రయాణించాను. అలాంటి కథల్లో టెంపర్‌, నాన్నకు ప్రేమతో.. ఇప్పుడు జనతా గ్యారేజ్‌. ఇలా ఈ కథల్లో నాకు నేను మార్చుకుంటున్నట్లుగా అనిపిస్తుంది. 
 
* సినిమా పోస్టర్‌లో నెర్వస్‌గా ఉండటానికి కారణం? 
పాత్ర ప్రకారమే అలా ఉంటుంది. ఎక్కడో కథను ఒక్కోసారి ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌ డామినేట్‌ చేస్తారు. మరోసారి ఒక ఒక చోట ఆగిపోతుంది. దాన్ని కొనసాగించాలంటే కొందరు పూనుకోవాలి. పాత్రపరంగా ఇలాగే ఉంటే బాగుంటుందని.. కథలో ఇన్‌వాల్‌ అయిచేశాను. అసలు ఇందులో ఏ పాత్ర ఎవరినీ డామినేట్‌ చేయదు. ఇలాంటి పాత్రలు అరుదుగా వస్తుంటాయి. 
 
* టైటిల్‌ చెప్పినప్పుడు ఎలా అనిపించింది? 
దర్శకుడు కథ చెప్పినప్పుడే టైటిల్‌ ఫిక్స్‌ చేసేశారు. ఓ కీలకపాత్ర ఉంది. దాన్ని ఎవరు చేస్తున్నారంటే.. మోహన్‌లాల్‌ అన్నారు. ఆయన చేస్తారా! అని అడిగాను. మొత్తానికి ఆయన నచ్చి చేశారు. జనతాగ్యారేజ్‌ అనేది కథ ప్రకారం పెట్టిన టైటిల్‌. కొన్నిసార్లు నా సినిమా పేర్లు వేరుగా ఉంటాయి. ఇది మాత్రం పూర్తి కథకు తగినట్లే టైటిల్‌. 
 
* రెండు భాషల్లో తీశారా? 
లేదు. మలయాళంలో కేవలం డబ్బింగ్‌ మాత్రమే. 
 
* మోహన్‌లాల్‌ కాంబినేషన్‌ వచ్చినప్పుడు బాగా చేయాలని చేశారా? 
బాగా చేయాలని చేయలేదు. ఎవరు చేసినా పోటీతత్వంలేదు. నా పాత్ర పరంగా చాలా హ్యాపీ. ఆయన పాత్ర పరంగా చాలా హ్యాపీ.. ఆయనతో నటించిన రోజుల్ని మర్చిపోలేను. గొప్పనటుడేకాదు. గొప్ప జ్ఞానవేత్త కూడా. ప్రతి సబ్జెక్ట్‌ను టచ్‌ చేసేవారు. ఆయన నటుడేకాదు. టెక్నీషియన్‌, నిర్మాత కూడా. ఇన్ని బాధ్యతలు ఎలా చేయగలిగారు? అని నేను అడిగితే.. అంతా పాజిటివ్‌గా ఉండటమే అనేవారు. ఇక ఈ సినిమాలో ఎవరు నటించినా వారి వారి పాత్రలకు న్యాయం జరిగింది. ఒకరు ఎక్కువ, తక్కువ అనే తేడాలేదు. 
 
* షాట్‌లో దర్శకుడు చెప్పిన సీన్‌ పండించడానికి ఎంత టైమ్‌ పడుతుంది? 
నటన అనేది ఫీల్‌ అవ్వాలి. హృదయంలోంచి రావాలి. ముఖంలో కనిపించాలి. టీచింగ్‌ చేసి చేయడం కంటే ప్రాక్టికల్‌గా ఉండాలి. నటుడి అనేవాడికి ఫీలింగ్స్‌ అన్నీ వాటికవే వచ్చేస్తుంటాయి. ఉదాహరణకు.. తల్లి, తండ్రి, ఫ్రెండ్‌ చనిపోయినప్పుడు.. ఆ సీన్‌ను ఫీలై చేయాలి. ఊహించుకోవాలి. అంతేకానీ ఎవరో చెబితే వస్తుంది అనుకోవడం కరెక్ట్‌కాదు. అలాగే టీచింగ్‌ యాక్టింగ్‌ అనేది జస్టిఫై చేయలేను. 
 
* మీకు పుట్టుకతోనే వచ్చింది కదా? 
అలా అని నేను చెప్పను. ఎవరైనా ఏదైనా ఫీల్డుకు రావాలనుకుని రాలేరు. ఏ వృత్తిలోనైనా.. పరిస్థితులనుగుణంగా అలా ప్రవేశిస్తుంటాం. 
 
* వారసత్వం గురించి మీ అభిప్రాయం? 
నేను నమ్మను. ప్రకృతిలో ప్రతీదీ మార్పు సహజం. అలానే ప్రతివారికి అవకాశాలు రావాలి. 
 
* స్టార్‌ హీరోలంటున్నారు కదా. దానిపై మీ విశ్లేషణ? 
స్టార్‌ హీరోస్‌ అనేది నమ్మను. మనం ఏదో పతకం సాధించినట్లు స్టార్‌ ఇవ్వడం కరెక్ట్‌కాదు. నాకు నేను నటుడిగానే ఫీలవుతాను. మనకంటే గొప్పనటులు అవకాశాలు లేక చేయకపోవచ్చు. ఆర్టిస్టుగా ఒకటి చెప్పగలను. నేను చేసినందువల్ల పాత్ర చెడిపోకూడదు. నేను చేయడంవల్లే బాగుందనే స్వార్థం కోరుకుంటా. 
 
* లవ్‌స్టోరీస్‌ చేసే ఆలోచన వుందా? 
చేద్దామనుకున్నా.. వయస్సు పెరిగిపోయింది. పెళ్ళయి బిడ్డకు తండ్రిగా వున్న స్టేజ్‌లో ప్రేమకథలు చేయడం నాకే సిగ్గు, భయంగా వుంటుంది. 
 
* బాలీవుడ్‌లో అమీర్‌ఖాన్‌ లాంటి వారు చేస్తున్నారుకదా? 
యస్‌.. కరెక్ట్‌.. అయితే ఇప్పుడిప్పుడే ప్రపంచం మారుతుంది. అందులో తెలుగు సినిమా కూడా నిదానంగా అభివృద్ధి చెందుతుంది. ఇటీవలే 'మనమంతా', 'పెళ్లిచూపులు' వంటి కథల్తో కొత్తపుంతలు తొక్కుతుంది. 
 
* అంటే ప్రేక్షకులు మారారా? దర్శకులు మారారా? 
ప్రేక్షకులే మారారు. దర్శకుడు, హీరో నచ్చి చేసిన సినిమాను ప్రేక్షకులు తిరస్కరిస్తే.. ఎవరు మారినట్లు! ప్రేక్షకులే కదా.. మేం చేసిన కొన్ని చిత్రాలు వద్దని చెంపదెబ్బకొట్టినట్లు తీర్పు ఇచ్చారు. అంటే వారు మారారనేకదా.. ఏదైనా కథ, కథనం బాగుంటేనే సినిమా ఆడుతుంది. చిన్న సినిమా అయినా పెళ్లిచూపులు రూ.కోటి పెట్టి తీశారు. రూ.15 కోట్లు వసూలు చేస్తుంది. ప్రేక్షకులు బడ్జెట్‌ గురించి కూడా ఆలోచించలేదు కదా. 
 
* జనతాగ్యారేజ్‌లో నచ్చిన అంశాలేమిటి? 
ఒక్కటని చెప్పలేం. అసలు ఈ సినిమా చక్కటి కుటుంబకథాచిత్రం. కుటుంబంలో వుండే కలహాలు, కలతలు వుంటాయి. ప్రతి కుటుంబానికి ఓ కథ ఉంటుంది. అలానే జనతాగ్యారేజ్‌ అనే కుటుంబానికి చెందిన కథ ఇది. ట్రైలర్‌లో చెప్పినట్లుగా.. ఇద్దరి వ్యక్తుల కథ. ఒకతను భూమిని ప్రేమిస్తాడు. మరోవ్యక్తి భూమిపై మనుషుల్ని ప్రేమిస్తాడు. వీరిద్దరి బ్యాలెన్స్‌ చేస్తూ సాగేదే ఈ సినిమా. ప్రపంచంలో మూడొంతుల నీరు. ఒకవంతే భూమి. అలాంటి భూమిని మనుషులు పట్టించుకోవడంలేదు. దానివల్ల పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుంది. దీన్ని దర్శకుడు శివ చక్కగా చూపించారు.
 
* ప్రకృతితోపాటు ఇద్దరు హీరోయిన్లు వున్నారే? 
సమంత, నిత్య.. ఇద్దరు గొప్పనటులు.. ఇంత కథకు వీరిద్దరి పాత్రలు కూడా ప్రాధాన్యత ఉన్నవే. అవేమిటనేది సినిమాలో చూడాల్సిందే. ఏదో పెట్టాలని ఆ పాత్రలు పెట్టలేదు. 
 
* 'అన్ని రిపేర్లు చేయబడును' అన్నారు. అంటే ఏయే రిపేర్లు చేస్తారు? 
అన్నీనూ.. స్నేహితులు, లవ్‌, కుటుంబం.. కావచ్చు. సమాజం కావచ్చు.. అన్ని సమస్యలకు ఇక్కడే పరిష్కారం. మీరు కూడా కావచ్చు.. అంటే ప్రధానంగా మనుషులను రిపేర్లు చేయబడును. 
 
* ఇటీవలే బెంగుళూరులో జరిగిన సంఘటన లాంటి ఫ్యాన్స్‌ గురించి? 
యస్‌.. దానికి నేను వివరణ ఇవ్వాల్సి వుంది. నాకు తెలిసి అలాంటి సందర్భాల్లో నా అభిమానులు ఉండరు. ఉంటే మాత్రం దయచేసి నాదగ్గరకు రావద్దు. నా ఫ్యాన్స్‌గా ఉండొద్దు. అసలు నా దృష్టిలో స్టార్స్‌ ఎవరంటే.. దేశం, తల్లిదండ్రులు, భార్యాబిడ్డలు.. ఆ తర్వాతే స్టార్‌.. చివరాప్షన్‌ హీరోకు ఇవ్వండి. ఇదే నేను చెప్పేది. 
 
* మీతో ఇతర స్టార్స్‌ రిలేషన్స్‌ ఎలా వుంటుంది? 
మేమంతా చాలా హ్యాపీగా వుంటాం. చాలా ఫ్రెండ్లీగా వుంటాం. 
 
* అలా ఎప్పుడూ కన్పించరే? 
ఎందుకు కన్పించం.. మీరే సరిగ్గా పట్టించుకోలేదన్నమాట. క్రికెట్‌మ్యాచ్‌లు, ఫండ్‌ రైజింగ్‌ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం కదా. లేనిపోనిది మనమే ఇందంతా సృష్టిస్తున్నాం.. ఫ్యాన్స్‌ ఫ్యాన్స్‌కు మధ్య వ్యత్యాసాలెందుకు అందరూ ఒక్కటే. 
 
* గత రెండేళ్ళ నుంచి మీలో మార్పు కన్పిస్తుంది. కారణం? 
నాకు.. 17 ఏళ్ళ అనుకుంటా.. 'స్టూడెండ్‌ నెంబర్‌ 1' చేశాను. ఆ తర్వాత .. 19 ఏళ్ళకు 'సింహాద్రి' చేశాను. అప్పటికి పిల్లాడినే. నా వయసువారు హ్యాపీగా ఆడుకుంటుంటే.. నేను సినిమాలు చేసేశాను. ఆ దుందుడుకుతో కొన్ని పనులు చేస్తే లాగి మొట్టికాయలు కొట్టినట్లు సినిమాలు పోయాయి. నా గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతుంటారు. ఏదైనా జరిగిపోయిన దానికి వివరణ ఇచ్చి లాభంలేదు. వర్తమానమే మన చేతుల్లో వుంది. భవిష్యత్‌ కూడా లేదు. నేను ఇప్పుడు మీతో మాట్లాడాను. మీరు వెళ్ళిపోతారు. తర్వాత నాకు అనుకోకుండా ఏదో ఒకటి జరగవచ్చు.

మా అమ్మ.. 'పొద్దున్నలేచి ఏం తింటావ్‌!' అంటుంది.. ముందు నిద్రలేవాలిగదా.. హోప్‌.. నమ్మకం.. రేపు నేను నిద్రలేస్తాను అనే నమ్మకం వుండాలి. బతకాలి అనుకోకూడదు. బతికినంతకాలం హ్యాపీగా వున్నామాలేదా? అనేది చూసుకోవాలి. ఇదంతా సన్యాసిలా మాట్లాడుతున్నాననుకోవచ్చు మీరు. నాతో నేను గడిపిన క్షణాల్లే పంచుకుంటుంటాను. గతంలో జరిగిన దాని గురించి మాట్లాడను. వర్తమానమే ముఖ్యం. నా కుమారుడు, నా భార్య. ఇదే అందంగా అనిపిస్తుంది. ఎందుకంటే.. నేను ఇప్పటివరకు ఆ ఆనందాన్ని ఆస్వాదించలేదు.

బహుశా తండ్రి అయ్యాక.. ఆ ఫీలింగ్‌ అందరికీ వస్తుంది అనుకుంట. నాకు అలానే వచ్చింది. మా నాన్నగారు ఎంత ప్రేమతో వుండేవారో.. అనేది... నేను తండ్రి అయ్యాక తెలిసివచ్చింది. ఎక్కడో చదివాను. అమ్మకడుపులో పుడతాం. పెరుగుతాం. సంపాదిస్తాం.. ఖర్చుపెడతాం. చచ్చిపోతాం.. మళ్లీ పుడతాం.. ఇవన్నీ చూస్తుంటే చిత్రంగా అనిపిస్తుంది. 
 
* మీ అబ్బాయి ఎలా వున్నాడు? 
వాడు ఎక్కువగా మట్టిలోనే ఆడుకుంటున్నాడు. చాలా గొడవ చేస్తుంటాడు. చెప్పిన మాట వినడు. మా అమ్మ చెబుతుంటుంది.. నేను చిన్నతనంలో వుండగానే. బల్బ్‌, వైర్లు తీసుకుని ప్లగ్‌లో పెట్టేవాడినట. వాడు నాకంటే ఎక్కువ అల్లరి చేస్తున్నాడు. నన్ను, వాళ్ళమ్మను తెగకొడుతుంటాడు. అదీ చాలా గట్టిగా.. మనం ఏం అనలేం. అదోరకమైన ప్రేమ. 
 
* మీ మాటల్లో ఫిలాసఫీ కన్పిస్తుంది. స్ఫూర్తి ఎవరైనా ఉన్నారా? 
ఈ మాటలు విని బోర్‌ కొడుతుంది. ఫిలాసఫీ లేదు. వెనుక ఎవరు లేరు. జీవితమంటే ఆనందంగా గడపడమే. చేతనైతే మంచి చేయాలి. మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేవరకు ఎంతో మారతాం. ఆ మార్పులే భాగమే ఇదంతా. 
 
* యంగ్‌లో ఉండగానే సింహాద్రి చేశాను. ఆలోచించేస్థాయిలేదన్నారు. ఆ ఆలోచన ఇప్పుడు క్యారీ చేయాలని ఉందా? 
అప్పుడు జరిగిపోయింది. అలా అనిపించింది. అది అంతే.. ఇప్పుడు వేరు. కథ నచ్చితే చేయడమే. అయితే మనకు నచ్చింది మరొకరికి నచ్చాలని లేదు. ఒకరకంగా చెప్పాలంటే ఏదీ మన చేతుల్లో లేదు. తర్వాత ఏం జరగబోతుందో చెప్పలేం కూడా. 
 
* అంటే చేసిన తప్పుడు సరిద్దుకోవచ్చుగదా? 
ఖచ్చితంగా.. అలాంటికి సరిదిద్దుకుంటూ ముందుకుసాగడమే జీవితమంటే. 
 
* రాజకీయాల్ని గమనిస్తున్నారా? 
లేదు. నటుడిగా కెరీర్‌ను చూసుకోవడమే. 
 
* గతంలో టిడిపి కార్యక్రమాల్లో పాల్గొన్నారు కదా? 
అది అప్పటి పరిస్థితినిబట్టి చేశాను. ఇలాంటి ప్రశ్నలు వినివిని బోర్‌కొట్టేసింది. నటుడిగా నేను ఏమి చేయాలనేది నేను చూసుకుంటా. 
 
* హిస్టారికల్‌ సినిమాలు చేస్తారా? 
ఆలోచించాలి. మధ్యలో ఒకటి చేశాను. మాడు పగిలింది. అలాంటి కథలు చేయడం కష్టం. సరైన కథ దొరకాలి. దర్శకుడు కుదరాలి. 
 
* బయోపిక్‌ చేయాల్సివస్తే చేస్తారా? 
నాకు ఇష్టమైన వ్యక్తి తాతగారు. ఆయనే నాకు స్ఫూర్తి. ఆ క్యారెక్టర్‌ నేను చేయలేను. ఆయన యుగం ఆయన కీర్తి అంతా.. జాతికి అంకితం.. అది తెలుగువారి ఆస్తి. పదేళ్ళతర్వాత అయినా నేను చేయలేను. ఎవరైనా చేయవచ్చు. 
 
* వక్కంతం వంశీ చిత్రం ఎంతవరకు వచ్చింది? 
ఇంకా చర్చల్లో వున్నాయి. 
 
* 'రాముడు భీముడు' చేద్దామనుకున్నారు? ఏమయింది? 
కొన్ని నమ్మకాలు భయాన్ని కల్గిస్తాయి. అలాంటి గొప్ప సినిమాలు టచ్‌చేసి చెడ్డపేరు తెచ్చుకోకూడదు. ఒకవేళ చేయగలననే నమ్మకం వుంటే దానికోసం క్షుణ్ణంగా స్టడీ చేసి.. చేయాలి. 
 
* సోషల్‌మీడియాలో ఇంట్రాక్ట్‌ అవుతున్నారా? 
లేదు. సోషల్‌మీడియా అనేది కొంతమందికే పరిమితం. అందరికీ ఆ టెక్నాలజీ తెలీదు. ఫేస్‌బుక్‌కానీ ఏదైనా.. దాని అవగాహన వున్నవారే ఉపయోగించుకుంటారు. అందుకే నేను పెద్దగా ఇంట్రాక్ట్‌ కాను. 
 
* 'జనతాగ్యారేజ్‌' తర్వాత కొత్త కథలు వస్తాయా? 
నాకోసం కాదు. మాములుగానే ఇండస్ట్రీలో కొత్త కథలు పుట్టుకురావచ్చు.