శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Modified: మంగళవారం, 28 జులై 2015 (22:10 IST)

నా కథ హీరోలకు నచ్చుతుంది: 'శ్రీమంతుడు' డైరెక్టర్ కొరటాల

పలు చిత్రాలకు రచయితగా పని చేసిన ప్రభాస్‌ చిత్రం 'మిర్చి'తో ఒక్కసారిగా సక్సెస్‌‌ఫుల్‌ డైరెక్టర్‌గా వెలుగులోకి వచ్చిన కొరటాల శివ. తదుపరి చిత్రంగా మహేష్ బాబుతో చేయడం ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. మహేష్‌తో 'శ్రీమంతుడు' చిత్రాన్ని చేసిన ఆయన తర్వాత మరో ప్రముఖ హీరోతో చేయనున్నారు. అయినా ముందుగా శ్రీమంతుడు రిలీజ్‌ పనిలో వున్నాననీ, వచ్చే నెల 7న చిత్రం విడుదల కానున్నందని అంటున్న ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ.
 
శ్రీమంతుడు కథ ఎక్కడ నుంచి పుట్టుకొచ్చింది?
దీనికి చాలా ఫ్లాష్‌బ్యాక్‌ వుంది. చిన్నతనంలో.. అంటే స్కూల్‌ డేస్‌లో వుండగా ఓ హీరో ఓ చోట స్కూల్‌ కట్టించాడనీ, మరో ప్రముఖుడు ఆసుపత్రి కట్టించాడనీ, ఇంకొకరు విదేశాల నుంచి వచ్చి ఈ పల్లెను అభివృద్ధి చేశాడని తెలిసి ఆశ్చర్యపోయాను. ఇలాంటివారు కూడా వున్నారా అనిపించేది. ఆ తర్వాత పెద్దపెద్ద కోటీశ్వర్లు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం చూశాను. విన్నాను. ముఖ్యంగా బఫెట్‌, బిల్‌గేట్స్‌ వంటివారు తమ సంపాదనలో యాభై శాతం సేవా కార్యక్రమాలను వినియోగిస్తుండేవారు. ఇది తెలిశాక.. ఈ పాయింట్‌తో సినిమా తీస్తే ఎలా వుంటుందనే ఆలోచన వచ్చింది. అదే ఈ కథకు స్ఫూర్తి కల్గింది.
 
ఇదే కథను రామ్‌ చరణ్‌కు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి?
అబ్బే అదేం లేదు. అది అపోహ మాత్రమే. 'మిర్చి' సినిమా సమయంలోనే 'శ్రీమంతుడు' కథను అనుకున్నాను. ఈ కథకు మహేష్‌ సూటవుతాడనే ఆయన కోసం సిద్ధం చేశాను. అయితే 'మిర్చి' తర్వాత రామ్‌ చరణ్‌కు ఓ కథను చెప్పాను. కానీ అది వేరే కథ. దానికీ దీనికి ఏమాత్రం పోలిక లేదు.
 
మహేష్‌ ఏమన్నారు?
ఈ కథ వినగానే వెంటనే చేసేద్దాం అన్నారు. చెప్పినట్లు చేస్తే మరింత ఆకట్టుకుంటుందని సూచన చేశారు. ఇదొక నిజమైన శ్రీమంతుడి కథ. వేల కోట్ల ఆస్తి వున్న ఓ వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటనల సమాహారమే ఈ చిత్రం. అన్ని రకాల వాణిజ్యాంశాలతో కొత్తదనం వుండడంతో మహేష్‌కు బాగా  నచ్చింది. నేను అనుకున్నదానికి నూరు శాతం న్యాయం చేశాను. కథకు సరిపడేలా టైటిల్‌ 'శ్రీమంతుడు' అయితేనే బాగుంటుందని భావించి ఖరారు చేశాం.
 
మహేష్‌తో పనిచేయడం ఎలా అనిపించింది?
మహేష్‌తో తొలిసారి కథ చెప్పినప్పుడు ఆయనలో ఏదో ఎనర్జీ వుందనిపించింది. చాలా హుషారుగా జోవియల్‌గా వున్నారు. ఇక ఆయన కలిసి పనిచేసినప్పుడు కొత్త ఎనర్జీ వచ్చినట్లయింది. నాకు తెలిసి ఏ దర్శకుడైనా మహేష్‌తో పనిచేయడం చాలా కంఫర్టబుల్‌గా వుంటాడని చెప్పవచ్చు. పూర్తయ్యాక... అప్పుడే సినిమా అయిపోయిందా! అన్న ఫీలింగ్‌ కల్గింది. నాకు తెలిసి బెస్ట్‌ నటుల్లో మహేష్‌ ఒకరు.
 
శ్రుతిహాసన్‌ ఎలా నటించింది?
శ్రుతిహాసన్‌ పాత్రకు సరిపోయింది. ఇద్దరి జోడీ చూడముచ్చటగా వుంది. ఇక జగపతిబాబు బాగా ఆస్తిపరుడైన వ్యక్తి ప్రవర్తన ఎలా వుంటుందో ఫీలయి చేశారు. ముందుగా ఈ పాత్రకు ఎవరైతే బాగుంటుందా! అని ఆలోచించాక.. 'లెజెండ్‌'లో ఆయన నటన చూసి ఈ పాత్రకు ఎంపిక చేశాం.  
 
దేవీశ్రీప్రసాద్‌ సంగీతం ఎలా వుంది?
సంగీత దర్శకుడిగా దేవీప్రసాద్‌ ఈ చిత్రం ప్రత్యేక ఆకర్షణ. ఇప్పటికే ఆడియో ప్రజాదరణ పొందాయి. రీ-రికార్డింగ్‌ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు.
 
మీరు అగ్రహీరోలతోనే సినిమా చేస్తారని కామెంట్‌ వుంది?
ఈ విషయాన్ని చాలామంది నా వద్ద ప్రస్తావించారు. మనం చెప్పే కథ బాగుంటే ఏ హీరో అయినా ముందుకు వస్తాడు. నా కథలు వారికి నచ్చాయి కాబట్టే నాతో పనిచేయడానికి ముందుకు వచ్చారు. అంతేకానీ మరోటి కాదు.
 
తదుపరి చిత్రాలు?
నావద్ద మూడు కథలున్నాయి. ఇంకా ఎవరు! ఏమిటి! అనుకోలేదు. శ్రీమంతుడు రిలీజ్‌ అయ్యాక వాటి గురించి చెబుతాను. రామ్‌ చరణ్‌ అనుకున్నాం. ఇంకా ఫైనల్‌ కాలేదు అని చెప్పారు.