శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Modified: సోమవారం, 18 ఏప్రియల్ 2016 (18:56 IST)

పవన్ కళ్యాణ్ కు వున్న పెద్ద మనసు పూరీకి లేకుండా పోయింది... 'లోఫర్' డిస్ట్రిబ్యూటర్ల ఇంటర్వ్యూ

సినిమా విడుదల చేయాలంటే పంపిణీదారుడు కీలకం. ఆయనే లేకపోతే చాలా సినిమాలు బయటకు రావు. అలాంటి పంపిణీదారుడు నేడు బికారీగా మారాడు. కోట్లు ఖర్చుపెట్టి సినిమాను కొని విడుదల చేస్తే.. అందులో లాభాలొస్తే 20 శాతమే డిస్ట్రిబ్యూటర్‌కు దక్కుతుంది. అదే నష్టం వస్తే మొత

సినిమా విడుదల చేయాలంటే పంపిణీదారుడు కీలకం. ఆయనే లేకపోతే చాలా సినిమాలు బయటకు రావు. అలాంటి పంపిణీదారుడు నేడు బికారీగా మారాడు. కోట్లు ఖర్చుపెట్టి సినిమాను కొని విడుదల చేస్తే.. అందులో లాభాలొస్తే 20 శాతమే డిస్ట్రిబ్యూటర్‌కు దక్కుతుంది. అదే నష్టం వస్తే మొత్తం తనే భరించాలి. ఇది ఇప్పటివరకు కొనసాగుతున్న రూలు. బూజు పట్టిన ఈ విధానాన్ని ప్రక్షాళన చేయాలని పలువురు డిస్ట్రిబ్యూటర్లు వాపోతున్నారు. తమకు నష్టం వచ్చిందని దర్శకుడిని రిక్వెస్ట్‌ చేస్తే.. తమను నేరం చేసినవారిలా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
 
పూరీ జగన్నాథ్‌ లాంటి వారు తనపై దాడి చేసారంటూ కేసు పెట్టేస్తున్నారు. గత శనివారంనాడు దర్శకుడు పూరీ జగన్నాథ్‌ ముగ్గురు పంపిణీదారులపై జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో పిర్యాదు చేశారు. ఈ దర్శకుడు గతంలో 'లోఫర్‌' అనే చిత్రాన్ని తెరకెక్కించారు. సి.కళ్యాణ్‌  నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్‌ చేసిన అభిషేక్‌, సుధీర్‌, ముత్యాల రామదాసు తనను ఇబ్బందికి గురిచేస్తున్నారని పూరి వారిపై కేసు పెట్టారు. జూబ్లీహిల్స్‌ పోలీసు అధికారి వెంకటరెడ్డి ఆ ముగ్గురిపై 506, 453, 323, 386.. 511 కేసులు నమోదయ్యాయని సదరు పంపిణీదారులకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆ ముగ్గురు సోమవారం నాడు ఫిలింఛాంబర్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. పలు ప్రశ్నలకు వారు ఈ విధంగా స్పందించారు.
 
ఈ కేసుపై ముగ్గురిపై పోలీసులు ఎటువంటి చర్య తీసుకున్నారు?
ముగ్గురుపై పోలీసు ఎంక్వయిరీ చేయమంటున్నాం. చట్టప్రకారం ఏ చర్య తీసుకున్నా ఓకే. అలాగే తప్పుడు కేసు పెట్టినందుకు ఆయనపై కూడా చర్య తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాం.
 
మీరు పూరీతో సన్నిహితంగా వుంటారుకదా? మీపై కేసు అంటే ఎలా అనిపిస్తుంది?
ముత్యాల రామదాసు మాట్లాడుతూ.. నేను, పూరితో ఫ్రెండ్లీగా వుంటాను. ఆయన ఉద్దేశ్యమో, మరెవరైనా ప్రోత్సహించారో తెలియదు. ఏకంగా మాపై ఆరు సెక్షన్లు పెట్టారు. నేను ఆయన్ను కలిసి దాదాపు 55 రోజులయింది. ఆయన ఫోన్‌ చేసి రమ్మంటే ఆఫీసుకు వెళతాను. లోపలికి వెళ్ళాలంటే పూర్తి సెక్యూరిటీ వుంటుంది. లిఫ్ట్‌ ఎక్కాలంటే అక్కడివారి వేలిముద్ర వుంటేనే ఓపెన్‌ అవుతుంది. ఇంత కట్టుదిట్టమైన కార్యాలయంలోకి మేం వెళ్ళి ఎలా కొట్టగలం! ఆయన కేసు పెట్టామని చెబుతున్న రోజు మేం ముగ్గురం హైదరాబాద్‌లోనే లేం. ఇక్కడికి వచ్చాక మాకు తెలిసింది ఏమంటే.. పూరీకి తెలిసిన ఓ పోలీసు అధికారి సూచన మేరకే ఇలా జరిగిందని తెలిసింది.
 
అయితే, ఇప్పటి డిస్ట్రిబ్యూషన్‌ వ్యవస్థ ఎలా వుంది?
కోట్లు ఖర్చుపెట్టి సినిమాను బయటకు తెచ్చేది మేమే. కలెక్షన్లు ఇచ్చేది మేమే. అలాంటి వ్యవస్థ ఇప్పుడు భ్రష్టు పట్టిపోయింది. నైజాంలో పెద్ద సినిమాను 20 కోట్లు పెట్టి ఏసియన్‌ సునీల్‌ కొంటే.. సగానికి సగం పోయింది. ఇలాంటి స్థితిలో పంపిణీదారులు ఏమవ్వాలి. చాలామంది పంపిణీదారులు రోడ్డునపడ్డారు.
 
కాగా, అసలు పోలీసులు ఎవరి గైడెన్స్‌తో ఇలా చేశారో తెలియాలి. దీన్నిబట్టి పోలీసు వ్యవస్థపై దురభిప్రాయం ఏర్పడుతుంది. ఓ పోలీసు అధికారి తెలిస్తే ఎవరిపైనైనా కేసు పెట్టవచ్చా? ఇలాంటివి సమాజాన్ని దిగజారుస్తాయి. అసలు ఏదైనా సమస్య వుంటే ఫిలింఛాంబర్‌, దర్శకుల సంఘం, నిర్మాతలమండలి వున్నాయి. వీరి దగ్గరకు రాకుండా.. పోలీసులతో ఇలా బెదిరించాలనుకుంటే సరైందికాదు. దీనివల్ల ఆ దర్శకుడి సినిమాలు ప్రజలు ఏం చూస్తారు. ఆయన చెప్పే నీతులు ఎవరు వింటారు. ఇది దిగజారుడుతనమే. పోలీసు వ్యవస్థపై గౌరవం వుంటుందా? 
 
అసలు వివాదం ఏమిటి? ఏ సినిమా గురించి?
వివాదం ఏమీలేదు.. ఆయన 'లోఫర్‌' సినిమా చేశారు. సి. కళ్యాణ్ నిర్మాత. ఆ సినిమాను నైజాంలో అభిషేక్‌ పిక్చర్స్‌, నేను తూర్పుగోదావరిలో, ఇంకా ఏడుగురు కలిసి కొన్నిచోట్ల విడుదల చేశాం. ఐదుకోట్లతో విడుదల చేస్తే రెండున్నర కోట్లు పోయాయి. ఏడాదిన్నర నుంచి దర్శకుడిని, హీరోలను నష్టాన్ని పూడ్చమని మేం అడుక్కుంటున్నాం. అదైనా ఎటువంటి ఒత్తిడి లేకుండానే.. రిక్వెస్ట్‌ చేశాం. ఎటువంటివిధంగా మేం పూరీని ఒత్తిడి చేయలేదు. ఆ తర్వాత పూరీగారు.. సి.కళ్యాణ్‌తో మాట్లాడండి అన్నారు. మేం కళ్యాణ్‌తో మాట్లాడాం.. నేను వచ్చాక పరిష్కరిస్తానని చెప్పారు. ఇదీ జరిగింది. ఈలోగానే.. పోలీసులు కేసు పెట్టడంతో మేం అవాక్కయ్యాం.
 
మీరు రెండు కోట్లు డిమాండ్‌ చేశారనీ, కొంతమంది దగ్గర వసూలు కూడా చేశారనే విమర్శలున్నాయి?
మేం ఎవరి దగ్గర వసూలు చేయలేదు. కేవలం అభ్యర్థించాం. ఎవర్నీ గడబడి చేయలేదు.
 
ఇలా అడగడం మీ హక్కా?
అవును. సినిమా కొన్నప్పుడే నిర్మాతతో అగ్రిమెంట్‌ చేసుకుంటాం. దాని ప్రకారం.. పెట్టిన పెట్టుబడిలో 20 శాతం వరకు నష్టపోతే మేం భరిస్తాం. ఆపైన 5, 10 కూడా భరిస్తాం. కానీ 50 శాతం పైగా నష్టమొస్తే మాత్రం నిర్మాతను, దర్శకుడిని, హీరోను రిక్వెస్ట్‌ చేసి నష్టాన్ని పూడ్చమని అడుగుతాం. ఇందులో ఎటువంటి ఒత్తిడి వుండదు. 
 
'జానీ' సినిమా ప్లాప్‌ అయ్యాక.. వాలంటరీగా పవన్‌ కళ్యాణ్ స్పందించి నష్టాన్ని పూడ్చారు. ఆయన మంచి హృదయంతో స్పందించిన తీరది. అలాగే రజనీకాంత్‌ కూడా 'లింగా' సినిమాకు చేశారు. లింగుస్వామి, సూర్య, 'ఆగడు' సినిమాకు మహేష్‌ బాబు, శ్రీను వైట్ల, 'అఖిల్‌'కు వివి వినాయక్‌ ఇలా స్పందించినవారే. అఖిల్‌ సినిమా రెండోరోజే వినాయక్‌ ఫోన్‌ చేసి.. మీరు నన్ను నమ్ముకుని కొన్నారని.. తనే మూడు కోట్లు ఇచ్చారు. ఇలాంటి దర్శకులు హీరోలు వున్న సినిమా ఇండస్ట్రీలో పూరీ లాంటి వారు కూడా వున్నారు.
 
పోలీసులు మీపై ఎటువంటి చర్య తీసుకున్నారు?
ఇంతవరకు ఏమీ తీసుకోలేదు. మేమే జూబ్లీహిల్స్‌ పోలీసు అధికారి వెంకట్‌రెడ్డిని సంప్రదించాం. 'మేం పూరీని డబ్బులు అడగలేదు. ఆ విషయం మీకు తెలియాలని మీకు ఫోన్‌ ద్వారా కాల్‌ చేశామని చెప్పాం'.
 
కేసు ప్రకారం మీ ముగ్గురు లోపల వుండాలి కదా?
ఆ విషయాన్ని పోలీసుల్నే అడగండి. వెంకటరెడ్డి అనే ఆఫీసర్‌ మీడియాలో కూడా చెప్పారు. ఫలానా కేసులు మా ముగ్గురిపై వున్నాయని టీవీల్లో వచ్చింది. ఇలాంటి కేసులు పెడుతున్నారనే ఇటీవలే సుప్రీంకోర్టు మొట్టికాయ కూడా వేసింది. ఏ సెక్షన్‌ అయినా పెట్టేటప్పుడు పకడ్బందీగా ఆలోచించాలి. గుడ్డిగా కేసులు పెట్టేయవద్దని చెప్పింది కూడా. 
 
అసలు నష్టం వస్తే నిర్మాతనే అడగాలి కదా?
నిర్మాతనేవాడు సినిమాకు నష్టం వస్తే ఒక్కోసారి చేతులెత్తేస్తున్నాడు. అప్పుడు లాభపడింది ఎవరంటే.. కోట్లు తీసుకునే దర్శకుడు, హీరోనే. అందుకే వారిని అడగాల్సి వస్తుంది. అందుకే ఒకప్పుడు 300 మంది పంపిణీదారులు వుంటే నేడు 9 మందికి పడిపోయింది. దీనికి కారణం.. జూదం లాంటి ఈ వ్యాపారంలో ఇమడలేకపోవడమే.
 
సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ లాస్‌ అయింది కదా. ఆయన్ను అడిగారా?
ఆయన్ను రిక్వెస్ట్‌ చేయనవసరంలేదు. ఆయనే స్పందిస్తారు. గతంలో స్పందించారు కదా. ఏది ఏమైనా.. కోటికి పైగా తీసుకునే దర్శకుల్ని హీరోల్నే మేం నష్టం గురించి అడుగుతాం మినహా అంతకు తక్కువున్నవారిని అడగం.
 
డిస్ట్రిబ్యూటర్‌ వ్యవస్థ ఇంత దౌర్భాగ్య స్థితికి రావడానికి కారణం?
మొదటిది సినిమా ఫెయిల్యూర్‌. ఆ తర్వాత నిర్మాణ వ్యయం పెరగడం.
 
అయినా 100 కోట్ల సినిమాను 120 పెట్టి పోటీపడి కొంటున్నారే?
డిస్ట్రిబ్యూటర్‌ ఆశాజీవి. రెండు సినిమాల్లో నష్టం వస్తే.. మూడో సినిమా అయినా లాభం వస్తుందనే ఆశ. జూదం లాంటిది ఈ వ్యాపారం.
 
సినిమా చూసి కొనే సాంప్రదాయం రాదా?
గతంలో వుండేది. రానురాను ఆ పద్ధతి పోయింది. సినిమా విడుదలకు ముందు.. ఈ సినిమా.. ఆహా.. ఓహో... పోకిరిని, ఇడియట్‌ను బీట్‌ చేస్తుందంటూ మీడియా ద్వారానే ప్రచారం చేస్తున్నారు. విజయ యాత్రలు చేస్తున్నారు. ఇదంతా మీడియా హైలైట్‌ చేస్తుంది. ఇవి చూసి డిస్ట్రిబ్యూటర్లు ఎట్రాక్ట్‌ అవుతున్నారు.
 
ఇదంతా చూస్తే పూరీ.. ఏదో గేమ్‌ ఆడుతున్నట్లుందా?
ఆయనే చెప్పాలి. ఎందుకంటే ఆయన నిర్దేశకత్వంలో రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా వున్నాయి. వాటి జోలికి రాకుండా వుండేందుకు ఇలాంటి ట్రిక్కులు వేశారనే మేం అనుకుంటున్నాం.
 
డిస్ట్రిబ్యూషన్‌లో ఎన్‌ఆర్‌ఎ అని కొన్ని నిబంధనలు వున్నాయి కదా?
రికవరీ, నాన్‌ రికవరీ అడ్వాన్స్‌ అంటూ కొన్ని సూత్రాలున్నాయి. అయితే సినిమా లాభాలొస్తే 20 శాతం కమిషన్‌ కింద డిస్ట్రిబ్యూటర్‌కు వస్తుంది. అదే నష్టాన్ని డిస్ట్రిబ్యూరే బేర్‌ చేయాల్సివస్తుంది. ఇది సరైన న్యాయం కాదని మేం అంటున్నాం. 10 కోట్లు పెట్టి కొన్న సినిమా మూడు కోట్లే వస్తే అందులో నష్టాన్ని కూడా భరించాలికదా.. కానీ భరించరు. ఆ నష్టమంతా కొన్నవారే భరించాలంటారు. ఇదెక్కడి న్యాయం అని మేం అడుగుతున్నాం. అసలు ఎన్‌ఆర్‌ఎ (నాన్‌ రికవరీ అడ్వాన్స్‌) అనేది ఏమిటి? అనేది మాక్కూడా పెద్దగా తెలీదు. సాంప్రదాయంగా వస్తుంది. లాయర్లను అడిగాం. అది గతంలో పెద్దలు పెట్టారని మాత్రమే చెప్పారు. దీనివల్ల కోట్లు నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు చాలామంది గుండెపోటుతో చనిపోయారు.
 
మరి ఇలాంటి సమస్యల్ని పరిష్కరించుకోవచ్చుగదా?
ఆ దిశగా చర్యలు సాగున్నాయి. ఛాంబర్‌లోని ఇతర సంఘాలతో చర్చించి ఒక నిర్ణయానికి రావాలనుకుంటున్నాం. 
 
పూరీపై మీరు దాడి చేయలేదా...?
వికలాంగుడైన ముత్యాల రాందాస్ కూడా పూరిపై దాడి చేశాడని కేసు పెట్టారు. ఇది విడ్డూరంగా ఉంది. ఈ విషయాన్ని ఈజీగా వదిలిపెట్టేది లేదు. న్యాయం జరగక పోతే దేనికైనా సిద్ధం. సూసైడ్ నోట్‌లో పూరీ పేరు రాసి చచ్చిపోతాం అని ముగించారు.