మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Modified: సోమవారం, 23 ఫిబ్రవరి 2015 (19:16 IST)

వర్మ మెచ్చుకోవడమే పెద్ద క్రెడిట్ : 'పటాస్' సాయి కార్తీక్‌

సంగీతం బాగుంటేనే సినిమా రన్నింగ్‌ బాగుంటుంది. ప్రతి సన్నివేశంలో బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ కీలకంగా వుంటుంది. అందులో వచ్చే సౌండ్‌ రకరకాలుగా సినిమా విజయానికి కారణమవుతుంది. ఇదే విషయాన్ని వర్థమాన సంగీత దర్శకుడు సాయికార్తీక్‌ తెలియజేస్తున్నాడు. చిన్నాచితకా చిత్రాలు చేసినా రాని గుర్తింపు ఒకేఒక్క పెద్ద సంస్థతో చేయడంతో వచ్చిందని ఆనందపడుతున్నాడు. నందమూరి కళ్యాణ్‌ రామ్‌ నటించిన 'పటాస్‌'లో చేసిన సంగీతంతో పాటు సినిమా కూడా హిట్‌ కావడంతో ఆనందాన్ని పంచుకుంటున్నారు. సోమవారం (23.2.2015) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు
 
మీ నేపథ్యం? 
మాది ప్రకాశం జిల్లా ఒంగోలు. మా తండ్రిగారు శ్రీనివాస్‌ తబలా విధ్వాంసులు, గాయకుడు కూడా. తల్లి నాగమణి గాయని. చిన్నతనంలోనే వీరి పాటలకు చిన్నచిన్న డ్రమ్ములతో చేతులు ఆడించేవాడిని. చిన్న చిన్న ఆల్బమ్స్‌ కూడా చేశాను.
 
సంగీతం ఎవరిదగ్గర నేర్చుకున్నారు? 
తల్లిదండ్రులో ప్రోత్సాహంతో 14 ఏళ్ళ ప్రాయంలో చెన్నైకు వెళ్ళాను. అక్కడ జి.ఆనంద్‌, కోటి, వాసూరావు, దేవీశ్రీ ప్రసాద్‌ వంటి ప్రముఖుల వద్ద పనిచేశాను. అక్కడే మణిశర్మ బాణీలు పరిశీలించేవాడిని. ఆయనతో డైరెక్ట్‌గా పనిచేయలేదు. నేను ఆయనకు ఏకలవ్య శిష్యుడ్ని. ఆయన చేసే బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ విని నేర్చుకున్నాను. అదే నా జీవితాన్ని మలుపు తిప్పింది.
 
మీరు చెప్పే బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌లో స్పెషల్‌ ఏమిటి? 
సినిమా కథకు తగినవిధంగా సీన్‌ పరంగా వెనుక వచ్చే మ్యూజిక్‌ అన్నమాట. ఇది వర్మ వంటివారికే నచ్చింది. వర్మగారు కూడా.. నన్ను మెచ్చుకున్నారు. ఆయనకు సౌండ్‌ సిస్టమ్‌లో అపారమైన అనుభవముంది. 
 
కృష్ణవంశీ చిత్రానికి ఎలా అవకాశం వచ్చింది? 
8 ఏళ్లుగా ఈ ఫీల్డులో వున్నాను. కృష్ణవంశీ గారితో పనిచేయాలని ప్రతివారూ అనుకుంటారు. నాకు జెడి చక్రవర్తి ద్వారా అవకాశం వచ్చింది. ఆయన ఓ సీన్‌ చెప్పారు. దానికి నాదగ్గర వున్న ఇన్‌స్ట్రుమెంట్‌తో కొత్తగా సంగీతం ఇవ్వగానే.. ఆయనకు అందులో సౌండ్‌ బాగా నచ్చి వెంటనే 'పైసా' చిత్రానికి అవకాశం ఇచ్చారు.
 
మరి వర్మగారితో ఎలా పరిచయం? 
'పైసా' సినిమాలో సంగీతం చూశాక.. రీ-రికార్డింగ్‌ బాగా నచ్చిందని రామ్‌గోపాల్‌ వర్మ చెప్పారట. ఆ వ్యక్తిని పంపమని చెప్పారట. అలా వర్మ దగ్గరకు వెళ్ళడం. మళ్ళీ టెస్ట్‌ చేయడం జరిగింది. అలా వచ్చిందే 'రౌడీ' సినిమా. మోహన్‌ బాబు గారి బేనర్‌.. జాతీయ దర్శకుడు.. సినిమాలో చేయడం అదృష్టంగా ఫీలయ్యాను. రౌడీ విడుదలయ్యాక.. బ్యాక్‌గ్రౌండ్‌ అద్భుతంగా వుందని మోహన్‌బాబు మెచ్చుకోవడం, వర్మకూ నచ్చడంతో ఆయన మరోసారి అవకాశం ఇస్తానని కూడా చెప్పారు. 
 
సంగీత దర్శకుడిగా తొలి సినిమా ఏది? 
సంగీత దర్శకుడిగా తొలిచిత్రం 'కాల్‌ సెంటర్‌'. ఆ చిత్రం మోస్తరు గుర్తింపు తెచ్చింది. ఇప్పటివరకు 20 చిత్రాలు చేశాను. నేను కొంతమంది సంగీత దర్శకులుగా డ్రమ్సు వాయించేవాడిని. అవి చూసి వారి దగ్గరకు వచ్చిన కాల్‌సెంటర్‌ నిర్మాత నాకు అవకాశం ఇచ్చారు.
 
పెద్ద దర్శకులతో చేశాక మళ్ళీ చిన్న చిత్రాలకు పని చేయడానికి కారణం? 
అంతకంటే పెద్ద దర్శకులు దొరకలేదు (నవ్వుతూ). అందుకే చేస్తున్నాను. చిన్న సినిమాలు అంటారు కానీ, వాటివల్లే చాలామందికి గుర్తింపు వస్తుంది. ఇక్కడ చిన్నాపెద్దా తేడాలేదు. పని విధానం నచ్చాలి అంతే.
 
అసలు సంగీత ప్రపంచంలోకి రావడానికి కారణం? 
తండ్రిగారు తబలా విధ్వాంసులు కావడంతో స్వతహాగా డ్రమ్ము వాయించడం మ్యూజిక్‌ అంటే ఇష్టం ఏర్పడింది. అన్నిటి కంటే ఇళయరాజా బాణీలంటే ప్రాణం. చక్కటి మెలోడీలు ఇవ్వగలరు. ఆ ప్రేరణతోనే ఈ రంగంలోకి వచ్చాను. ఎ.ఆర్‌. రెహమాన్‌ బాణీలు కూడా కొత్తగా వుంటాయి.
 
'పటాస్‌' సినిమా ఎలాంటి గుర్తింపు తెచ్చింది? 
నందమూరి కళ్యాణ్‌ రామ్‌ నటించిన 'పటాస్‌'కు ఆయనకు ఎంత విజయం వచ్చిందో అంత కిక్‌ (విజయం) నాకూ వచ్చింది. సినిమా చూసిన వారంతా పాటలు, రీ-రికార్డింగ్‌, బ్యాక్‌గ్రౌండ్‌ గురించి మెచ్చుకుంటున్నారని హీరో, దర్శకుడు కూడా నాతో చెప్పడం నాకెంతో ఆనందంగా వుంది.
 
ఆ సినిమా తర్వాత ఆఫర్లు రాలేదా? 
వచ్చాయి. చాలామంది అప్రోచ్‌ అయ్యారు. కానీ నచ్చిన చిత్రాలే చేయాలనుకున్నా. తొందరపడి ఏదో ఒకటి చేయకుండా నిదానంగా చేయాలనుంది. త్వరలో పెద్ద ప్రాజెక్ట్‌ చేయనున్నాను.
 
ఒకే సినిమాకు ఇద్దరు ముగ్గురు సంగీత దర్శకులు పనిచేయడం కరెక్టే అంటారా? 
నా దృష్టిలో కానేకాదు. ఆమధ్య ఒకే సినిమాకు ఐదు పాటలకు ఐదుగురు సంగీత దర్శకులకు అవకాశం కల్పించారు. కానీ సినిమాకు ఏమాత్రం ఉపయోగం లేదు. ఒకే సంగీత దర్శకుడు వుంటే... ఆ కథ, సీన్‌ అన్ని అవపోసన పట్టేస్తాడు. అతనే చేయగలడు. మరి ఇలా ఎందుకు జరుగుతుందో ఏమీ అర్థంకాదు.
 
కొత్త చిత్రాలు? 
ప్రస్తుతం 'భమ్‌భమ్ బోలేనాథ్‌', 'అసుర' చిత్రాలు విడుదలకు సిద్ధంగా వున్నాయి. త్వరలో పెద్ద బేనర్‌లో చేస్తున్నాను. ఆ వివరాలు తర్వాత చెబుతాను.
 
ఇతర భాషల్లో కాపీరైట్‌ యాక్ట్‌ వుంది. ఇక్కడ మీకు అలాంటిది వర్తిస్తుందా? 
లేదు. బాలీవుడ్‌లోనూ, తమిళనాడులోనూ వుంది. కానీ తెలుగులో మన బాణీలను ఎవరైనా ఉపయోగించినా.. ఆ పాటలు ఎప్పుడు విన్నా... దానిద్వారా వచ్చే రాయల్టీని అనుభవించే హక్కు సంగీత దర్శకుడికే రావాలి. అలా రావడాన్ని కాపీరైట్‌ అంటారు. ఎ.ఆర్‌.రెహమాన్‌ బాణీలు అన్నీ ఆయన కాపీరైట్‌ కింద వర్తిస్తాయి. ఇలా చాలామంది వున్నారు. తెలుగులో ఇంకా ఆ స్థాయికి ఎదగలేదు. సినిమా చేసేటప్పుడే మొత్తం ఇంత అని తీసుకుంటాం కానీ.. కాపీరైట్‌ వుందనీ, దానికి హక్కు కావాలని ఏ సంగీత దర్శకుడు అడగడు. అందుకే దాని గురించి పెద్దగా తెలీదు.