శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By ivr
Last Modified: మంగళవారం, 25 నవంబరు 2014 (17:30 IST)

'నా బంగారు తల్లి' ఛాలెంజ్‌లా స్వీకరించాను : రాజేష్‌ టచ్‌రివర్‌

రాజేష్‌ టచ్‌రివర్‌.. ఈ పేరు వినగానే అవార్డు సినిమా దర్శకుడిగా ఇండస్ట్రీకి తెలుసు. పుట్టి పెరిగింది కేరళలోనే అయినా... గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు నివాసం అంతా హైదరాబాద్‌లోనే. తెలుగులో సినిమాలు తీయడానికి ముందు అంతర్జాతీయస్థాయిలో పలు డాక్యుమెంటరీలు తీసి అవార్డులూ పొందారు. ఆయన తీసిన ఇంగ్లీషు చిత్రం 'ఇన్‌ ది నేమ్‌ ఆఫ్‌ ది బుద్ధ'. ఈ చిత్రం అంతర్జాతీయస్థాయిలో పేరు తెచ్చుకుంది. అయితే ఆ సినిమాను చైనా, భారత్‌ ప్రభుత్వం బేన్‌ చేసింది. 
 
అందులో వలసవాదులు, రాజకీయ నాయకుల నేపథ్యంలో వివాదాస్పదంగా మారటమేనని దర్శకుడు రాజీవ్‌ టచ్‌ రివర్‌ చెబుతున్నారు. ఆయన తెలుగులో భార్య సునీతా కృష్ణన్‌ నిర్మాతగా 'నా బంగారు తల్లి' సినిమా చేశారు. దీనికి జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు వచ్చాయి. ఆ చిత్రాన్ని ఈ నెల 21న విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయనతో వెబ్‌దునియా జరిపిన ఇంటర్వ్యూ...
 
'నా బంగారు తల్లి' కాన్సెప్ట్‌ ఎలా తట్టింది? 
దానికి కారణం నా భార్య సునీతాకృష్ణన్‌. ఆమెకు ప్రజల్వ అనే సేవాసంస్థ వుంది. దాని ద్వారా ఇప్పటికి 12 వేల మంది వేశ్యాగృహాల్లో మగ్గుతున్నవారిని రక్షించింది. అందులో రకరకాల కారణాలతో వారు నరక కూపంలోకి వచ్చారు. ఆ కథలన్నింటిలోనూ తండ్రి చేసిన పనులు కూతురు ఎలా పడింది? అనే కథ బాగా నచ్చింది.
 
ఇది ఎక్కడ జరిగింది? 
గోదావరి జిల్లాల్లోని అమలాపురం ప్రాంతంలో. షూటింగ్‌ కూడా అక్కడే చేశాం. కానీ ఈ సినిమా వాస్తవ కథ అని ఎవ్వరికీ తెలీదు. అక్కడ ఆ అమ్మాయి వున్న ఇంటిని పరిసరాలను పరిశీలించాం.
 
కథను అనుకున్నప్పుడు ఇబ్బందులు రాలేదా? 
వచ్చాయి. జరిగిన కథ దాన్ని అలాగే తీస్తే చాలా కష్టం. వేశ్యాగృహాల కథ. దాన్ని అసభ్యత లేకుండా, వయొలెన్స్‌ లేకుండా తీయాలి. అదొక ఛాలెంజ్‌గా స్వీకరించి చేశాను.
 
మీరు కష్టపడి రిలీజ్‌ చేశారు. ప్రేక్షకుల స్పందన ఎలా ఉంది? 
రెస్పాన్స్‌ బాగానే వుంది. ఓపెనింగ్స్‌ రావాలంటే స్టార్స్‌ వుండాలి. కానీ ఈ చిత్రానికి మౌత్‌ పబ్లిసిటీ కావాలి. దానికి కొంత టైమ్‌ పడుతుంది. మొత్తం 100 థియేటర్లలో విడుదల చేశాం. ఈ నెల 27 నుంచి యు.ఎస్‌.లో 7 థియేటర్లలో విడుదల చేస్తున్నాం.

 
జనం దేనికి రియాక్ట్‌ అవుతున్నారు? 
రెగ్యులర్‌ సినిమా కాదు. అవార్డు సినిమా అనే పేరు వచ్చింది. కానీ సినిమా చూశాక.. ఇది ఆర్ట్‌ సినిమా కాదు. కమర్షియల్‌ సినిమా అని మెచ్చుకుంటున్నారు. ఐదేళ్ల పాపతో కూడా సినిమా చూశామని కొంతమంది చెబుతున్నారు. మల్టీప్లెక్స్‌లో పరభాషా ప్రేక్షకులు ఎక్కువే. అందుకే ఆయా థియేటర్లలో ఇంగ్లీషు సబ్‌ టైటిల్స్‌ వేస్తున్నాం. 
 
ఈ సినిమాకు ప్రమోషన్‌ ఎలా చేయబోతున్నారు? 
చిరంజీవిగారు చూశారు. బ్రాండ్‌ అంబాసిడర్‌గా వుంటానన్నారు. నటి సమంత చూశారు. ఇది జనాలు చూడాల్సిన సినిమా అని చెప్పారు. ఎవరికైనా ఎప్పుడైనా జరిగే కథ ఇది అంటున్నారు. అల్లు అరవింద్‌, దాసరి, అమల, నాగబాబు వీరంతా చూసి బాగుందన్నారు.
 
ఇంకా ఏయే ఫెస్టివల్స్‌కు పంపించబోతున్నారు? 
త్వరలో కొల్హాపూర్‌ ఫెస్టివల్‌కు పంపుతున్నాం. జనవరిలో స్క్రీనింగ్‌ వుంటుంది.
 
గోవా ఫెస్టివల్‌కు పంపలేదా? 
2013లో సినిమా చేశాం. దాన్ని ఎలా బయటపెట్టాలనే ఆలోచన, పనుల్లో టైమ్‌ సరిపోయింది. ఆ తర్వాత సాధ్యపడలేదు. అందుకే జాతీయ అవార్డు ఎంపిక జరుగుతున్న సమయంలో ఈ చిత్రాన్ని పంపాం.
 
సినిమా ముగింపు మార్చారా? 
అవును. రియల్‌ కథలో అందరూ చనిపోతారు. దాన్ని అలా చూపించడం ఇష్టంలేదు. అమ్మాయిని సేవ్‌ చేయాలనే ముగింపు అలా ఇచ్చాం. అలా ఇస్తేనే ప్రేక్షకుడు ఆలోచిస్తాడు. 
 
క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా 22 లక్షలు వచ్చాయి కదా. వారికి లాభాలు ఇస్తారా? 
వారి అందరి ఇన్వెస్ట్‌మెంట్‌తో పాటు కలెక్షన్లలో లాభాలు తప్పనిసరిగా ఇస్తాం. అలా అని ముందుగానే చెప్పాం.
 
షేరింగ్‌ చేసే డబ్బు వస్తుందని అనుకుంటున్నారా? 
వస్తుందనే నమ్మకం. జీవితమే నమ్మకం. 
 
సినిమాను ఏ బేస్‌పై రిలీజ్‌ చేశారు? 
రెంటల్‌బేస్‌ పైన కాదు. ఎలా రిలీజ్‌ చేయాలనే సతమతమవుతుండగా రిలయన్స్‌ వారు సహకారం అందించారు.
 
ఇలాంటి కథలు ఇంతకుముందు తీశారా? 
డాక్యుమెంటరీలుగా చేశాను. కలకత్తా కామాటిపురా, ముంబై, ఢిల్లీ ప్రాంతాల్లో పర్యటించాను. కామాటిపురాలో రెండు నెలలు గెస్ట్‌గా వెళ్లేవాడిని.. వారికి నాపై నమ్మకం కలిగాక.. సీక్రెట్‌ కెమెరాతో షూట్‌ చేసేవాడ్ని. దాన్ని బేస్‌ చేసుకుని 'అనామిక' డాక్యమెంటరీ తీశాను. అందులో సీక్రెట్‌ రూమ్‌లు ఎలా వుంటాయి. పోలీసులు వస్తే ఎలా దాక్కుంటారనేది చూపాం. చాలా సీక్రెట్స్‌ అందులో చూపించాం. ఆ ఫిలిం నేషనల్‌ పోలీసు అకాడమీ, జ్యుడిషియల్‌ అకాడమీలో సిలబస్‌గా కూడా పెట్టారు. ఇది 2005లో చేశాను.
 
కమల్‌హాసన్‌ 'మహానది' కామాటిపురాలోనే తీశారు కదా? 
అవును. అది సెపరేట్‌ సబ్జెక్ట్‌. ఓ తండ్రి కథ అది. ఇది అలా కాదు. ఇక్కడ జరిగే విషయాలు బేస్‌గా చేశాను.
 
తదుపరి చిత్రాలు? 
'నా బంగారు తల్లి' చిత్రాన్ని తమిళంలో రీమేక్‌ చేయడానికి అడుగుతున్నారు. ప్రముఖ నటి నటించబోతుందట. ఆ వివరాలు త్వరలో చెబుతాను. ఈ లోగా అంతా యూత్‌తో వారి జీవితాలు చదవు అనంతరం ఎలా వుండబోతున్నాయి? అనే కాన్సెప్ట్‌తో యూత్‌ ఎంటర్‌టైనర్‌ సినిమా తెలుగులో చేయబోతున్నాను. దీనికి బయట నిర్మాతే వుంటారు అని ముగించారు.