బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Modified: మంగళవారం, 8 నవంబరు 2016 (14:08 IST)

హైదరాబాద్, రోమ్... సమంతను ఆవిధంగా చేసుకోబోతున్నా... నాగచైతన్య ఇంటర్యూ

'ప్రేమమ్‌' తర్వాత విడుదలవుతునన అక్కినేని నాగ చైతన్య చిత్రం 'సాహసం శ్వాసగా సాగిపో'. గౌతమ్‌ వాసుదేవ మీనన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రవీందర్‌ రెడ్డి నిర్మించారు. ఈ నెల 11 విడుదలవుతున్న ఈ చిత్రం గురించి నాగచైతన్య పలు విషయాలను వెల్లడించారు.

'ప్రేమమ్‌' తర్వాత విడుదలవుతునన అక్కినేని నాగ చైతన్య చిత్రం 'సాహసం శ్వాసగా సాగిపో'. గౌతమ్‌ వాసుదేవ మీనన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రవీందర్‌ రెడ్డి నిర్మించారు. ఈ నెల 11 విడుదలవుతున్న ఈ చిత్రం గురించి నాగచైతన్య పలు విషయాలను వెల్లడించారు.
 
సినిమా ఆలస్యానికి కారణం?
గత డిసెంబర్‌లో అనుకున్నాం. కానీ తమిళం, తెలుగు భాషల్లో ఏకకాలంలో షూట్‌ చేయడంతో కొంత జాప్యం జరిగింది. అదీకాకుండా మంచిరోజు సమయం చూసుకుని విడుదల చేయడంతో జాప్యం జరిగింది.
 
'ప్రేమమ్‌' వంటి సాఫ్ట్‌ చిత్రం చేశాక యాక్షన్‌ చిత్రం చేయడానికి ఎలా సన్నద్ధం అయ్యారు?
ముందుగా ఈ సినిమానే విడుదల కావాల్సి వుంది. ఆలస్యం కావడంతో.. ప్రేమమ్‌.. ముందుకు వచ్చింది. 'ప్రేమమ్‌' తర్వాత నాకు నటుడిగా చాలా నమ్మకం పెరిగింది. ప్రేక్షకుల ఆదరణ పట్ల చాలా సంతోషంగా వున్నాను. ఇలాంటి టైమ్‌లో కొత్త తరహా చిత్రం రావడం ఆనందంగా వుంది. 
 
ప్రేమమ్‌ తర్వాత చిత్రాల్లో ఏమైనా మార్పులు చేస్తున్నారా?
ప్రేమకథలే నాకు కంఫర్ట్‌గా వుంటాయి. వాటిని చేయడంలో నమ్మకంతో పాటు వినూత్నంగా వుండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను.
 
ఈ సినిమా ఎలా వుంటుంది?
'ఏ మాయ చేశావే'కు కొనసాగింపులా వుంటుంది. అందులో కాలేజీ చదివే కుర్రాడిగా చేస్తే.. ఇందులో కాలేజీ అయ్యాక.. జీవితం కెరీర్‌ ఎలా వుండాలనే ప్లాన్‌ చేసుకునే పాత్ర. రెండో భాగంలో యాక్షన్‌ వుంటుంది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ అంశాలతో రూపొందింది.
 
యాక్షన్‌ చిత్రాలు ప్రేక్షకులు అంగీకరిస్తారంటారా?
గౌతమ్‌ గారు.. ప్రేక్షకుడు పాత్రలో లీనమయ్యేట్లుగా తీయగలరు. ఒకరకంగా కొత్తగా వుండే కథ ఇది. హీరో, హీరోయిన్‌కు ఏదైనా ప్రాబ్లమ్‌ వస్తే ఎలా డీల్‌ చేస్తాడనేది కథ.
 
రోడ్‌ జర్నీ కథేనా?
అవును.. మొదటిభాగం 30 నిముషాలు రోడ్‌ జర్నీ. ప్రేమ కూడా అక్కడే మొదలవుతుంది. అలాంటి సమయంలో హీరోయిన్‌ సమస్యలో ఇరుక్కుంటుంది. దాన్ని హీరో ఎలా సాల్వ్‌చేశాడనేది పాయింట్‌.
 
వేరియేషన్ ఎలా చూపించారు?
గౌతమ్‌ గారు 'ఏమాయచేశావే'తో ప్రేమకథలో నమ్మకం పెంచారు. ఇప్పుడు యాక్షన్‌ జోనర్‌ కూడా అంగీకరించేట్లుగా ఆయన పాత్రను తీర్చిదిద్దారు. అందుకోసం ఫిజికల్‌గా.. బాడీని మార్చుకున్నాను.
 
కెరీర్‌ ఆరంభంలో యాక్షన్‌ చేశారు కదా?
అప్పుడు ట్రై చేశాను. ఫలితం రాలేదు. ఒకరకంగా అప్పటికి నాకు మెచ్యూరిటీ రాలేదు.. ఆన్‌ స్క్రీన్‌ బాగాలేదనిపించింది. ఇప్పటికి 13 సినిమాలు చేశాను. నటుడిగా మెచ్యూరిటీ వచ్చింది. గౌతమ్‌గారి దర్శకత్వంలోకాబట్టి పూర్తి నమ్మకంతో వున్నాను.
 
ఎలాంటి యాక్షన్‌ అంటే ఇష్టం?
ఏదైనా రియలిస్టిక్‌గా వుంటేనే ప్రేక్షకులు చూస్తారు. నాకు అలాగే ఇష్టం.
 
ఇంకా ఎలాంటి పాత్రలు చేయాలనుంది?
సినిమా సినిమాకు అదే పాత్ర చూస్తే బోర్‌ కొడుతుంది. అందుకే వేరియేషన్‌ వుండాలి. అలాంటి పాత్రల కోసం ఎదురుచూస్తుంటా.
 
రెహమాన్‌ మ్యూజిక్‌ ఎలా అనిపిస్తుంది?
నా రెండో సినిమాకు ఆయన బాణీలు చేయడం ఆనందంగా వుంది.
 
తెలుగులో మార్పులు చేశారా?
రెండు భాషల్లో పెద్దగా మార్పులు లేవు.
 
కొత్త హీరోయిన్‌ ఎలా నటించింది?
కొత్తవారయినా వారితో నటించేలా చేయించడమే దర్శకుడి ప్రతిభ. అలా గౌతమ్‌గారు చేశారు.
 
తమిళ హీరోలు ఇక్కడ ట్రై చేస్తున్నారు. మరి మీరు?
తమిళంలో ఈ సినిమా 50 రోజులు షూట్‌ చేశాక.. గౌతమ్‌గారిని నేను అడిగాను. తర్వాత సినిమా తప్పకుండా తమిళంలో చేయాలనుందని. నా ఆఫర్‌ను ఆయన స్వీకరించారు. ఎందుకంటే మన కథలన్నీ అక్కడ కూడా సూటవుతాయి.
 
ఈమధ్య మీ కుటుంబసభ్యులు గెస్ట్‌రోల్స్‌ చేస్తున్నారే.. ఇందులో కూడా?
లేదు. మా బేనర్‌.. మా ఫ్యామిలీ హీరోలు కాబట్టి కొన్ని చిత్రాల్లో చేశాం.
 
సమంత మీరు ఎక్కువ షాపింగ్‌ చేస్తున్నారా?
వీలు చిక్కినప్పుడల్లా చేస్తున్నాం.
 
తను ఐస్‌క్రీమ్‌ ఫ్యాన్‌ అని మీతో పాటు వున్న ఫొటో పెట్టింది.. మీరు కూడా?
లేదు. నేను పెద్దగా ఐస్‌క్రీమ్‌లు తినను. తనకిష్టం. 
 
అఖిల్‌ పెండ్లి ముందుగా జరగడం వల్ల ఫీల్‌ కావడంలేదా?
చాలా హ్యాపీగా వున్నాను. అందరి దృష్టి అఖిల్‌పై వుంటుంది. ఆ తర్వాత నాది. కాబట్టి క్యాజువల్‌గా తీసుకుంటారు. పెద్దగా దృష్టిపెట్టరు.
 
పెండ్లి ఎక్కడ చేసుకుంటున్నారు?
ఎంగేజ్‌మెంట్‌ మాత్రం ఇక్కడే.. పెళ్లి రోమ్‌లో చేసుకోవాలని.
 
అంటే రెండు రకాల పెళ్లిళ్లు చేసుకుంటారా?
ఏమాయ చేసావే.. చిత్రంలోలా నాకు రిపీట్‌ అవుతుంది.
 
కళ్యాణకృష్ణ సినిమా ఎంతవరకు వచ్చింది?
రేపే ప్రారంభం కాబోతుంది.
 
అది పంజాబీ సినిమానా?
కాదు. కొత్త కథ. 'నిన్నే పెళ్ళాడుతా' తరహాలో చాలా సరదాగా వుంటుంది.
 
పెళ్లయ్యాక సమంతతో నటిస్తారా?
ఇద్దరినీ ఆకర్షించే కథ దొరికితే తప్పకుండా.
 
హలోబ్రదర్‌ రీమేక్‌ ఏమయింది?
ముందు చేద్దాం అనుకున్నాం. కానీ జరగదు. అది క్లాసిక్‌ మూవీ. ఆ లెవల్‌లో నేను చేయలేను. దర్శకత్వం కూడా అలా వుండకపోవచ్చు. అందుకే ముట్టుకోవడం కరెక్ట్‌కాదు.
 
విలన్‌ పాత్రలు పోషిస్తారా?
తప్పకుండా.. నన్ను ఎట్రాక్ట్‌ చేసే పాత్ర దొరికితే తప్పకుండా.
 
కొత్త దర్శకులతో చేస్తారా?
తప్పకుండా. సురేష్‌ ప్రొడక్షన్‌లో చేసేవి అన్నీ కొత్తవారితోనే.
 
పాత టైటిల్స్‌ రిపీట్‌ చేస్తున్నారు?
కథకు అవి అలా సూటవుతున్నాయంతే అని చెప్పారు.