గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Modified: మంగళవారం, 28 ఏప్రియల్ 2015 (22:17 IST)

సక్సెస్‌లు ఎప్పుడో కానీ రావు : నాగచైతన్య ఇంటర్వ్యూ

''ఇండస్ట్రీకి వచ్చి ఆరేళ్లు అవుతుంది. ప్రతి సినిమాకి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉన్నాను. అలా నేర్చుకోవాల్సిన అవసరం నటుడిగా ఎంతైనా ఉంది. అందుకు చాలా కష్టపడాలి. ప్రతి సినిమాకి మనం ఏదైనా కొత్తగా చూపించాలి అప్పుడే ప్రేక్షకులు మనల్ని అంగీకరిస్తారని'' అంటున్నాడు నాగచైతన్య. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై నాగచైతన్య, కృతి సనన్‌ హీరోహీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'దోచేయ్‌'. ఈ నెల 24న విడుదలైన ఈ చిత్రం మంచి సక్సెస్‌ టాక్‌తో ప్రదర్శించబడుతోంది. ఈ సందర్భంగా నాగ చైతన్య విలేకరులతో ముచ్చటించారు.
 
క్లాస్‌ ఆడియన్స్‌‌కి బాగా కనెక్ట్‌ అయింది...
'దోచేయ్‌' సినిమా  ట్రైలర్స్‌ చూసినప్పుడు అందరు సీరియస్‌ మూవీ అనుకున్నారు. కానీ ఇది పూర్తి వినోదాత్మక సినిమా. సినిమా కథ విన్నప్పుడు క్లాస్‌, మాస్‌ కథ అని చూడను. అందరికి కనెక్ట్‌ అయితే అది మాస్‌ మూవీ కొందరికే కనెక్ట్‌ అయితే క్లాస్‌ మూవీ. ఈ సినిమా మొదట్లో 'ఎ' సెంటర్స్‌‌లో బాగా ఆడింది. చివరి రెండు రోజుల నుండి రెగ్యులర్‌ ఆడియన్స్‌ కూడా బాగా రిసీవ్‌ చేసుకుంటున్నారు. 
 
సబ్జెక్ట్‌ బావుందని..
ఇదొక క్రైమ్‌, కామెడీ చిత్రం. సినిమా కథ విన్నప్పుడు చాలా కొత్తగా అనిపించింది. ఈ తరహా చిత్రంలో నటించాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాను. కానీ కెరీర్‌ మొదట్లోనే ఇలాంటి ప్రయోగాలు చేయడానికి సాహసించలేకపోయాను. ఇప్పుడు సుధీర్‌ చెప్పిన సబ్జెక్టు బావుందని మొదటిసారిగ ఇలాంటి పాత్రలో నటించాను. కొంతకాలంగా నేను గమనించింది ప్రేక్షకులు కొత్తదనాన్ని ఆదరిస్తున్నారని కనుక.. ఇలాంటి సబ్జెక్టు కూడా ఆదరిస్తారనిపించి సినిమా చేసాం.
 
బైక్‌ ఛేజ్‌ చాలా ఎంజాయ్‌ చేసాను..
సెకండ్‌ హాఫ్‌లో వచ్చే బైక్‌ ఛేజ్‌ సీన్‌ చాలా ఎంజాయ్‌ చేసాను. నాకు బైక్‌ రైడ్స్‌ అంటే ఇష్టం. సినిమా స్క్రీన్‌ప్లేకు ఛేజ్‌ లెంగ్త్‌ ఎక్కువ ఉంటే బావుంటుందనీ, కరెక్ట్‌గా వుంటుందని ఎక్కువ సమయం తెరపై చూపించారు. ఇందులో నా ప్రమేయం ఏమీలేదు. సినిమా కోసం స్పెషల్‌ హోమ్‌ వర్క్‌ చేయలేదు. సుధీర్‌ కొంచెం స్టైలిష్‌‌గా కనిపించాలి అన్నాడు. అందుకే హెయిర్‌ స్టైల్‌, కాస్ట్యూమ్స్‌‌పై కొంచెం ఎక్కువ ఫోకస్‌ చేసాను. నేను ఇప్పటివరకు చేసిన సినిమాలలో ఎక్కువగా డాన్సులు లేవు. ఈ సినిమా ఇంట్రడక్షన్‌ సాంగ్‌, ఐటెం సాంగ్‌‌లలో నాకు డాన్స్‌ చేసే అవకాశం వచ్చింది. కొంచెం కేర్‌ తీసుకొని చేసాను.
 
కథలో భాగంగా..
సినిమాలో హీరోయిన్లకు ప్రాధాన్యత ఉండదు. కానీ ఈ సినిమాలో కృతి కూడా కథలో భాగంగా అన్ని సన్నివేశాలలో ఉంటుంది. సినిమాకి ఎంటర్‌‌టైన్మెంట్‌ ప్లస్‌ అయింది. పోసాని పాత్ర, బ్రహ్మానందం పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
 
నేనేం ఎక్స్‌‌పెక్ట్‌ చేయలేదు..
ఈ సినిమాకి ఏం రెస్పాన్స్‌ వస్తుందో మొదట్లో ఆలోచించలేదు. ఎలాంటి అంచనాలు లేవు. ఇది టిపికల్‌ తెలుగు సినిమాలా 6 పాటలు, ఎక్కువ ఫైట్స్‌‌లా వెళ్ళలేదు. కంటెంట్‌ స్ట్రాంగ్‌గా ఉంది. ఎంటర్‌‌టైన్మెంట్‌ ఉంది. అయితే పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తుందనుకున్నాం. 
 
ఫెయిల్యూర్‌ అనేది మంచిదే..
ఈ ఇండస్ట్రీలో సక్సెస్‌ అనేది ఎప్పటికి వస్తుందో తెలియదు. ఫెయిల్యూర్‌ అనేది మంచిదే అది వచ్చినప్పుడు ఏం తప్పులు చేసామో తెలుసుకొని తరువాత వాటిని మళ్ళీ చేయకుండా ఉంటాం. విమర్శల్ని పాజిటివ్‌‌గా తీసుకుంటాను.
 
ఎక్స్‌‌పెరిమెంటల్‌ సినిమాలు చేస్తా..
భవిష్యత్తులో కూడా ఇలాంటి ఎక్స్‌‌పెరిమెంటల్‌ సినిమాలు చేస్తాను. రిస్క్‌ ఉంటేనే గ్రోత్‌ ఉంటుంది. యూనిక్‌ స్టైల్‌ వస్తుంది. నాన్నగారు నటించిన 'గీతాంజలి' వంటి ప్రయోగాత్మక సినిమా ఎంత పెద్ద హిట్‌ అయిందో అందరికీ తెలిసిందే. ఏ టైంలో హిట్‌ వస్తుందో చెప్పలేము.
 
తదుపరి చిత్రాలు
ప్రస్తుతానికి కార్తికేయ సినిమా డైరెక్టర్‌ చందు మొండేటితో ఓ స్క్రిప్ట్‌ వర్క్‌‌లో ఉంది. గౌతమ్ మీనన్‌తో కూడా మాటలు జరుగుతున్నాయి.