శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Updated : మంగళవారం, 6 అక్టోబరు 2015 (21:22 IST)

రుద్రమదేవి నిర్మించేందుకు ఏ నిర్మాతా ముందుకు రాలేదు... అందుకే నేనే తీశా... గుణశేఖర్‌

'ఒక్కడు' తర్వాత తన రేంజ్‌ పెరిగిందనీ, అయినా దాన్ని సరిగ్గా క్యాష్‌ చేసుకోలేకపోయానని దర్శకుడు గుణశేఖర్‌ తెలియజేస్తున్నాడు. ఆ తర్వాత రుద్రమదేవి చరిత్రను చేయాలనుకున్నా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చిందని చెబుతున్నారు. బాహుబలి సినిమాకు ముందే మా చిత్రం చిత్రీకరణ ప్రారంభమైంది. దానికంటే ముందుగానే విడుదల కావాల్సి వున్నా.. టెక్నికల్‌గా కొన్ని ఇబ్బందుల వల్ల విడుదల చేయలేకపోయామనీ... అయినా బాహుబలి వల్ల జాతీయస్థాయిలో మార్కెట్‌ మా సినిమాకు కలిసివచ్చిందని చెబుతున్నారు. 
 
అనుష్క ప్రధాన పాత్రలో టైటిల్‌ రోల్‌లో గుణా టీమ్‌ వర్క్స్‌ పతాకంపై శ్రీమతి రాగిణీ గుణ సమర్పణలో డైనమిక్‌ డైరెక్టర్‌ దర్శక నిర్మాతగా రూపొందుతున్న భారతదేశపు తొలి హిస్టారికల్‌ స్టీరియోస్కోపిక్‌ 3డి ద్విభాషా చిత్రం రుద్రమదేవి. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈనెల 9న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా మంగళవారంనాడు దర్శకుడు గుణశేఖర్‌తో ఇంటర్వ్యూ సారాంశం.
 
రుద్రమదేవి సినిమా కమర్షియల్‌గా వర్కవుట్‌ అయ్యే ప్రాజెక్ట్‌ అన్న నమ్మకం ఎలా కలిగింది? 
వాస్తవంగా ఈ సినిమాని గోన గన్నారెడ్డి పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో తీస్తే అది కమర్షియల్‌గా వర్కవుటవుతుందని కొందరు నిర్మాతలు సలహాలిచ్చారు. కానీ నాకు రుద్రమదేవి కథ మాత్రమే కనిపించింది. ఇంకా చెప్పాలంటే రుద్రమదేవి వీరత్వం, సెన్సిబిలిటీస్‌ కనిపించాయి. ఈ చిత్రం ఒక్కడును మించిన కమర్షియల్‌ సినిమా. రుద్రమదేవి కాలిబర్‌ని నమ్మి నేనే నిర్మాతగా సినిమాని ప్రారంభించాను. పెద్దపెద్ద స్టూడియోల ఓనర్లు తీయాల్సిన చిత్రాన్ని నేను తీసే సాహసం చేశాను. నన్ను నేను అంత బలంగా నమ్మి చేశాను. టెక్నాలజీ పరంగానూ ఎంతో అప్‌డేట్‌ అయ్యాను. 
 
ప్రాజెక్టు ఇంత ఆలస్యానికి కారణం?
ఈ కథని సినిమాగా తియ్యడానికి ఏ నిర్మాతా ముందుకు రాలేదు. అందుకే ఈ సినిమాకి నేనే నిర్మాతనయ్యాను. నిజానికి ఒక్కడు తర్వాత రుద్రమదేవి చిత్రం తీయాలనుకున్నా. 'సూపర్‌హిట్‌'లో అనౌన్స్‌మెంట్‌ కూడా వచ్చేసింది. ఆ తర్వాత ప్రి-ప్రొడక్షన్‌ మొదలైనా మధ్యలో నిర్మాతలు వర్కవుటవ్వదని వెనకడుగు వేశారు. 2004లో 20-25కోట్ల బడ్జెట్‌ని ఒక హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాపై పెట్టలేమన్నారు. గోన గన్నారెడ్డి పాత్ర ఆధారంగా సినిమా తీస్తే కమర్షియల్‌గా వర్కవుటవుతుంది అని అన్నారు. కానీ నాకు అది నచ్చలేదు. రుద్రమదేవి కథకే ప్రాధాన్యతనిచ్చాను. నా దృష్టిలో రుద్రమదేవి కథే కమర్షియల్‌. ఒక్కడు విజయంతో సౌత్‌లోనే అత్యధిక పారితోషికం అందుకునే స్థాయిలో ఉండి.. డిఫరెంట్‌ ఆలోచన చేశాను. అయితే ఒక్కడు తర్వాత అనూహ్యంగా గ్రాఫ్‌ తగ్గడం ఇబ్బంది పెట్టింది. రుద్రమదేవి ఆలోచనల వల్లే దర్శకుడిగా స్టక్‌ అయ్యాను. అందుకే ఆ తర్వాత డేర్‌ స్టెప్‌ వేసి నేనే సినిమాని నిర్మించాను. రుద్రమదేవి కథే నన్ను డ్రైవ్‌ చేసింది. ఒక విధంగా చెప్పాలంటే ఒక్కడుని మించి పదింతలు కమర్షియల్‌ ప్రాజెక్టు ఇది. 
 
3డి టెక్నాలజీపై శిక్షణ పొందారని విన్నాం...
3డి విద్య కోసం లండన్‌లో క్రాస్‌కోర్స్‌ నేర్చుకున్నా. జర్మనీ వెళ్లి ట్రయల్‌ షూట్‌ చేశాను. ముందే పక్కాగా అవగాహన తెచ్చుకున్నాకే సెట్స్‌కెళ్లాం. 
 
రుద్రమదేవిగా అనుష్కనే మొదటి ఆప్షన్‌గా అనుకున్నారా? 
రుద్రమదేవి అనుకోగానే ఆ పాత్రలో ఎవరు సరిపోతారు? అని వెతికాను. అనుష్క అయితే అరుంధతి ప్రభావం ఉంటుందని ఆలోచించా. కానీ చివరికి ప్రజల నుంచి అనుష్క అయితేనే బావుంటుందని స్పందన వచ్చింది. అలాగే గోన గన్నారెడ్డి పాత్ర కోసం మహేష్‌, ఎన్టీఆర్‌ ఎవరినీ సంప్రదించలేదు. ఇద్దరికీ ముందు నుంచి కథ తెలుసు. ఆసక్తి ఉందని చెప్పారు. కలిసి ఎప్పటికప్పుడు మాట్లాడుకునేవాళ్లం. అయితే ఈలోగానే మీడియాలో ప్రచారం అయిపోయింది. ఆ తర్వాత బన్ని తనంతట తానుగానే ఆసక్తి ఉందని ముందుకు వచ్చాడు. బన్ని ఓ మూవీ లవర్‌. నేను ఈ ప్రాజెక్టులో ఉంటాను. ఎలా ఉపయోగించుకుంటారో మీ ఇష్టం అని అన్నాడు. వరుడు లాంటి ఫ్లాప్‌నిచ్చినా నా పనితనంపై నమ్మకంతో ఆ అవకాశం ఇచ్చాడు. రేసుగుర్రం లాంటి హిట్‌ కొట్టాక.. ఫోన్‌ కాల్‌ దూరంలో ఉన్నాను పిలిస్తే చాలు అన్నాడంటే అది బన్ని గొప్పతనం. బన్ని ఓ చట్రంను దాటి, ఇమేజ్‌ని వదిలి ఈ పాత్రలో నటించాడు. 
 
70 కోట్ల భారీ బడ్జెట్‌ మూవీని ఎలా చెయ్యగలిగారు? 
అందరూ అనుకుంటున్నదేమిటంటే గుణశేఖర్‌కి ఏదో నిధి దొరికింది. అందుకే అంత భారీ బడ్జెట్‌తో సినిమా చేస్తున్నాడు అని. అవును. నాకు నిధి దొరికింది. నాకు దొరికిన గుప్తనిధి రుద్రమదేవి కథే. ఈ కథను నమ్మే 80 కోట్ల బడ్జెట్‌ ఈ సినిమాపై పెట్టగలిగాను. 
 
స్టీరియోస్కోపిక్‌ 3డి ప్రత్యేకత?
స్టీరియోస్కోపిక్‌ 3డి అంటే షూట్‌ చేసేడప్పుడే 3డిలో చేయాలి. మామూలుగా 2డి సినిమాల్ని 3డిలకు మార్చడం వంటిది ఈ ఫార్మాట్‌లో కుదరదు. స్టీరియో స్కోపిక్‌ 3డికి రెండు కెమెరాలు ఒకేసారి పనిచేస్తాయి. ఎడమ కన్ను, కుడి కన్ను .. రెండింటికి రెండు లెన్సులు వేయాలి. రెండు ఫ్రేముల్ని మెర్జ్‌ చేసి ఒకేసారి చిత్రీకరిస్తారు. 2డి నుంచి 3డి కన్వర్షన్‌ చేసిన దానికంటే ఇలా తీసిన 3డి హైలీ క్వాలిటీతో కనిపిస్తుంది. 
 
చారిత్రక సినిమా అందులోనూ రుద్రమదేవి ఆలోచన ఎలా వచ్చింది?
నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నప్పుడు తెలుగు ఉపవాచకంలో రుద్రమదేవి కథ ఉండేది. అప్పుడే రుద్రమదేవి చరిత్ర గురించి తెలిసింది. అందులో పాత్రలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. కథ బాగా ఆకర్షించింది. చదువు పూర్తయ్యాక చెన్నైకు వెళ్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశాను. ఆ సమయంలో 'బ్రేవ్‌ హార్ట్‌' అనే సినిమా చూసి చాలా ఇన్స్పైర్‌ అయ్యాను. తెలుగులో ఇలాంటి చిత్రాలు ఎందుకు రావట్లేదనుకున్నాను. అప్పుడే రుద్రమదేవి చరిత్రను సినిమాగా తెరకెక్కించాలనుకున్నాను. 
 
సినిమా ద్వారా సరైన చరిత్రను చెప్పడం కష్టమేగా.. మరి మీ సినిమాలో..?
అసలు చరిత్రను వక్రీకరించి చెప్పడం కష్టమైన పని. సినిమాపరంగా కొన్ని మార్పులు కొన్ని చిత్రాల్లో చేయవచ్చునేమోకానీ.. మా చిత్రం పుస్తకాల్లో ఎలా వుందో అలా చెప్పే ప్రయత్నం చేశాం. 13వ శతాబ్దానికి చెందిన కాకతీయుల కథ ఇది. చరిత్ర గురించి ఎన్నో పుస్తకాలు చదివాను. కొన్ని పుస్తకాల్లో కన్ఫ్యూజన్స్‌ ఉండటంవలన రీసెర్చ్‌ టీం ఏర్పాటు చేసుకున్నాను.  ముదిగొండ ప్రసాద్‌ ఎంతగానో సహకరించారు. కేవలం పుస్తకాల మీదే ఆధారపడకుండా కాకతీయుల కాలంనాటి శిలాశాసనాలను ప్రేరణగా తీసుకొని కథను రూపొందించాను. ఈ కథ నిడివి రెండు గంటల ముప్పై ఏడు నిమిషాలు. గొప్ప స్పూర్తినిచ్చే చరిత్రను కేవలం రెండు గంటల సమయంలో చూపించడం చాలా కష్టమైన విషయం. ఎంతో సాహసంతో కూడుకున్న పనది. అయితే ఈ చరిత్ర ద్వారా నేను ప్రభావితం అయిన విషయాలను ప్రాధాన్యంగా తీసుకొని ప్ర్రేక్షకులను ప్రభావితం చేసే విధంగా కథను మలిచాను. రుద్రమదేవి పుట్టుక నుండి ఆవిడ విజయానికి కారణమైన ఓ ఘట్టాన్ని ఈ చిత్రంలో చూపించబోతున్నాం. 
 
నిర్మాతగా మారడానికి ప్రధాన కారణం?
'ఒక్కడు' తరువాత ఎక్కువ రెమ్యునరేషన్‌ ఆఫర్‌ చేయబడ్డ దర్శకుడ్ని నేను. ఆ సమయంలో కూడా నేను రుద్రమదేవి సినిమా చేయలేకపోయాను. ఎన్ని సినిమాలు చేస్తున్నా.. నాకు తృప్తిగా అనిపించలేదు. రుద్రమదేవి చిత్రం కోసం ఎంత బడ్జెట్‌ అవుతుందో తెలిసే సినిమా చేయడానికి సిద్ధపడ్డాను. సినిమా మేకింగ్‌ మీద నాకు ఎలాంటి ఒత్తిడి లేదు. స్వంతంగా అయితే బాగా తీయలగలనే నమ్మకంతో చేశాను. నిర్మాణ భాధ్యతలు మొత్తం నా భార్యే చూసుకుంది. 
 
3డిలో ఎందుకు చేయాలనుకున్నారు?
3డిలో చేయడం వలనే కాస్త రిస్క్‌ అనిపించింది. చాలా మంది 3డి చేయడం ఆపేద్దామని సలహా ఇచ్చారు. కాని నాకు మధ్యలో వొదిలేయడం ఇష్టంలేదు. హిస్టారికల్‌ జోనర్‌ చిత్రాన్ని 3డిలో కూడా చూపించాలనుకున్నాను. నేను చూడాలని వుంది సినిమాలో మొదటిసారిగా డిటిఎస్‌ టెక్నిక్‌ను ఇంట్రడ్యూస్‌ చేసాను. అప్పటి రోజుల్లోనే 25 లక్షల అదనపు ఖర్చు పెరిగింది. కాని నిర్మాత నన్ను నమ్మి సినిమా చేసారు. 'చూడాలని వుంది' సినిమా రిలీజ్‌ అయిన తరువాత డిటిఎస్‌ లేని సినిమా రాలేదు. అలానే 'సైనికుడు' సినిమాలో డిఐ టెక్నిక్‌ పూర్తిస్థాయిలో ఉపయోగించాను. దానికోసం ప్రత్యేకంగా హాలీవుడ్‌ టెక్నీషియన్‌ను పిలిపించాం. ఆ సినిమా విడుదల తరువాత డిఐ లేని సినిమా రాలేదు. రుద్రమదేవి సినిమా కోసం స్టెప్‌ ముందుకువేశాం. 3డితో ఇంకా పెద్ద స్టెప్‌ వేసాం. చాలా కష్టాలు ఎదుర్కొన్నాం. రిలీజ్‌ డేట్‌ రెండు మూడు సార్లు మార్చడానికి కారణం కూడా అదే. సోషల్‌ ఫిలిం అయితే నేను 3డి చేసేవాడ్ని కాదు. హిస్టారికల్‌ ఫిలిం కాబట్టే 3డి చేసాను.
 
'బాహుబలి' చిత్ర ప్రభావం మీ చిత్రంపై వుంటుందా?
'బాహుబలి'కి ముందే 'రుద్రమదేవి' చిత్రం మొదలయ్యింది. ఆ సినిమా రిలీజ్‌కు ముందే మా సినిమా బిజినెస్‌ దాదాపుగా పూర్తయింది. కాకపోతే ఆ సినిమాతో కొత్తఒరవడి పలికింది. బాహుబలి విజయం కారణంగానే రుద్రమదేవి హిందీలో మార్కెట్‌ చేసేందుకు అవకాశం లభించింది. ఆ చిత్రం ప్రభావం నెగెటివ్‌ అయితే మా చిత్రానికి వుండదు. ప్రేక్షకులు ఊహించని విధంగా తీశాం.
 
అనుష్కనే ఎందుకు తీసుకున్నారు?
అనుష్క లేకపోతే రుద్రమదేవి సినిమా లేదు. ఆమె గత చిత్రాల్లో నటించిన రాణిదర్పం చూపే పాత్రలు ఎంతగానే ఆకట్టుకున్నాయి. 
 
రెండు రాష్ట్రాల విభజన తరువాత సినిమాలో ఏమైనా మార్పులు చేసారా?
రుద్రమదేవి ఎన్నో సంవత్సరాల క్రిందటి చరిత్ర. దానికి ప్రాతీయ బేధాలు లేవు. విభజన తరువాత నేను ఎలాంటి మార్పులు చేయలేదు. సెన్సార్‌ సభ్యులు కూడా సినిమా చూసి ఎలాంటి మార్పులు చేయమని చెప్పలేదు. వారు సెన్సార్‌ చేసినప్పుడు వారి మధ్య చరిత్రకారులు ఉండేలా జాగ్రత్త పడ్డారు. 
 
దీనికి సీక్వెల్‌ ఆలోచన వుందా?
నిజానికి ప్రతాపరుద్రుడు కాకతీయుల వంశంలో చివరిగా పరిపాలించిన రాజు. పరిస్థితులు అనుకూలిస్తే ఖచ్చితంగా సీక్వెల్‌ చేయాలనే ఆలోచన ఉంది అని చెప్పారు.