గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By DV
Last Updated : బుధవారం, 25 ఫిబ్రవరి 2015 (13:58 IST)

నా డెడ్‌బాడీని ఇండస్ట్రీకి చూపించొద్దని చెప్పా, దాసరికి కౌంటరిచ్చా... పోసాని ఇంటర్వ్యూ

పోసాని కృష్ణమురళి అంటేనే... టెంపరోడు, ముక్కుసూటిగా మాట్లాడతారు. శాడిస్టు వంటి పదాలు ఆయన గురించి సరదాగా మాట్లాడుకుంటుంటారు. అంతకు తగినట్లుగానే భార్యను హింసించే శాడిస్టుగా కూడా నటించి మెప్పించాడు. ఇవన్నీ ఒక ఎత్తయితే ఎంత పెద్ద వ్యక్తినయినా నిలదీసే తత్త్వం ఆయనది. ఓ దశలో రామోజీరావునే నిలదీశానని చెబుతున్న 'మెంటల్‌ కృష్ణ' చెబుతున్న సెన్సేషనల్‌ విషయాలు. వెబ్‌దునియా ప్రత్యేక ఇంటర్వ్యూ మీకోసం.
 
శ్రీనగర్‌ కాలనీ, జూబ్లీహిల్స్‌ వదిలి అమీర్‌పేటకు మారడానికి ప్రత్యేక కారణం ఏమైనా వుందా? 
మీరనుకున్నట్లు వాస్తు దోషం వల్ల మాత్రం రాలేదు. ఫెయిల్‌ అయినా సక్సెస్‌ అయినా మనం వుండే ప్రాంతాన్ని బట్టి వస్తుందంటే అందరూ అక్కడికే వచ్చేస్తారు. ఇంతకుముందు ఇండస్ట్రీకి దగ్గరగా వుండాలని అక్కడ వున్నాను. ఇప్పుడూ అంతే దగ్గరగా వున్నాను. దూరమని భావించడంలేదు. 
 
దర్శకునిగా చేయకపోవడానికి కారణమేమైనా వుందా? 'శ్రావణ మాసం' చిత్రం దర్శకనిర్మాతగా ఫెయిలే కారణమా? 
కానేకాదు. ఫెయిల్‌ సక్సెస్‌లు ఇక్కడ మామూలే. అప్పట్లో ఆ చిత్రానికి భారీ తారాగణం. భారీ బడ్జెట్‌ అయింది. ఎక్కడో ఏదో లోపంతో అది ప్రేక్షకులకు దగ్గరకు చేరుకోలేకపోయింది. ఇక దర్శకుడిగా అంటారా.. ప్రస్తుతం రచయితగా కంటే కూడా నటుడిగా నాకు మంచి గుర్తింపు వచ్చింది. నేను నటించిన పాత్రల్లో ఏదీ ఫెయిల్‌ కాలేదు అని పేరు తెచ్చుకున్నాను. బహుశా ఏ రచయితకూ దర్శకుడికీ రాని పేరు నాకు నటుడిగా రావడం అదృష్టంగా ఫీలవుతున్నాను.
 
ఎన్‌టిఆర్‌ 'టెంపర్‌' ఎంత పేరు తెచ్చింది? 
ఇండస్ట్రీలో చాలామంది ఫోన్లు చేసి హీరోతో సరిసమానంగా చేశావ్‌ అని మెచ్చుకున్నారు. 3వేలకు పైగా ఫోన్లు వచ్చాయి. ఇంకా వస్తూనే వున్నాయి. దాసరి గారైతే సినిమా చూసి.. మురళీ, చాలా ఆనందంగా వుందయ్యా. సినిమాల్లో నువ్వు కూడా హీరోలా చేశావ్‌. సినిమా అయ్యాక నువ్వే గుర్తుకు వచ్చావ్‌! అని మెచ్చుకున్నారు. ఇలా ఒక్కరేమిటి? అంతా మెచ్చుకున్నవారే..

 
అదే దాసరిగారికి గతంలో ఝలక్‌ ఇచ్చారు కదా? 
దానికీ ఓ కారణముంది. నేను స్ట్రెయిట్‌ ఫార్వొడ్‌. దాసరిగారు దర్శకనిర్మాతగా 'గ్రీకు వీరుడు' అనే సినిమాను దాసరి అరుణ్‌ కుమార్‌తో తీస్తున్నారు. దానికి నేను కథ ఇచ్చాను. సినిమా తీసేటప్పుడు డబ్బులు అడిగాను. రచయితగా అడగాలి కదా సార్‌... దానికి ఆయన 'నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా!' అన్నారు. 'మీరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా.. పోసానిని' అని ఎదురు కౌంటర్‌ వేశా.. (చెప్పండి బ్రదర్‌. ఇలా అడగటం తప్పా!.). 
 
ఆ తర్వాత రచయితగా నా పేరు తీసేసి మరొకరి పేరు పెట్టారు. నేను వెంటనే దాసరి గారి ఇంటికి వెళ్ళి.. నా కథకు ఎవరో పేరు పెట్టారు. నా కథ నాకు ఇచ్చేయండి అని అడిగాను. ఇదీ జరిగింది. ఆ తర్వాత ఆయన నా గురించి మాట్లాడిందీ లేదు. నేను ఆయన గురించి చెప్పిందీ లేదు. అప్పుడు సమస్యలున్నట్లే ఇప్పుడూ సంబంధాలున్నాయి. ఈయనే కాదు.. నేను గతంలో పరుచూరి బ్రదర్స్‌ దగ్గర పని చేశాను. నచ్చకపోతే వారితో గట్టిగానే మాట్లాడతాను.
 
ఏదిఏమైనా మీరు వివాదాస్పద వ్యక్తిగా ప్రత్యేక గుర్తింపు వుంది. దీనికి మీరెలా స్పందిస్తారు? 
నా లైఫ్‌లో వివాదాస్పదమైన అంశం లేదు. నేను ఇక్కడకు డబ్బుల కోసమే వచ్చాను. అందరూ డబ్బు కోసమే కష్టపడతారు. దానికి సరిగ్గా గుర్తింపు ఇవ్వకపోతే నిలదీస్తా. నాకు డబ్బు ఎగ్గొట్టాలనుకున్నవాళ్ళనే చొక్కా పట్టుకుంటా. నా తప్పు వుంటే నా చొక్కా వాళ్లూ పట్టుకోవచ్చు. నేను స్వంతగా నిలబడాలనే సీనియర్స్‌ దగ్గర పనిచేసినా బయటకు వచ్చేశాను.
 
మీది చంచల మనస్సు అనీ, గతంలో తెలుగుదేశం, తర్వాత చిరంజీవి, ఆ తర్వాత జగన్‌కు సపోర్ట్‌ చేసినట్లు టీవీల్లోనూ మాట్లాడారు. ఇలా ఎందుకు పార్టీలు మారాల్సి వచ్చింది? 
నాది చంచల మనస్సు కాదు. నాకు తోచింది కరెక్ట్‌ అని భావిస్తే.. వెంటనే రియాక్ట్‌ అవుతాను. అప్పుడు ఆ పార్టీ విధానాలు బాగున్నాయి. తర్వాత వీరి విధానాలు బాగున్నాయని చెప్పాను మినహా వ్యక్తుల గురించి ఎప్పుడూ విమర్శించలేదు. పైగా పార్టీలు పెడితే ప్రజలకు మేలు చేయాలి. అదే కొందరు చేయడం లేదని నేను అప్పట్లో మాట్లాడి వుండవచ్చు.
 
కానీ, జగన్‌తో మిలాఖత్‌ అయినట్లు విమర్శలు వచ్చాయి. దీని గురించి? 
నేను మిలాఖత్‌ అయినట్లు పేపర్లో తప్పుగా రాశారు. ఈ విషయమై ఆ పేపర్‌ అధినేత రామోజీరావు గారిని అడిగాను. దానికి ఆయన సరైన సమాధానం చెప్పలేకపోయారు. అయిన ఫలానా వాడు మంచోడు అని చెప్పడానికి నేను ఎవర్ని. ప్రజలకు ఆల్‌రెడీ తెలుసు.
 
రాజకీయాల్లో అప్పట్లో దగ్గరయ్యారు. ఇప్పుడు దూరం కావడానికి కారణం? 
రాజకీయాలు, ఎన్నికలు చాలా పొల్యూట్‌ అయ్యాయి. నేను ఎలక్షన్లలో నిలబడినప్పుడు.. 'మీరు కమ్మవాళ్ళు. మా కాపు ఓట్లు మీకు ఏయమని' జనాలే చెప్పేశారు. అందుకే నాలాంటి వాడు ఇక్కడ వుండటం కరెక్ట్‌ కాదు అనిపించింది. వ్యవస్థను కొందరు అలా తయారుచేశారు. దీన్ని మార్చాలంటే దేవుడే దిగి రావాలి. వచ్చినా అతనిపై ఏదో ముద్ర వేసేస్తారు. రామాయణంలో రాముడే అందుకు ఉదాహరణ.
 
ఈమధ్య కొందరు చనిపోతే ఛాంబర్‌ సంతాప సభలు పెడుతుంది. మరికొందరు చనిపోతే అస్సలు పట్టించుకోవడం లేదు. ఏదో తూతూమంత్రంలా కార్యక్రమాలు జరుపుతున్నారనే విమర్శ వుంది. ఏమంటారు? 
నన్ను మీరు.. ఏదో కాంట్రవర్సీలోకి లాగేస్తున్నారు. కానీ ప్రశ్నకు సమాధానం చెప్పక తప్పదు. ఇండస్ట్రీలో ఆప్యాయతలు, అనురాగాలు అన్నీ ఆర్టిఫియల్‌గా వుంటాయి. అవసరం, అవకాశం పైనే ఇక్కడ సంబంధాలుంటాయి. షూటింగ్‌ వరకు అందరూ కలిసి కుటుంబ సభ్యుల్లా మాట్లాడుకుంటారు. ప్యాకప్‌ అనగానే.. ఒకడికి ఒకడుతో సంబంధం వుండదు. ఆ తర్వాత కలిసినా పట్టించుకోరు కూడా. ఇదంతా నేను కొత్తలో ఇండస్ట్రీకి వచ్చినప్పుడు స్టడీ చేశాను. అందుకే.. అప్పుడే నా భార్యకు ఇలా చెప్పాను. 'ఒకవేళ నేను చచ్చిపోతే నా డెడ్‌బాడీని ఇండస్ట్రీకి చూపించొద్దు' అని చెప్పేశాను. ఇక్కడంతా ఆర్టిఫిషియల్‌... అందుకే అలా చెప్పాను అని ముగించారు.