గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By IVR
Last Modified: గురువారం, 17 జులై 2014 (20:55 IST)

ఎన్‌టిఆర్‌ నుంచి చాలా నేర్చుకున్నా... ‘రభస’ దర్శకుడు సంతోష్‌ శ్రీనివాస్‌

తొలిచిత్రం ‘కందిరీగ’తో దర్శకుడిగా మారిన సంతోష్‌శ్రీనివాస్‌... మలి చిత్రం కూడా అదే నిర్మాత బెల్లంకొండ సురేష్‌తో చేస్తున్నారు. అయితే రెండో చిత్రం రావడానికి మూడేళ్ళు పట్టింది. ఈ గ్యాప్‌లో తాను అగ్రహీరోలకు తగినవిధంగా కథలను రాయడంలోనూ ఉన్నానని అందుకే గ్యాప్‌ వచ్చిందని చెబుతున్న ఆయన పుట్టినరోజు ఈ నెల 18. ఈ సందర్బంగా ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు.
 
గత పుట్టినరోజుకు ఇప్పటికి తేడా ఏమిటి? 
గత ఏడాది ఎన్‌టిఆర్‌తో ‘రభస’ సినిమా తీస్తున్నట్లు ప్రకటించాను. అయితే కొన్ని కారణాల వల్ల ఆలస్యం కావడంతో ఈ ఏడాది పూర్తయింది. ప్రతిసారీ నా పుట్టినరోజు నాడు తిరుపతి వెళుతుంటాను. ఈ ఏడాది కూడా అదేరోజు అక్కడ ఉంటాను.
 
‘రభస’ ఎక్కువ రోజులు పట్టడానికి కారణం? 
సినిమాను దాదాపు 135 రోజుల్లో పూర్తి చేశాం. సినిమా షూటింగ్‌లో ఉండగానే నాకు కామెర్లు రావడంతో దాదాపు రెండునెలలు పాటు షూటింగ్‌ ఆపాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆర్టిస్టుల డేట్స్‌ విషయంలో చాలా ఇబ్బందులు పడ్డాను. దేవుడి దయవల్ల వారందరి డేట్స్‌ దొరికాక మొదలుపెట్టాను. ఆ గ్యాప్‌లో సంగీతం వర్క్‌ కూడా పూర్తిచేశాను.
 
థమన్‌ ఎటువంటి సంగీతం అందించారు? 
అందరినీ ఆకట్టకునే బాణీలు ఇచ్చాడు. ఇందులో ప్రత్యేకత ఏమంటే.. ఎన్‌టిఆర్‌ ఓ పాటను పాడటం. ఇదికూడా థమన్నే సజెస్ట్‌ చేశాడు. ‘రాకాసి రాక్షసి..’ అనే పాటను చాలా ఎనర్జిటిక్‌గా పాడాడు. ఇది అభిమానులకు విందుగా ఉంటుంది.
 
‘రభస’ అంటే ఏమిటి? ఎలా ఉండబోతుంది?
‘రభస’ అనేది రభస రభసగా ఉండే ఎంటర్‌టైన్‌మెంట్‌. ఎన్‌టిఆర్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఊపేస్తాడు. ఇక సినిమా కథ మాత్రం.... ఫూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌. సిస్టర్‌ సెంటిమెంట్‌ కూడా ఉంది. డాన్స్‌లు బాగా చేశాడు. అభిమానులు ఆయన్నుంచి ఏమి కోరుకుంటారో అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి.
 
ఎన్‌టిఆర్‌ పాత్ర ఏమి చేస్తుంది?
ఇందులో రెండు షేడ్స్‌ ఉంటాయి. మొదటిభాగం చాలా సరదాగా యూత్‌ బాయ్‌గా ఉంటాడు. రెండో భాగంలో కుటుంబంకోసం పాటుపడే పాత్ర. మాస్‌, యూత్‌ను కలిపిన పాత్ర అది. ఈ పాత్రను చూస్తే.. ప్రతి తల్లి ఇలాంటి కొడుకు ఉంటే చాలా బాగా ఉంటుంది అనుకునేలా తీర్చిదిద్దాం.  ఆయన పాత్రకు ఆయనే ఐడెంటిఫికేషన్‌. 
 
సినిమా ఎంతవరకు వచ్చింది?
ముగింపు దశలో ఉంది. ఒక పాటను చిత్రీకరిస్తున్నాం. స్విట్లర్లాండ్‌లో ఆ పాట షూట్‌ చేస్తున్నారు. ఈనెల 23తో సినిమా మొత్తం పూర్తవుతుంది.
 
రెండో సినిమా ఎన్‌టిఆర్‌తో చేయడం ఎలా అనిపించింది?
ఎన్‌టిఆర్‌తో చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆయనతో పనిచేయడం అంటే డిసిప్లెన్‌తో ఉండడమే. షాట్‌ 7గంటలకంటే ముందుగానే వచ్చి కూర్చొనేవారు. చాలా ఎనర్జిటిక్‌గా ఉండేవారు. చాలా విషయాలు ఆయనుంచి నేను నేర్చుకున్నాను. నటనలో మరో మెట్టు ఎక్కేలా ఈ చిత్రం ఉంటుంది.
 
ఎన్‌టిఆర్‌తో సినిమా అంటే ఏవైనా మార్పుల చేశారా?
కథ చెప్పినప్పుడు ఆయనకు బాగా నచ్చింది. దాన్ని మరింత ఎట్రాక్ట్‌ చేయడానికి కొన్ని మార్పులు చేయాల్సివచ్చింది. అగ్రహీరో అనగానే ఆ మార్పుల కోసం 20 రోజులు తీసుకోవాల్సివచ్చింది. పూర్తి శాటిఫై అయ్యాక సెట్‌పైకి వెళ్ళాం.
 
సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు? ఎవరిది ప్రాధాన్యత?
సమంత పాత్ర ఫుల్‌లెంగ్త్‌గా ఉంటుంది. ఏవో డాన్స్‌లకే హీరోయిన్‌ పరిమితం కాకుండా ఆ పాత్రకు ఓ పర్‌పస్‌ ఉంటుంది. రెండో పాత్ర ప్రణీతది. ఆమె డాన్స్‌లో కన్పిస్తుంది. ఆ పాత్రలో ఎంటర్‌టైన్‌మెంట్‌ కూడా ఉంది.
 
బ్రహ్మానందం పాత్ర ఎలా ఉంటుంది?
చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ‘అదుర్స్‌’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌ రిపీట్‌ అవుతుంది. అంతకంటే ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇందులో ఇవ్వగలరు.
 
ఈ కథకు ఏదైనా ఇన్‌స్పిరేషన్‌ ఉందా?
ఇది ఏ చిత్రానికి కాపీకాదు. రీమేక్‌ కాదు. నేను చాలా సినిమాలు చూస్తుంటాను. సినిమాలో చెప్పే పాయింట్‌ ఆడియన్స్‌కు నచ్చాలి. అదే కమర్షియల్‌గా వర్కవుట్‌ అవుతుంది. నా సినిమాలో అది ఉండేలా చూసుకున్నాను.
 
హిందీలో కందిరీగను తిరస్కరించడానికి కారణం?
హిందీలో నన్నే దర్శకత్వం చేయమన్నారు. కానీ ‘రభస’ పనిలో బిజీగా ఉండడంతో ఆ చిత్రం తర్వాత చేస్తానని చెప్పాను. అప్పటికే వారు షెడ్యూల్‌ వేసుకోవడంతో నాకు కుదరలేదు. నేను తీసిన సినిమాను హిందీలో తీసినా అది మంచి సక్సెస్‌ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. రేపు ‘రభస’నుకూడా హిందీలో తీసినా ఆశ్చర్యంలేదు. కథ అంత బాగా వచ్చింది.
 
బెల్లంకొండ సురేష్‌తో గొడవలు పడినట్లు వార్తలు వచ్చాయి?
ఆయనతో సినిమా చేయడం చాలా హ్యీపీగా ఉంటుంది. గొడవలు అనేవి.. కథ విషయంలో వస్తుంటాయి. ఒక్కసారి కథ ఓకే అన్నాక ఆయన దాని జోలికి రారు. అన్నీ దర్శకునిపై ఒదిలేస్తారు. నిర్మాణానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చూస్తారు. ఈ సీన్‌కి ఇది కావాలా.. వద్దా అనే చూడరు. కావాలి అంటే వెంటనే ఎంత ఖర్చయినా పెట్టి సమకూరుస్తారు. తెలుగు నిర్మాతల్లో అంత కంఫర్ట్‌ నిర్మాత నాకు తెలీదు.
 
తదుపరి చిత్రాలు?
ఉన్నాయి... ‘తిక్కరేగితే’ అనే టైటిల్‌ పెట్టాను. కథ రెడీ అయింది. హీరో బేనర్‌ ఇంకా ఫైనల్‌ కాలేదు. బన్నీకి కథ చెప్పాను. తనకీ కథ నచ్చింది. రవితేజకూ చేయాలనుంది. ఇంకా ఆయన వినలేదు. ఆ తర్వాత 14 రీల్స్‌ బేనర్‌లో సినిమా, దానయ్యగారితో మరో సినిమా చేయాల్సి ఉంది.
 
చిన్న హీరోలతో సినిమాలు చేయరా?
నాకు ‘ఏ మాయ చేసావె’ వంటి చిత్రాన్ని చేయాలనుంది. మంచి కథ దొరికితే అటువంటి సినిమాను చేస్తాను. తక్కువ బడ్జెట్‌తో కొత్తవారితో చేయాలనుంది. అవికూడా నా బేనర్‌లో నా అసిస్టెంట్లకు అవకాశాలు కల్పించి చేయాలనుంది. అంటూ ముగించారు.